పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజున కౌరసాది పుత్త్రభేదంబు తెఱంగు సెప్పుట (సం. 13.49-1)
వ. అనిన విని యుధిష్ఠిరుండు. 241
క. ‘కొడుకులు బహువిధు లని యె | ప్పుడు విందును; వారి తెఱఁగు పురుషవరా! యే
ర్పడఁ జెప్పవలయు నా’ కని | యడిగిన, గాంగేయుఁ డిట్టులను నాతనితోన్‌.
242
తే. పరమసంస్కృత యగు నాత్మభార్యయందు | ధర్మవిధిఁ గలిగించిన తనయుఁ డనఁగఁ
దాన యౌరసుఁ డను నభిధాన మొప్పఁ | బరఁగు నుత్తముఁ డాతఁడు ప్రథముఁ డధిప!
243
తే. తగిన వరునకు నిచ్చిన తనదు దుహితఁ | గనిన పుత్రు నయ్యిరువురు వినఁగ నియ్య
కొనఁగ వీఁడు నా కొడు కనఁ గొడుకు వాని | పేరు పుత్రికా పుత్రుండు పౌరవేంద్ర!
244
తే. ధర్మపథమునఁ బనిచినఁ దనదుపత్ని | యర్హపురుష సంగతిఁ గన్న యాత్మజుండు
క్షేత్రజుం డనఁగా నిజపుత్ర భావ | మొందు ధర్మప్రపంచాభినందితాత్మ!
245
క. జననీ జనకు లుదక దా | న నిరూఢము గాఁగ నిచ్చినం బడసిన నం
దనుపేరు దత్రిముం డని | ముని జనములు సెప్పుదురు విమోహవిదూరా!
246
ఆ. తల్లిఁ దండ్రిఁ బాసి తనయంత నెచ్చట | నేనిఁ దిరుగునట్టి వానిఁ జూచి,
యాత్మసదృశుఁడైన యాత్మజుఁ జేసి కొ | నంగఁ గృత్రిముం డనంగఁ బరఁగు.
247
తే. ఎవ్వనికిఁ బుట్టె నేనియు నెఱుఁగకుండ | నొక్కనికిఁ బరభార్యయం దుదయ మైన
సూనుఁ డా భార్య గలవాని సుతుఁడు, వాని | పేరు ‘గూఢజుఁ’ డనఁబడుఁ గౌరవేంద్ర!
248
క. విను తల్లిదండ్రు లొల్లక | తనయుని విడిచిన నొరుండు తనకుఁ దనయుఁగాఁ
గొని నెమ్మి నడప నపవి | ద్ధనాముఁ డగువాఁడు విమలధర్మప్రవణా!
249
తే. పెండ్లి గాకమున్న పితృగృహంబునఁ గన్య | సూనుఁ గనిన వినుము దానిఁ జేసి
కొనిన యతని కతఁడు గొడు కగుఁ గానీన | నామకమున బరఁగు నరవరేణ్య!
250
క. విను గర్భిణి యగు టెఱుఁగక | యును, నెఱిఁగియుఁ బెండ్లియైన, నుదయించిన నం
దనుఁ డావరునకుఁ గొడు కగు | జననాథ! సహోఢుఁ డనఁగఁ జను నండ్రు బుధుల్‌.
251
తే. విభునిఁ దాను దొఱంగిన వెలఁది, విభుఁడు | విడిచినట్టి సుమధ్యమ, విధవ, యక్ష
తాత్వ దశ నెవ్వనికిఁ గనఁ దనయుఁ డాతఁ | డతని కొడుకు పౌనర్భవుం డనఁగఁ బరఁగు.
252
క. జననీజనకులు లేకు | న్నను వారలు దన్ను విడిచినం దాన తనున్‌
దనయుఁడుగ నొరుల కిచ్చిన | ననఘా! యాతండు సను స్వయందత్తుఁ డనన్‌.
253
ఆ. తల్లిదండ్రు లమ్మఁ దనయుఁగా నొక్కరుఁ | డాత్మసదృశజన్ముఁ డైన వాని
విలిచికొనినఁ బాండవేయ మహత్తర! యక్కుమారుఁ గ్రీతుఁ డండ్రు బుధులు.’
254
క. అని భీష్ముఁడు వెండియు ని | ట్లను ‘ నా పన్నిరువురును ధరాధిప! యోగ్య
త్వ నిరూఢు లెల్ల కర్మం | బున; కౌరసుఁ డందులోన ముఖ్యుం డరయన్‌.
255
ఉ. వానిన పోలు నండ్రు బుధవర్యులు కౌరవనాథ! పుత్రికా
సూనునిఁ దక్కునీ వినిన సూనులు, యోగ్యత గాంతు రుత్తమం
బైన కులద్వయంబును, సమాగతమై, విధివత్ప్రయోగతా
నూనతఁ గల్గెనేని, నిగమోదిత కర్మకలాప యుక్తికిన్‌.’
256
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )