| వ. |
అని చెప్పె నయ్యవసరంబునం బుణ్యవిశేష గణ్యుండైన యగ్గాంగేయుం డట్లు గాండీవిశరంబులు శయ్యగా వీరశయనంబున నునికి నతని వీక్షింప నత్రియు, వసిష్ఠుండును, భృగుండును, బులహుండును, బులస్త్యుండును, గ్రతువు, నంగిరసుండును, నగస్త్యుండును, గణ్వుండును, గౌతముండును, విశ్వామిత్రుండును, జమదగ్నియు మొదలైన మహామునులు శిష్యవ్రాతంబుతో నేతెంచి తపఃప్రభావ స్ఫురిత ప్రభాపూరంబు భూనభోంతరంబున సంతతంబు లగుచుండ నిలిచి, యద్దేవవ్రతుని యున్న తెఱంగు గలయం గనుంగొనిరి, పాండవు లాశ్చర్య భరిత చిత్తులగుచు నత్తపోధనవర్యులం బ్రస్తుతించుచుం బ్రణమిల్లిరి; అప్పుడప్పరమసంయము లంతర్ధానంబు సేసిరి, అక్కౌరవులు నక్కురుపితామహుండును దారును వారల మాహాత్మ్యంబు లుగ్గడించుచుఁ దద్విషయంబైన సంభాషణం బొనర్చిరి; తదనంతరంబ.
|
098 |