| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | దేవశర్మ యను మునిభార్య రుచి యను నంగన సర్వాంగ సుందరియై యుండుఁ; దదీయ రూపాతిశయంబు దేవగంధర్వాదులకును లోచనీయంబు. | 182 |
| క. |
అతఁ డొక నాఁ డొక యెడ కొక | క్రతువున కుపదర్శనంబు గావింపఁగఁ బో వు తలంపు పుట్టి, వికస | న్మతి యగు తన శిష్యు విపులనామకునిఁ దగన్. |
183 |
| వ. | పిలిచి యేకాంతంబున నతని కిట్లనియె. | 184 |
| క. |
‘రుచి నెపుడు వేచి తిరుగును | శచీవిభుఁడు; దాని నెఱిఁగి సంరక్షణ మే నుచితంబుగ నొనరింతు, వి | కచకమలనిభాస్యఁ జేరఁ గానఁ డతండున్. |
185 |
| తే. |
నాకుఁ గ్రతువు సేయింపఁ జనంగ వలసి | యున్నయది; పరదారసముత్సుకుండు శక్రుఁ; డటుగాన, రుచికి రక్షావిధాన | మాచరింపుము నీవు దృఢావధాన!’ |
186 |
| క. |
అనిన విని ‘యట్లు సేసెద’ | నని విపులుఁడు గురునితోడ ‘నమరవిభుం డే యనువునఁ జొచ్చు నొకో పర | వనితాహరణమున’ కనియె వసుధాధీశా! |
187 |
| క. |
అనుటయు ననేక మాయలు, | పొనరుపఁగా నేర్చు రూపములు పెక్కులు గై కొను పక్షిమృగాదిత్వము | లొనరఁగ నవి నియతి నరసి యుండఁగ వలయున్. |
188 |
| క. |
రుచి మీఁదం గన్నిడి యా | శచీవిభుఁడు దిరుగు, విను మసంశయము సుమీ! యిచటికి నాతఁడు వచ్చుట; | యచలితమతి నమ్మృగాక్షి నరయఁగ వలయున్.’ |
189 |
| క. |
అని యప్పగించి యాగం | బున కమ్ముని సనియె; నవ్విపులుఁడును జిత్తం బున నవధానము దృఢముగ | వనితం గాచికొని యుండె వసుధాధీశా! |
190 |
| వ. | అట్లుండి యొక్క యనువు విచారించుకొని. | 191 |
| క. |
‘ఆవేశించెద యోగ | ప్రావీణ్యంబున మునీంద్రు భార్యం, దప్పే? యా విశ్రుతాత్ము మనమున | కీ విజ్ఞానంబు దోఁచునే? వెఱ పేలా?’ |
192 |
| వ. | అని వితర్కించి యమ్ముని చాతుర్య కారుణ్యంబు లూఁది శంకదక్కియక్కొమ్మ కింతనంత నాసీనుండై యుచిత కథ లొక్కింతసేపు సెల్లించి, యోగమాయాబలంబునం జేసి నడపుటయు. | 193 |
| ఆ. |
పవనుఁ డాకసమునఁ బరఁగు విధంబున | నమ్మృగాక్షి తనువునందుఁ గలయ విపులు నాత్మ దగఁ బ్రవేశించె నవ్వధూ | రత్నమునకు నెఱుఁగ రాకయుండ. |
194 |
| వ. | ఇట్లు ప్రవేశించి యయ్యోగివరునాత్మ యన్నాతి చైతన్యంబు జడంబుగాఁ జేసికొని యుండె; అట్టియెడం బురందరుం డతిసుందరం బగు నాకారంబు దాల్చి యచ్చటికి వచ్చి విపులుని శరీరంబు సూచి నిద్రితునింగాఁ దలఁచుచు నున్మదుండగుటం జేసి యొండు పరికింపక మునిపత్నిం జేరవచ్చి. | 195 |
| క. |
‘నీవు కతంబుగ నాదగు | భావంబును భావభవుఁడు పఱచుట యరయం గావలదే; యని పలికిన, | భూవర! యప్పొలఁతి మూఢబుద్ధిత్వమునన్. |
196 |
| క. |
సముచితముగఁ బ్రతుత్థా | నము సేయను, దగిన పలుకునకుఁ జొరఁగను నే రమి నూరకున్ననుం దమ | కము పెంపున నతఁడు మఱియుఁ గమలాననతోన్. |
197 |
| క. |
‘ ఏ నమరేంద్రుఁడ నాదగు | మానముఁ గామశిఖి గ్రాఁచె; మానిని! దడయం గా నేల? నన్నుఁ దగ స | మ్మానింపుము; నీకు సిగ్గు మా టింకేలా?’ |
198 |
| వ. | అనుటయు నత్తన్వి తనువున నున్న విపులుండు దన యోగమాయం జేసి యవ్వనిత వాసవునితో ‘నీకు నిందు రాఁ బనియేమి?’ యనిపలికి పరవశ యగునట్లుగాఁ జేసినం జూచి యతండు వ్రీడా భయభరిత చిత్తుండయ్యె; నయ్యవసరంబున. | 199 |
| ఉ. |
అమ్మునిశిష్యుఁ డయ్యువిద యంగము వాసి, నిజాంగవర్తియై యమ్మరుదీశుతో ‘మఱచితా మును మూఁడిన యబ్భగాంకిత త్వ మ్మొకభంగి నీఁగు టిది, దైవతసంయమి సేవనీయ భా వమ్ము గలట్టి నీకుఁ దగవా? యిసిరో! యని పల్కి వెండియున్. |
200 |
| తే. |
‘అవిజితేంద్రియబల! కుత్సితాత్మ | నీచ!, యెట్లు పాపంబు దొడరుట కియ్యకొంటి? నాదు గురుని కోపాగ్నిచే నీదుదేవ | గణ విభుత్వ మహోన్నతి గ్రాఁగి పోదె?’ |
201 |
| వ. | అనిన విని దివ్యబోధంబును విపులుని యోగ బలంబు తెఱం గెఱింగి వెలవెలం బాఱు నబ్బలవైరి నాలోకించి యత్తపోధనుండు. | 202 |
| క. |
‘ఏ నొల్లఁ గాక! భస్మము | గా, నిన్నుం జూతునే వికారీ!’ యనుడుం దా నెదురు పలుక కంత | ర్ధానము వెసఁ జేసె నతఁడు ధరణీనాథా! |
203 |
| వ. | తదనంతరంబ విపులుండు రుచిం బ్రబుద్ధం జేసి పదంపడి దేవశర్మ వచ్చిన నా శిష్యోత్తముండు వినయాచారంబు నడపి యేకాంతంబున నమ్మునితోడ. | 204 |
| తే. |
‘నాకపతి యిచ్చటికి వచ్చి, నాకతమునఁ | జిక్కువడి, మది భయమున సిగ్గు గదురఁ జనియె’ ననవుడు నాతఁడు సంతసిల్లి | యభిమతం బగు వరమిచ్చె నధిపవర్య! |
205 |
| వ. | ఇచ్చినం బ్రీతుండై యవ్విపులుండు విపుల తపం బాచరించె; దేవశర్మయు దేవేంద్రుని వలని శంక దక్కి సుఖంబుండె; ఒక్కనాఁడయ్యాశ్రమంబు చక్కటి చదల దేవాంగన యోర్తు వోవ దాని చేతినుండి ప్రిదిలి భూరి పుష్పదామంబు. | 206 |
| ఆ. |
దివ్య పరిమళంబు, నవ్య వికాసంబు | నుల్లసిల్ల వచ్చి యుర్విఁ బడినఁ గాంచి రుచి యుదీర్ణ కౌతుకచిత్తయై | దానిఁ బుచ్చికొనియె మానవేంద్ర! |
207 |
| వ. | తదవసరంబున వంగాధీశ్వరుం డగు చిత్రరథుం డయ్యాశ్రమంబున కరుగుదెంచె; అతనిదేవియు రుచియుఁ దోడంబుట్టువు లగుటంజేసి నిజగృహంబునం గలిగిన యుత్సవంబున కతండు రుచి సహితంబుగా దేవశర్మఁ బ్రార్థించి పిలిచినఁ జంపానగరంబున కరుగుచుండి రుచి గైసేసి యద్దివ్య కుసుమ దామంబునం గేశకలాపం బలంకరించుకొనినం దత్సమాగమ సమాచారంబు నడపి తద్భగిని తదీయ కుసుమ పరిమళంబున కచ్చెరువంది. | 208 |
| ఆ. |
‘ఇట్టి సౌరభంబు నెన్నఁడు నెఱుఁగ; ని | ప్పువ్వు లెచటఁ గలిగెఁ బువ్వుబోఁడి! యనినఁ ‘గలిగె నస్మదాశ్రమంబున’ నని | పలికి, దేవశర్మ పాలి కరిగి. |
209 |
| వ. | రుచి యప్పువ్వులకుం దన చెలియలు వేడుక పడుట యెఱింగించిన, నమ్మహానుభావుండు విపులుని రావించి యత్తెఱంగు దేట వడం బలికి ‘యిట్టి కుసుమంబులు గొనిరావలయు’ నని పలికిన నతం డప్పువ్వులు గనిన చోటు రుచి నడిగి చెప్పించుకొని గురుప్రభావంబును నిజతపశ్శక్తియు నూఁది యప్పనిపూని చనియె; దైవికంబయి యచ్చట నెప్పటి చందంబు పుష్ప దామంబున్నం బుచ్చికొని వచ్చునప్పు డొక్కయెడ నారీ పురుషలొండొరుల చెట్టలు వట్టికొని చక్రభ్రమణభంగిఁ దిరుగుచుండి యొకళ్ళొకళ్ళగతి యొప్పదని పలికి కాలుదొడరితి, కడువేగ తిరిగి తని వివాదంబు పుట్టి యందొకం డేనట్లు సేసితినేనిం బరలోకంబున విపులుని చన్నగతికిం జనుదునని శపథంబు సేసిన, నమ్మాట వినుచు విపులుండు అట సనంజన మఱియు మార్గంబున నార్వురు జూదంబాడుచుండ వాదైన యొకం డట్ల యొట్టిడిన నప్పలుకు నాకర్ణించి యత్తపోధనుండు చిత్తంబున విషాదంబు గదుర నేమి దోషంబు సేసితి నొకో!’ యని విచారించి రుచి శరీరంబునందుఁ బ్రవేశించుట గురునకు నెఱింగింపమి గానోపునని తలంచుచు నరుగుదెంచి యక్కుసుమ మాలిక యొప్పించినం గైకొని యమ్మునివరుండు మఱఁదలి కొసంగి సంతోషం బొలయించెఁ, దదనంతరంబ తమయంతనున్న యవసరంబున నగ్గురుం డా శిష్యునితో నిట్లనియె. | 210 |
| క. |
‘తెరువున నొక మిథునము, జూ | దరులను గనుఁగొంటి, నీ వధర్మము నీయం దరసి కనిన వారై పలి | కిరి వారల నెఱుఁగుదే యకిల్బిషచరితా! |
211 |
| తే. |
నీవు రుచిఁ గాచు నప్పటి నిపుణ వృత్తి | నాకు నెఱిఁగింపకునికి యన్యాయముగఁ ద లంచిరో? లేక దానిఁ గల్మషము గాఁగ | నేను దలఁచిన శాప మీ నెట్లు నీకు? |
212 |
| వ. | అప్పని పాపంబు గాకుండ వరం బిచ్చితి నది మఱవు; మమ్మిథునంబు లహోరాత్రంబులు, నయ్యార్వురు ఋతువులు’ అని పలికిన గురునిబోధనంబునకు నాశ్చర్యంబును బ్రసాదంబునకుఁ బ్రమోదంబునుం బొందు శిష్యునితో నతండు వెండియు. | 213 |
| తే. |
దినము, రాత్రియు, ఋతువులు, మనుజు చేయు | సుకృతమును దుష్కృతంబును జూచుచుండుఁ గాని, యెంత రహస్యపుఁ గార్యమైన | నొరు లెఱుంగరు న న్నని యునికి మోస.’ |
214 |
| వ. | అనిన మఱియును. | 215 |
| క. |
‘స్త్రీ రక్ష సూక్ష్మ మీ వ | ట్లేరూపున నైన వంశహీనత మమ్ముం జేరక యుండం దగఁ బరి | హారము సేసి; తది యేల యవగుణ మయ్యెన్? |
216 |
| వ. | దాని తెఱంగు నా కెఱింగింపకున్న నేమి?’ అనుపలుకు వలికి దేవశర్మ విపులు నుల్లం బూరడిల్లం జేసె. అవ్వధూవరులును, విపులుండును బుణ్యలోకంబులు వడసిరి, పాండవాగ్రజా! తెఱవల తెఱంగెఱింగించితి వారి రక్షించుటయు నిట్లరిదియై యుండు’ నని చెప్పి భీష్ముండు. | 217 |
| క. |
‘పలువురు గ్రీడింతురు, భూ | వలయాధిప ! యరయ మంచివారును గల; ర క్కులధర్మ సతులకతమున | నిల నిరపాయత్వ మొంది, యెసకం బెసఁగున్. |
218 |
| క. |
పాతివ్రత్యము గలిగిన | నాతి యనఁగ దైవ మన జనస్తుత! వేఱే? యాతత ధర్మార్థ సుఖ | ఖ్యాతులు, సద్భార్యవలనఁ గాదే కలుగున్.’ |
219 |