పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
వాసుదేవ నారద సంవాద ప్రకారము (సం. 13-66-1 (కుంభ))
వ. ‘తన కడకు నారదుఁడు వ | చ్చిన సత్కారము దగంగఁ జేసి, ముకుందుం
డను సమధిక బహుమానం | బున ‘నెవ్వారలకు నీవు మ్రొక్కుదు చెపుమా!’
131
వ. అనిన నద్దేవముని యద్దేవకీనందనున కిట్లనియె. 132
సీ. ‘వరుణు, సమీరణుఁ, దరణిఁ, బర్జన్యుని, | సప్తార్చి, నీశాను, షణ్ముఖుని, మ
హాలక్ష్మి విష్ణుని, నజు, బృహస్పతిఁ, జంద్రు | జలముల, భూమి, నెజ్జనము లెపుడు
నతిభక్తి సేవింతు రట్టి వారలకు నే | మ్రొక్కుదు; వేదపరులుఁ, దపోధ
నులు, దేవతా పూజనులు, భూమి ధన ధాన్య | గోదాన శీలురు, నాదరంబు
 
ఆ. గల్గి యతిథిపూజ గావించువారలుఁ | బితృసమర్చకులును, భిక్షితాన్న
పూత శాంత భావములు గలవారు స | త్యవ్రతులును బూజ్యు లనఘ! నాకు.
133
క. వినుత త్రివర్గనిరతులు, | ననహంకార మమకారులగు జనులు, సువ
ర్తన యుతులు, నలోలురు, బో | ధనులు, నమస్కార్యు లద్రిధర! విను నాకున్‌.
134
క. నీవును, మత్సంపూజ్య జ | నావలిఁ జిత్తమున నెఱిఁగి, యర్చనమును, సం
సేవనము, నడుప భూరి శు | భావహ మగు నవ్విధంబు యాదవసింహా’!
135
క. అనియెం గావునఁ గుంతీ | తనయాగ్రజ! నీవు నివ్విధముల జనములం
గొనియాడుము, వారలు శో | భనము లొసంగుదు రఘంబుఁ బాపుదురు కృపన్‌.’
136
వ. అనిన విని యమ్మహీశ్వరుం డమ్మహితాత్మున కిట్లనియె. 137
క. ‘జనపతులకుఁ గర్తవ్యము | లనేకములు గలవు వానియన్నిటిలోనన్‌;
వినుత ప్రధానకృత్యం | బనఘచరిత ! చెప్పవే దయం దెలియంగన్‌.’
138
క. అనుటయు నతనికి నతఁడి | ట్లను; ‘సామ్రాజ్యాభిషిక్తుఁడైన నృపతికిన్‌
విను, కర్తవ్యతమం బగు | పని, బ్రాహ్మణపూజనంబు భవ్యవిచారా!
139
క. భూనాథ! విప్రులు సమా | ధానంబున నున్నఁ బొదలు ధరణి, శుభమ్ముల్‌
మానార్హు లగుట, వారికి | మానన లేకున్న నడఁగు మనుజాధీశా!
140
క. దైవంబు నదైవముగ, న | దైవము దైవముగఁ జేయ ధరణీదివిజుల్‌
భూవర! శక్తులు విను వా | రేవానికిఁ గూర్తు రతఁ డధీశత నొందున్‌.
141
క. కోపమునఁ, బ్రసాదంబున, | నాపదయును,సంపదయును, నప్పుడ తే వా
రోపుదు రింద్రునకైనను; | శాపానుగ్రహము లా సుచరితుల లీలల్‌.
142
క. ద్రవిడ కళిం గాశీనర | యవన శక పుళింద నృపతు లవని సురపరా
భవమునఁ గాదే, ధరణీ | ధవ! పొందిరి తొల్లి శూద్రతా దైన్యంబున్‌.
143
క. సోమాత్మకు లీశ్వరతా | శ్రీమహితులు, సర్వసౌఖ్య సిద్ధి కరులు, గో
త్రామరులు, వారి నెప్పుడు | భూమీశ్వర! పూజనములఁ బోషింపు తగన్‌.
144
క. వినుతాచారుం డగు వి | ప్రునకు, సభక్తికము గాఁగ, భోజన మిడినన్‌
విను, దేవపితృ సమూహము | లనూనపరితృప్తిఁ బొందు నతులచరిత్రా!’
145
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )