పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు గాంధర్వాది వివాహ పద్ధతులఁ తెఱఁ గెఱింగించుట (సం. 13-41-1)
వ. అనిన విని యజ్జనపతి జాహ్నవీనందనుతోఁ ‘గన్యావరణ ప్రకారంబు విచారణీయం బైన కృత్యంబు; దాని తెఱం గెఱింగింపవే’ యనుటయు, నతం డతని కిట్లనియె. 220
క. ‘కులమును, శీలము, విద్యయు | గలవానిం బిలిచి , ప్రీతిఁ గన్నియ నీఁ గా
వలయు, నుదక ప్రదానా | కలితంబుగ; బ్రాహ్మ కర్మ గతి యిది యధిపా!
221
ఆ. క్షాత్ర మండ్రు బుధులు, గన్య పురుషుఁ గోర | నతఁడు గన్య మీఁద నాస సేయ,
నచల మగు పరస్పరానురాగము గని | ప్రమదమెసఁగఁ జేయు పరిణయంబు.
222
క. కన్ను మనంబును దనిసిన | గన్నియ యెవ్వానిఁ గోరు గాంధర్వం బా
యన్ను నతని కిచ్చుట, వెల | వన్నుట యాసురము సూవె పౌరవముఖ్యా!
223
క. బలిమి మెయి వరుఁడు గన్నెకుఁ | గలవారిం బొడిచి, కరము క్రౌర్యంబున, న
ప్పొలఁతుక దుఃఖింపఁగ, వా | రలు వొగులఁగఁ, దెచ్చికొనుట రాక్షసము నృపా!
224
వ. ఇట్లు సెప్పంబడునట్టి. 225
ఆ. అయిదు దెఱఁగులందు నారయ మూఁడు వి | ధములు ధర్మకృతులు ధర్మపుత్ర!
యాసురంబు రాక్షసాహ్వయంబును ధర్మ | దూర సంవిధాన దూషితములు.
226
తే. మాతృ పితృ హీనయైనను, భ్రాతృరహిత | భావ మొందిన నబ్బాల పరిణయార్థ
వరణమున కర్హ గా దని, కురుకులాగ్ర | గణ్య! చెపుదురు పరిణయకల్పవిదులు.
227
ఆ. ఆత్మజాతియందు, నవుల జాతులు రెంటఁ | గ్రమవివాహ మొప్పు బ్రాహ్మణునకు
ననఘ! శూద్రవనితయందు నాతని కప | త్యంబు గలిమి పాప మనియుఁ గలదు.
228
తే. రాజునకు రాజవంశజ రమణి యైన | వెనుక వైశ్యవరించుట విహిత విధము
వైశ్యునకు శూద్రునకుఁ దమ వంశములన | పరిణయంబు గాఁదగు నరపాలవర్య!
229
వ. రాజునకు, వైశ్యునకు శూద్రకన్యావరణంబు సేయుటయును గలిగియుండు’ నని చెప్పిన విని యక్కౌంతే యాగ్రజుండు శాంతనవుతో’ బాహ్మణునకు శూద్రజాతి యందు భార్యా పరిగ్రహంబు సేయందగు నని విందును; అతనికి భార్యలు మువ్వురని నిర్దేశించితిరి. అది యెట్లొకో? యనుటయు నతం డమ్మహీపతి కిట్లనియె. 230
ఆ. అనఘ! విషమ మైన యట్టికార్యంబు వా | టిలినఁ జూచి, పెద్ద వలచి యైన
లోభమునను శూద్రఁ దా భార్యఁగాఁ గొను | విప్రుఁ డధికపాపవృత్తి గామి.
231
వ. అవ్విధంబు నొక్కొక్క యెడం గల్గి దూష్యంబు గాక చెల్లునని చెప్పి వెండియు. 232
క. ‘ధరణీసుర, రాజ, వణిక్‌ | తరుణులకును విప్రువలనఁ గల్గిన తనయుల్‌
కురునాథా! ద్విజు లనఁగా | బరఁగుదు; రది లేదు శూద్రభామ సుతులకున్‌.’
233
వ. అనవుడు ధర్మపుత్త్రుండు ‘భూసురుని వలన నాలుగు జాతుల నాతులకును బ్రసూతులైన సుతులకును నతని ధనంబునందు భాగం బెట్లుండు?’ నని యడిగిన. 234
సీ. ‘విను, జనమేజయ మనుజేంద్ర! యమ్మేది | నీశ్వరుతో భీష్ముఁ డిట్టులనియెఁ;
బ్రాహ్మణు నర్థంబు పది పాళ్ళుగాఁ జేయ | నాలుగు బ్రాహ్మణి నందనుండు,
క్షత్రియాత్మజుఁడు భాగములు మూఁడును, వైశ్య | తనయుండు రెండు, శూద్రాతనూజుఁ
డొక పాలు గొనుటకు నొడయులు; తుదివాఁడు | వలచి పెట్టఁగఁ గొనువాఁడు గాని
 
తే. తండ్రితోడఁ ద్రివిధ తనయులతోడను | దనదు భాగమునకుఁ బెనఁగి కొనఁగఁ
దగదు వారలకును దగదు నిర్దయతఁ ద | ద్దశమభాగ మీక తార కుడువ.’
235
వ. అనిన విని పాండవాగ్రజుండు ‘దక్కిన వర్ణంబులవారి ధనంబు లెట్లుగాఁగలయవి సెప్పు’ మనుటయు ననిమిష నదీనందనుం డతని కిట్లనియె. 236
సీ. ‘క్షత్రియు ధనము భాగము లెనిమిది సేయ, | భూపాల వైశ్యుల పుత్రికలకు,
శూద్ర పుత్రికకును, సుతులైన యట్టి వా | రోలి నాలుగు, మూఁడు నొక్కటియును,
గొనువారు పాళ్ళులు, కురుముఖ్య! వైశ్యుని | సొమ్మున వైశ్యకు సూనుఁ డైన
యతఁడు నాలుగును శూద్రాత్మజుఁ డొకటియుఁ | గాఁగ నైదుగ నంశకములు గొండ్రు
 
తే. పెనఁగి కొనఁగఁ దగమి విన శూద్ర కొడుకున | కెందుఁ గలదు; వాని కీక కుడువఁ
గామియును సమంబ యేమి జాతులవారి | కయిన నిట్లు దెలియు మంశకృతులు.
237
తే. ఆలు నిజజాతియందు, శూద్రాలి కెల్ల | సమములుగఁ బంచికొండ్రు భాగముల శూద్ర
తనయు లెందఱు గల్గినఁ దండ్రి ధనము | ధర్మసంగ్రహతత్పర! ధర్మతనయ!|
238
వ. అని నిర్దేశించి వెండియు. 239
క. ‘విను హవ్య కవ్యములు మ | జ్జన భోజనములును, విప్రజాతి వనిత దాఁ
బనిసేయ నడపునది, య | ప్పనులకుఁ బెఱసతులు గామి బ్రాహ్మణుఁడు నృపా!’
240
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )