పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
చ్యవన కుశిక సంవాదంబను నితిహాసము (సం. 13-52-1)
వ. అనిన విని యక్కురువంశవర్యుం డా ధర్మధుర్యునితో, ‘నాకు నొక్కటి వినుటకుం గుతూహలం బెప్పుడుం గల్గియుండు; ఉదాత్తబ్రాహ్మ్యనిధి యైన భార్గవాన్వయంబునం జిత్రతర క్షాత్త్ర చరిత్రుం డగు పరశురాముండు జనియించుటయు, నుత్తమ క్షత్రియత్వ మహోష్మంబైన కుశిక కులంబునం బరమ బ్రాహ్మణ్యవిశ్రుతుం డైన విశ్వామిత్రుం డుదయించుటయును, నది యెట్లొకో? అనుచుండుదుఁ దొల్లియుఁ గొంత వింటి; నిస్సంశయంబు గాదు; మహాత్మా! మదీయచిత్తాయత్తంబుగా నత్తెఱం గెఱింగింపవే!’ యనుటయు నయ్యనిమిషనదీ నందనుండు గుంతీనందనాగ్రజు తోడం ‘జ్యవనకుశిక సంవాదంబను నితిహాసంబు వినుము. దాన భవత్సంశయంబు వాయు; జ్యవనుండు నిజవంశంబునకుం గుశిక కులంబు కారణంబుగా సంకరంబు గలుగఁ గలయది అని యెఱింగి యక్కుశిక కలంబునకు నుత్పాతం బాపాదింపంగోరి కుశిక భూపాలు పాలికిం జనిన నతండు. 291
క. భార్యా సహితముగా న | య్యార్య వరుని కనుగుణంపు టర్చన విధివ
చ్చర్యాపూర్వముగ వినయ | ధుర్యత వెలయంగఁ జేసె దోహల మమరన్‌.
292
క. పూజితునిఁ జేసి, యతనికి | రాజవరుం డిట్టులనియె ‘రాజ్య విభుత్వ
భ్రాజిష్ణుఁడవై భృత్యుని | యోజను నను నడపి యేలు ముర్వి మునీంద్రా!
293
క. ఏనును, భార్యయు, బంధులు, | నానా జనసహితముగ సనాథతఁ గని య
ట్లైనం బెంపుం బొరయం | గా నిలకుఁ బ్రమోద మొందఁ గైకొను మమ్మున్‌.
294
చ. అన విని, యమ్ముని ప్రవరుఁ డాతని కిట్లను ‘రాజ్యకాంక్ష నా
మనమున లేదు, సద్వ్రతము, మానిత వృత్తిఁ జరించువాఁడ నై
జనవర! వచ్చినాఁడఁ; బరిచారము నీవును నీదు పత్నియున్‌
గొనకొని చేయఁ గావలయుఁ గోరిక యింతియ తీర్పు మోపినన్‌.’
295
వ. అనిన విని యా దంపతులు ముదంబునం బొదలి ‘యట్ల చేయువార’ మనిరి; తదనంతరంబ. 296
క. అమ్ముని నభ్యంతర సద | నమ్మునకుం గొని విభుండు నాతియుఁ దానున్‌,
సమ్మోదమ్మునఁ జని, హృ | ద్యమ్మగు, నొక చోటు సూపి యాతనితోడన్‌.
297
ఆ. ‘అనఘ! యిచట నుండు’ మని పల్కి, మృదులత | ల్పంబు నంచితాసనంబు నచటఁ
బెట్టఁ బనిచి యేము ప్రీతి నొనర్చెద | మిష్టభంగిఁ బనుపుఁ డెద్దియైన’
298
వ. అనియె; నంత నినుం డపరగిరికడచనినం, గాలోచిత కృత్యంబు లాచరించి యమ్మహాత్ముం డాహార మడిగిన నమ్మహీపతి మహితభోజనంబున నతనిం దృప్తునిం గావించిన.’ 299
ఆ. అతఁడు సెజ్జఁ జేరి, యధిపుతో ‘నియ్యెడ | నిద్రవోదు నేను నృపవరేణ్య!
మీరు నిదుర దక్కి, మెలపున నాచర | ణంబు లొత్తు చునికి నాకుఁ బ్రియము.
300
క. ఏనై మేల్కనునంతకు | భూనాయకవర్య! నన్ను బోధింపకుఁ డీ
మానినియు నీవు’ నని, ని | ద్రా నిరతుం డయ్యె, వారుఁ దద్దయు భక్తిన్‌.
301
తే. కుడుపు నిదురయు, వర్జించి యడుగు లొత్తు | చుండి రమ్ముని వల్లభుఁ డొక్కప్రక్క
నచలగాత్రుఁడై నిద్రింప నద్భుతముగ | దినము లిరువది యొక్కటి సనియె నధిప!
302
వ. ఇరువది రెండవనాఁ డమ్ముని తనయంతన మేల్కొని. 303
క. ఇలు వెడలి పోయె నేమియుఁ | బలుకక; యా దంపతులును బరమశ్రాంతా
త్ము లగుచు వెనుకన చని; ర | క్కులపతి యించుకయు సరకుగొనఁ డవ్విధమున్‌.
304
ఆ. అట్లు వారివలన నాదర రహితుఁడై | పురవరంబు వెడలి పోయి పోయి
యతఁడు సూఁడఁజూడ ‘నంతర్హితుం డైనఁ | బతియు సతియు మూర్ఛపాలు పడిరి.
305
క. కొంతవడికిఁ దెప్పిఱి యెద | నెంతయు వగ నూనఁ బురికి నేతెంచి గృహా
భ్యంతరము సొచ్చి కని ర | య్యింతియును విభుండు నమ్మునీశ్వరు సెజ్జన్‌.
306
వ. మును నిద్రించు ప్రక్కదక్క యొండు ప్రక్క నిద్రించు భార్గవు నట్లు గాంచి సంతోషించి, పరిశ్రాంతి దిగద్రావి యెప్పటి చొప్పున నడుగు లొత్తుచుండ, మఱియు దినంబు లిరువది యొక్కటి సనినం బ్రబుద్ధుండై. 307
సీ. అతఁడు తైలాభ్యంగ మడిగినఁ బతి కమ్మ | నూనియఁ దెప్పించి మేను శిరము
నభ్యక్తములు సేయ, నమ్ముని సెడ నాడి | యంతర్హితుం డయ్యె నపరఘటికఁ
దోఁచి వికారంబు దొడరక యున్న రా | జును దేవులను గని, సుముఖుఁ డగుచు
నాచరితస్నానుఁ డగుటయు, వారు మ | హార్హంబు లగు వివిధాన్నపాన
 
ఆ. ములు ఘటించి, కుడువఁ బిలిచినఁ జని, వాని | నెల్లఁ గాంచి, యెక్కడేనిఁ బోయె
వార లడలు గదుర నూరకయుండి రా | పగలు రేయుఁ గురునృపాలవర్య!
308
వ. ఆ భృగువంశ వర్యుండు. 309
సీ. వేగినఁ బొడసూపి, ‘వేగంబ యరదంబు | వన్నింపు; నీవు నీ భామినియు వ
హింపఁగా రథికత యెసఁగఁ గాంచన రత్న | గోహయముల యాచకులకు నిచ్చు
చును జనవలయు నా ‘కనుడు భూపతి తేరు | సమకట్టి, దాపటఁ జామ, దాను
వలపటఁ బూని, యావస్తువు లెల్లను | గొనివచ్చి యీ మంత్రి జనులఁ బనుప
 
తే. నెక్కి వారల నా సంయమీశ్వరుండు | నిశితతర మగు మునికోల నెత్తు రొలుక
మోపుచును దీనకోటికి నా పదార్థ | చయము నెడనెడ నొసఁగుచుఁ, జనుచునుండె.
310
వ. పెక్కుదినంబు లాహార నిద్రలు లేమి డప్పిఁ దూలు నమ్మహీపాలు నమ్మహిషి నమ్ముని ములుకోల పోట్లనట్లు పూచిన మోదువుల చందంబు నొందింపఁ జూచి జనంబు లల్లన తమలోన ‘నిట్టితపో మహిమయుం గలదే యిది యన్యాయ్యం’ బని యలుగను దగవు వలుకను దేఱి చూడను రాదయ్యెడు నీ దంపతుల ధీరత్వంబును నిష్ఠాపరత్వంబును నింతయొప్పునే! దుర్వహంబగు భారంబు నిర్వికారులయి వహించుచున్న వారనుచు నుమ్మలించుచుఁ బరివేష్టించి చనం జ్యవనుండు పురంబు వెడలి వారి మనంబుల వికారంబులు గానక, యచ్చెరువును మెచ్చును బెనంగొను హృదయంబుతో నరదంబు డిగ్గి, వారల శిరంబులం గట్టిన పగ్గంబులు విడిచి, శరీరంబులు కరంబున సంస్పర్శించి, యజ్జనపతి యాననం బాలోకించి, ‘డస్సితిగదే, వరంబిచ్చెద, వగపు దక్కి పురంబునకుం జను; మేను గంగాతీరవనంబున వ్రతచర్యా శేషంబు నిర్వహించెద; నీవు మహిషీ సహితంబుగా నెల్లి నా కడకుం జనుదె’ మ్మని పలుకుటయు ‘నాకు వగ పెక్కడి?’ దని పలికి యవ్విభుండు. 311
క. తన తనువు వనిత మేనును | గనుఁగొని యచ్చెరువు ముదము గడలుకొనఁగ న
మ్మునితో భవత్ప్రభావముఁ | గొనియాడఁగఁ దరమె మాకు గురుతరకరుణా!’
312
వ. అని వెండియు. 313
తే. ‘శ్రమము లేదు, ప్రతోద వ్రణములు లేవు, | నాతియును, నేను, నెలజవ్వనంబుఁ గంటి
మిది మహాద్భుతతర మందుమే! భవన్మ | హానుభావత్వ మేమి సేయదు? మునీంద్ర !’
314
వ. అని సవినయంబుగాఁ దానును దేవియు దండప్రణామంబులు సేసి, యా సంయమివరు వీడ్కొని, సాద్భుత చిత్తులైన సకల జనులుం బరివేష్టింపఁ బురంబు ప్రవేశించి, ప్రమోదమయమూర్తు లగుచు, దివసవర్తనంబును, రాత్రి చర్యయుం గడపి, సూర్యోదయం బగుటయు.’ 315
క. వారలు ప్రాతస్సమయా | చారంబులు నడపి భక్తి సంపద లొదవన్‌
గారవమున ముని నిర్ది | ష్టారణ్యమ్మునకుఁ బోయి రవనీనాథా!
316
ఆ. అచట మణిమయంబు, నతిసుందరము, దివ్య | సదన నిభము నగు విశాలరమ్య
హర్మ్యమున్నఁ, జూచి యచ్చెరువందు చి | త్తములతోడఁ జనఁగ దానిచుట్టు.
317
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )