| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| సీ. |
అతనికి నాతఁ డిట్లను; ‘నివ్విషయమునఁ | గల దితిహాస మొకండు, దానిఁ వివరింతు నీ కుంఛవృత్తిపరుం డగు | నొక విప్రునింటికి నొక్క సిద్ధుఁ దతిథియై వచ్చిన, నాతిథ్య మొనరించి | యతనితో సల్లాప మాచరింప, నమ్మహాత్ముండు నీ యడిగిన యట్టుల | యా సిద్ధు నడిగిన, నతఁడు సెప్పె |
|
| తే. |
ననఘ! యెవ్వాని నడుముగా నరిగెఁ బావ | నాంబుపూర భాగీరథి యట్టి దేశ భూధరాది పదార్థముల్ పుణ్యతమము; లట్లు గాకయు గంగ మహత్త వినుము. |
101 |
| తే. |
త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి | గతి, జనములకు నియత కల్పితము లయ్యు నధ్వరంబును, బ్రహ్మచర్యంబు, దపము | సంపరిత్యాగమును, జేయఁజాల వనఘ! |
102 |
| క. |
మే నించుక సోఁకిన గం | గానది తోయములు జనుల కల్మష కోటిం బో నడిచి పురందర లో | కానందముఁ బొందఁ జేయు నాగమవేదీ! |
103 |
| క. |
మును పాపము లెన్ని యొన | ర్చినఁ బిదపను గంగ నాడఁ జీఁకటి రవి దోఁ చిన విరియుగతి విరియు; న | య్యనఘుఁ డిలాతలము దొఱఁగి యమరత నొందున్. |
104 |
| తే. |
ఎన్ని యేఁడులు, మనుజుని యెమ్ము గంగ | వారియం దుండు, నన్ని వేల్వత్సరములు నాకలోక మహాసుఖశ్రీకి నాతఁ | డత్తి యుండును నిర్మలచిత్తవృత్తి. |
105 |
| సీ. |
అనఘ! సోమము లేని యధ్వరంబును, శశి | లేని రాత్రియు, రవి లేని నభము నాత్మధర్మము లేని యాశ్రమంబును, బుష్ప | సంపద లేని భూజమును బోలె, హీనత నొందు, గంగానది లేని దే | శంబు, చాంద్రాయణ శతము లైన గంగాపయః పానకరణంబు గావించు | నిర్మలత్వముఁ జేయ నేర; వగ్ని |
|
| ఆ. |
యందుఁ బడిన దూది యట్లగు గంగావ | గాహనమునఁ బాతకంబు లఖిల భూతములకు దుఃఖములు వాపి కొనుటకు | నేవిధములు గంగ కీడు గావు. |
106 |
| క. |
శరణంబు లేని జనులకుఁ | బరమశరణ మండ్రు మునులు భాగీరథి, ని ర్జరులకు నమృతము లట్టుల | నరులకు గంగాజలం బనఁగ నే విందున్. |
107 |
| క. |
తలపై జాహ్నవి వాలుక | యలికికొనిన ఫాలతటిఁ దదంతర్మృత్సం కలితముఁ జేసిన, బాపం | బులు దొలఁగు సుపర్ణుఁ గనిన భుజగముల క్రియన్. |
108 |
| క. |
గంగాతరంగశీకర | సంగతమగు మారుతమున సద్య స్స్పర్శం బంగీకరించునెవ్వఁడు | భంగపఱుచు నతఁడు ఘోరపాపచయంబున్. |
109 |
| తే. |
ఇవుల నేడు దరంబుల, నవుల నేడు | దరములను, బితృవర్గంబు, నరుఁడు గంగ నాడి శుచిఁ జేయుఁ జూచిన యంతమాత్రఁ | బాచు వాఙ్మనః కాయజ పాపతతుల. |
110 |
| తే. |
వినిన, వేడుక సేసినఁ, గనినఁ జేత | నంటినను, రెండు కులములయందుఁ గలుగు పితృగణంబుల నెల్ల, సద్గతికిఁ బుచ్చు; | గంగ యెటు సేయునో యవగాహనమున. |
111 |
| క. |
విను, గంగ గంగ యను కీ | ర్తనములతో నొండునీటఁ దగ మునిఁగిన య జ్జనులు దురితములఁ దొఱఁగుదు | రని యార్యులు సెప్ప విందు నంచితచరితా! |
112 |
| సీ. |
అనఘ! చూడ సమర్థుఁ డగువాఁడు జాహ్నవిఁ | జూడకయున్నఁ బశుప్రతిముఁడు నంధ సమానుండు నగు ; నింద్రుఁ డాదిగా | సురలు గోరెడు గంగ నరులు గోర వలదె? చేకుఱు నపవర్గ ముత్క్రమణ కా | లంబున గంగఁ దలంచి రేని; రాజభయంబుఁ, జోరభయంబుఁ బాప భ | యంబును, భూతభయంబు, లోను |
|
| ఆ. |
గాఁగఁ గలుగు భయనికాయంబు, గంగా ప్ర | శంసనమునఁ బాయు; శంభుఁ డర్థి నతులపుణ్య యైన యద్దేవి దివినుండి | రా ధరింపఁడే శిరస్తలమున. |
113 |
| తే. |
మూఁడు పథములఁ జని, లోకములకు మూఁటి | కుజ్జ్వలాలంకృతియుఁ బెంపు నొసఁగినట్టి, యమలతరమూర్తి యగు దేవి నాశ్రయించు | వాఁడు కృతకృత్యుఁ డిది నిక్కువము కృతాత్మ! |
114 |
| క. |
జనులకు నింద్రుఁడు, గ్రహముల | కినుఁడును, దారలకు నోపధీశుఁడ పోలెన్ మనుజోత్తమ ! కడు నెక్కుడు | వినుము, నరుల కెల్ల జాహ్నవి మహత్త్వమునన్. |
115 |
| ఆ. |
సగరనృపతి పుత్త్రచయము, మునీంద్ర శా | పమున భస్మమై యపారదురిత కల్మషంబుఁ బొందఁగా గంగ నిజజల | సేక మొసఁగి యనిచె నాకమునకు. |
116 |
| తే. |
దేవతలఁ జిత్రతపమునఁ దెలచి, గంగఁ | బ్రచుర పౌరుషుఁ డగు భగీరథుఁడు దనదు పూర్వులైన సగర నృపపుత్రులకు ను | దాత్త గతికయి తెచ్చె నిద్ధరణి కనఘ! |
117 |
| ఆ. |
విష్ణుపదము వలన, విధుని వలన, సూర్యు | వలన, మేరురూపకలితుఁ డైన విష్ణువలనఁ, ద్రిపుర విజయి మౌళివలన | నుండి హిమనగమున నొలసె గంగ. |
118 |
| క. |
విను, తత్పర భావంబున | మనంబు నిశ్చలత వొంద మనుజుఁడు శరణం బని యాశ్రయింప జాహ్నవి | సనాతన పదోపలబ్ధి సంపద నొసఁగున్.’ |
119 |
| వ. | అని చెప్పి సిద్ధుండు, వెండియు. | 120 |
| క. |
ఏ నెఱిఁగినంత సెప్పితిఁ గాని యనంత మహిమంబు గంగా గుణ సం తానంబు, శతానందము | ఖానిమిష ప్రవరకీర్త్య మనఘచరిత్రా! |
121 |
| క. |
మేరువు మణులును, వారిధి | వారి కణంబులును నెన్ను వడు వగు గంగా స్ఫారగుణంబులు తగు సం | ఖ్యారూఢంబులుగఁ జేఁత యతులవివేకా! |
122 |
| వ. | అని పలికి యిట్లనియె. | 123 |
| ఆ. |
వేడ్క నీకు నేను వివరించినట్టి యీ | జాహ్నవీ గుణములు, సంతతంబు మనసు, వాక్కుఁ దనువు ననఁగల సాధన | ముల భజింపు భక్తిపూర్వకముగ. |
124 |
| తే. |
అట్టులైన గంగా ప్రసాదాతిశయము | వలన సిద్ధుండవై, త్రిభువనములందు నర్చనీయ సంక్రీడన మవిహతముగ | సంచరించు మాహాత్మ్యంబు సంభవించు. |
125 |
| క. |
నిజధర్మ నిరతుఁడై తను | భజించు సజ్జనుని చిత్తపద్మము గృపఁ దా భజియింప గంగ యతనిం | బ్రజనిత చిరసౌఖ్యుఁ జేయుఁ బావనచరితా!’ |
126 |
| వ. | అని యిట్లు గంగా గుణంబు లమ్మహాద్విజునకు వివరించి యా సిద్ధుండు గగన గమనంబునం జనియె; అ వ్విప్రోత్తముండు నియతచిత్తుండై గంగాసేవనం బాచరించి యనన్యసులభ యగు సిద్ధింబడసెఁ; బాండ వాగ్రజా! నీవును గంగా భజనంబునం బరమశుభంబు నొందుము.’ | 127 |
| క. |
అని చెప్పి, శాంతనవుఁ డి | ట్లను ; ‘గంగాస్తోత్ర సహితమై పరఁగిన యి వ్వినుతేతిహాసముఁ బఠిం | చిన వినినను రుజలు వాయుఁ జెంద వఘంబుల్.’ |
128 |
| క. |
అనిన విని, యన్నరేంద్రుం | డనుజ సహితముగఁ బ్రభూతహర్ష సమున్మీ లన కలనా సంవేశిత | మనస్కుఁడై యాతనికి నమస్కృతి సేసెన్. |
129 |
| వ. | ఇట్లు పరమహర్షంబునం బ్రణతుండై, ధర్మజుండు మందాకినీ తనయుతో ‘నెవ్వరు సర్వ జనపూజ్యు? లెఱింగింపవే? భవద్వచనామృతంబునఁ దృప్తి సనక యడిగెద’ ననిన, నమ్మహాత్ముండు ‘వాసుదేవ నారద సంవాదంబను నితిహాసంబు వినుము; నీ యడిగిన యర్థంబు దానం దేటపడియెడు’ నని పలికి యతని కిట్లనియె. | 130 |