| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అనుటయు నతం డతని కిట్లనియె; ‘అతివలు నీ చెప్పినట్టివార; దీనికి నారద పంచ చూడా సంవాదం బనంబరఁగు నితిహాసంబు గలదు; వనితా స్వభావ విషయంబయి యుండు; దాని నాకర్ణింపుము. దేవ మునివరుం డగు నారదుం డెందునుం జరించుచుండి పంచచూడ యను నచ్చరలేమ నొక్కెడం గాంచి. | 166 |
| క. |
‘ఏ నొక్కటి యడిగెదఁ జెపు | మా నళినదళాక్షి’! యనుడు మా కొలఁదుల ప ల్కైన సదుత్తర మిచ్చెద | నానతి యి ‘మ్మనియె నది ప్రియం బెసఁగంగన్. |
167 |
| వ. | అనుటయు నతండు. | 168 |
| క. |
‘వనితా స్వభావ మిట్టిది | యని తెలియం జెప్పు ‘మనుడు, నల్ల నగుచు న వ్వనిత‘ తగునయ్య! వనితకు | వనితల దుశ్చేష్టితములు వాక్రువ్వంగన్.’ |
169 |
| క. |
అనిన విని, ‘నిక్క మాడిన, | విను, త ప్పించుకయు లేదు; వివరింపు నిజం’ బని ముని పల్కిన, నయ్యం | గన యతనికి నిట్టు లనియెఁ గౌరవముఖ్యా! |
170 |
| వ. | ‘స్త్రీ స్వభావంబులు నీ వెఱుంగని యవి లేవు, ఐనను జెప్పెద నవధరింపుము. | 171 |
| క. |
కులమును, సమ్మాన్యతయును | గలిగి, యొరుని భార్య యైన గౌరవలీలన్ మెలఁగుచు వెలిఁ జరియించున్ | లలన వలసినట్ల యే మనం గల దనఘా!’ |
172 |
| వ. | అని పల్కి వెండియు. | 173 |
| సీ. |
‘యోషిజ్జనంబులు దోషంబులకు నెల్ల | మూలంబు; వారల నేల చెప్ప నడిగితి గానఁ గన్నంత సెప్పెద విను, | పురుషులమేలిమి పొలఁతు లెఱుఁగ; రదిగాక నిర్లజ్జలై కుత్సితుల భజి | యింతురు కదిసినయంతఁ జేసి, వర్జనీయులు లేరు వారల కెవ్వరు | దండభీతిన పాడి దప్పకునికి, |
|
| తే. |
యగ్ని కాష్ఠముల మహాంబుధి యేఱుల | నంతకుండు భూతసంతతులను వనజముఖులు పురుషులను దృప్తిఁ బొందుట | గలుగదండ్రు కోవిదులు మునీంద్ర! |
174 |
| క. |
కల దొక రహస్య గోపన | మలఘుమతీ! వినుము పురుషు నన్యుం గనినం బొలఁతులకు, నేమి సెప్పుదుఁ? | గలుగుఁ బదను తోడి కళలు గామగృహమునన్’ |
175 |
| వ. | అని వెండియు. | 176 |
| క. |
‘కుడుచుట, కట్టుట, పూయుట | తొడుగుటయును, వివిధ ధనతతులు గూడుట, యె క్కుడు వేడ్కసేయఁ జాలవు | పడఁతికిఁ బరపురుషుఁ గవయఁబాఱుట వోలెన్.’ |
177 |
| వ. | అని చెప్పిన విని నారదుండు ‘నిజంబు పల్కి’తని పంచచూడ ననిపి నిజేచ్ఛం జనియె’ నని చెప్పిన విని, ధర్మజుండు ‘సుందరీ జనంబులఁ గాచు తెఱం గెఱింగింపవే’ యని యడిగిన, నాపగాతనూజుం డతని కిట్లను ‘వారు మయశంబరాది మాయలం గడచిన మతకంబులు గలిగి నిరూపింపరాక యుండుదురు; అది యునుం గాక వేఱొక్క విశేషం బాకర్ణింపుము. | 178 |
| తే. |
తొల్లి నిర్దోషచిత్తత నెల్ల జనులు | వలచినప్పుడ దేవత్వ వైభవంబు నొందఁ జాలి యుండుదురు మాయోపయుక్తి | వనితలకు లేక, సాధ్వులై యునికిఁ జేసి. |
179 |
| వ. | దానికి దివిజులు అసూయాగ్రస్తులై కమలయోనిం గానం జని నిజచిత్త ప్రకారం బెఱింగించిన, నతం డతివల మాయావతులం గావించి, వారికిఁ గామం బగ్గలంబుగాఁ జేసినం; బురుషులు వారి చిక్కులంబడి రోషాది దుర్గుణ దూషితు లగుటం జేసి విగతానుభావు లైరి; దేవతలును బ్రియం బందిరి; అట్లు గావున. | 180 |
| క. |
వనితలు మాయావిను లై | యనిరూపిత చిత్తవృత్తి నంచిత రక్షం బనువడ కుండుదు; రైనను | వినినది కథయొకటి నీకు వినిపింతుఁ దగన్. |
181 |