| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనిన విని యజాతశత్రుండు, గంగాపుత్త్రుతోఁ ‘బుణ్యతీర్థ విశేషంబులు వినవలతుం జెప్పవే’ యనుటయు నమ్మహీపతికి నమ్మహితాత్ముం డిట్లనియె; ‘తొల్లి గౌతముఁ డడుగ నంగిరసుండు దీర్థంబులు గొన్నింటి ప్రకారంబు సెప్పె; నప్పరిపాటి సెప్పెద; నాకర్ణింపుము. | 071 |
| సీ. |
సప్తదినంబులు చంద్రభాగను, విత | స్తను, నూర్మి మాలినిఁ దగ వసించి యాహారవిరహితుండై యుండ ముని సమా | నుం డగుఁ, గాశ్మీర మండలమున నదులు గొన్ని మహావనము సొచ్చి పాఱు ది | వంబు సిద్ధించుఁ దదంబుసేవఁ; బుష్కరమ్ముఁ బ్రభాసమును, నైమిశము, నింద్ర | మార్గంబు, దేవికా స్వర్గబిందు |
|
| తే. |
లును, సమవగాహనంబున జనుల నప్ప | రస్సమేత విమానవర్తనులఁ జేయు నవనినాథ! హిరణ్యబిందువుఁ, గుశేశ | యంబు, నెల్ల పాపంబుల నపనయించు. |
072 |
| వ. | గంధమాదన సంగతయైన యింద్రతోయయుం, గురంగదేశగత యగు కరతోయ యుం, ద్రిరాత్రోపవాసోపేత స్నాతకులకు నశ్వమేధఫలంబు గలుగం జేయు. | 073 |
| తే. |
కనఖలమున, గంగాద్వారమునను, నీల | భూధరమునఁ, గుశావర్తమునను, బిల్వ కమున, సుస్నాతుఁ డై పాతకములు దొఱఁగి | నాకలోక విహారంబు నరుఁడు వొందు. |
074 |
| క. |
భాగీరథి యెచట నుద | గ్భాగమునను శివుని నెలవు ప్రాంతమునఁ జనున్ ధీగణ్య! యచట నెలకు స | మాగతులగు సురలఁ గం డ్రనాహారవిధిన్. |
075 |
| సీ. |
ఆహార ముడిగి మహాశ్రమంబున నగ్ని | హోత్రియై యొకమాస ముండి నరుఁడు సకల సిద్ధులు మహాశ్చర్యంబుగాఁ గను, | జననాథ! భృగుతుంగమను మహా హ్ర దమ్మున వాసరత్రయ ముపవాసి యై | బ్రహ్మవధంబు పాపంబుఁ దొఱఁగు; వినుము! కన్యాకూపమున సాగ్నిహోత్రత | నున్నఁ గీర్తితుఁ డగు; నుభయలోక |
|
| తే. |
ములను సుందరికాహ్రదంబునను దగఁగ | సకృదుపస్పర్శనము చేసి చారుమూర్తి యై జనించు; వైమానిక మనఁగఁ బరఁగు | భవ్యతీర్థంబు సేవించి పడయు దివము. |
076 |
| తే. |
కృత్తికాంగార సంసేవ గిల్బిషములఁ | బాపి నాకంబుఁ జేర్చు విపాశఁ ద్రిదివ సములు, గాలికాశ్రమ బ్రహ్మచర్య నియతి | తోడ సేవింప జన్మంబు దొఱఁగు నరుఁడు. |
077 |
| క. |
స్నానముఁ బితృతర్పణమును | మానితగుణ! కృత్తికాశ్రమంబున నియతిన్ మానవులు సేసి శివు కొలు | వానందాత్మకతఁ గాంతు రండ్రు మునీంద్రుల్. |
078 |
| తే. |
ద్రోణశర్మ పదంబున రూఢ మైన | తీర్థమును, శరస్తంబంబు, దేవదారు వనముఁ దమ్ము సేవించిన మనుజు నెట్టి | వానినైనను నప్సరోవరునిఁ జేయు. |
079 |
| తే. |
చిత్రకూట జనస్థాన సేవనములు | రాజలక్ష్మి నొసఁగు; వీతభోజనత్వ మహితవృత్తుఁడై; శ్యామాశ్రమమున నొక్క | పక్ష మున్న నంతర్ధ్యాన ఫలము గలుగు. |
080 |
| క. |
విమలమతిం గౌశిక వా | లమున, ననాహార మౌనలంపటుఁ డై యు న్న మనుజుఁ డిరువదియొక్కది | నములం బరమగతి సాధనశ్రీ నొందున్. |
081 |
| సీ. |
పేర్చు మతంగవాపిక నేకరాత్రంబు | నిలిచి సిద్ధుం డగు, నెల వసించి నైమిశంబునఁ బొందు నరవర! పురుష మే | ధ ఫలంబు, నట్టి విధంబ యుత్ప లావనంబునఁ జేయఁగా విను మశ్వమే | ధంబు ఫలంబు నర్ధంబుఁ బడయు నరుఁడు గంగా యమునా సంగమంబునఁ | గాలాంజనం బను శైలమునను |
|
| తే. |
నియతి నాచరితస్నానుఁ డయి విముక్తి | తెరువు గాంచు, వైవస్వత తీర్థసేవఁ దీర్థభూతత్వ మొందు విధేయ చిత్త | వృత్తిఁ గౌరవవంశ పవిత్ర చరిత! |
082 |
| ఆ. |
విను, ప్రయాగమునకుఁ జనుదెంచుఁ గోటిత్ర | యంబు, దశ సహస్రకంబుఁ, దీర్థ ములు నరేంద్ర! దర్శమున నందు నెలనాళ్ళు | లున్న నరుఁడు ముక్తి కొడయఁ డండ్రు. |
083 |
| క. |
విను, గంగను బ్రహ్మశిరం | బను తీర్థమునందు నెల నిరాహారతమై నునికిని మర్త్యుం డమృతాం | శునిలోకంబున మహాయశుండై యుండున్. |
084 |
| సీ. |
అనఘ! యష్టావక్రమును, గలవింకము, దేవహ్రదము, బ్రహ్మభావ మొసఁగు నాచరితస్నానుఁ డగు మర్త్యునకు నుర్వ | శీ కృత్తికా యోగసిద్ధ కీర్తి యైన, లౌహిత్యంబునందు సుస్నాతుఁడై | పుండరీకాధ్వరమున ఫలంబుఁ బొందు, రామహ్రదంబున నిరాహారుఁడై | పండ్రెండు దినములు భరిత నియతి |
|
| తే. |
నున్న సకలకల్మషములు నుజ్జగించు | నరుఁడు, నిర్భోజనత నెలనాళ్ళు దా మ హాహ్రదావాసియై జమదగ్నిఁ గన్న | పుణ్యలోకంబుఁ గను మునిగణ్యుఁ డగుచు. |
085 |
| క. |
విను వింధ్యంబున నొక నెల | తనుతాపము నోర్చి చేయుతపమున జనరం జన! సర్వప్రాయశ్చి | త్త నిరూఢిం బొంది నరుఁడు ధర్మజ్ఞుఁ డగున్. |
086 |
| సీ. |
నర్మద నాడి భూనాథనందనుఁ డగు, | జంబుమార్గంబున సంయతాత్ముఁ డై మాసములు మూఁడు నట యొక్క నాఁడును | నిలిచిన, సర్వసిద్ధులను బొందుఁ గోకాముఖము నీరఁ గ్రుంకి, తండులికాశ్ర | మమునకుఁ జని, వల్కలము ధరించి, శాకభోజనుఁ డయి, శాంతిమై నున్న న | న్నెలవున నున్న కన్నెలు పదుండ్ర |
|
| తే. |
కథిపుఁడై యజరామరుండయి సుఖించుఁ, | గుల్యయందుఁ ద్రిరాత్రమ్ము, గుడుపు దక్కి శౌచియై యఘమర్షణ జపము చేసి | యశ్వమేధఫలముఁ బొందు ననఘ! నరుఁడు. |
087 |
| వ. | ఆర్‌ష్టిసేనాశ్రమంబున నుజ్జానక స్నాతుండై, మర్త్యుం డఖిల పాపంబులం దొఱంగు; పిండారకంబున నేకరాత్రంబు నిలిచి యగ్నిష్టోమఫలంబుం బడయు; ధర్మారణ్యంబున బ్రహ్మసరస్సు సేవించి పౌండరీకఫలప్రాప్తిఁ గాంచు. | 088 |
| చ. |
జనకుఁడు గౌరికిన్, వినుము, శంకరు మామ, హిమాద్రి సర్వర త్ననికర విశ్వపుణ్య భవనంబు ప్రశాంతత నందు నిల్చి స న్మునిగణ సేవనంబుఁ దపమున్ నడపంగ నరుండు సిద్ధుఁడై వినుతికి నెక్కుఁ బొందు నరవిందభవాంతిక వాస సంపదన్. |
089 |
| క. |
విను, తీర్థసేవ గామం | బును గ్రోధము మదము లోభమును జేరని నె మ్మనము గలిగి నడపవలయు | ననఘా! ఫలసిద్ధి దాననగుఁ బురుషునకున్. |
090 |
| క. |
దమమును దపము నహింసయు | శమమును తీర్థముల వాన శౌచాతిశయం బమలగుణ; కల్గు, రిత్త జ | లములం దోఁగిన శుచిత్వ లాభము గలదే? |
091 |
| క. |
దొరకొనని వానిఁ గోరక, | దొరకొనినందున మమత్వ తుష్టహృదయతం బొరయక, విగతస్పృహులగు | పురుషులు, శుచు; లేల తీర్థములు వారలకున్? |
092 |
| ఆ. |
అరయ దుర్గమములు, నతి విషమంబులు | నైన తీర్థములు ధరాధినాథ! యధిక భక్తి యుక్తి నాత్మఁ దలంచినఁ | జాలు నరుల కల్మషములు వాయు. |
093 |
| క. |
జనవర! తీర్థ విధాశం | సన మగు నీ పుణ్యవాక్యచయము పవిత్రం బనుపమము మాననీయం | బనిమిషపదవీప్రదము రహస్యము సుమ్మీ! |
094 |
| క. |
అనుగతుఁ డగు శిష్యునకుం’ | దనసుతునకుఁ, జుట్టమునకు, ధరణీసుర ము ఖ్యనియతి పదద్విజాతుల | కును, దగ నెఱిఁగించునది యకుంఠిత కరుణన్. |
095 |
| క. |
నరవర! గౌతమునకు నం | గిరసుఁడు సెప్పినది యిది, యకిల్బిషబుద్ధిం బరిపాటిఁ బఠించినఁ ద | త్పరత వినిన నపుడ పాయుఁ బాపము లెల్లన్. |
096 |
| క. |
మునులకు జప్యం బిది, స | ద్వినుతముఁ నిత్యముఁ బఠించు విమలాత్ములకున్; విను, జాతి స్మరణముతో | జననం బతిపుణ్యపురుష సంతతి గలుగున్.’ |
097 |