పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
చ్యవనుఁడు తన యోగబలంబునఁ గుశికునకు నాకలోకంబు సూపుట (సం. 13-54-1)
సీ. స్వాధ్యాయ సంగీత సాహిత్య వర్తన | మాననీయము లగు మండపములుఁ,
గోకిల శుకభృంగ కులనాదముల నభి | రామంబు, లైన యారామములును
హంస సారసరవాత్యంత మనోజ్ఞంబు | లై సొంపు మిగులు పద్మాకరములుఁ,
జారుమయూర కేకారుత కలితంబు | లగుచు నొప్పారు క్రీడాచలములు;
 
తే. వీనులకుఁ జూడ్కులకు నింపు వెల్లి గొల్ప | నేర్పు గలిగిన విభవంబు నెఱయ మెఱయఁ
గరము విలసిల్లుచునికి నాకంబు వేడ్క | నయ్యెడకుఁ గాపు వచ్చిన యట్టు లుండె.
318
క. సురలును, గంధర్వులు, న | ప్సరోనికాయములు, వివిధ సరస విహారా
దరలీల నందు నెడనెడఁ | జరించుచుండిరి నితాంత సమ్మోదమునన్‌.
319
తే. అవ్విధంబున కా రాజు నంగనయును | మనము లద్భుత రసమున మునుఁగుచుండఁ
‘గలయొకో యిది! నిక్కమ కానినాఁడు | మిగుల ననుభవ గోచర మగునె యిట్లు?’
320
వ. అని వెండియు. 321
క. ‘ఉత్తర కురు భూమియొ? లో | కోత్తర మగునట్టి నాకమొకొ? తనువులతో
నిత్తాపసవరుని కరుణ | నిత్తెఱఁగున సంభవించె నిచ్చోటు సొరన్‌.’
322
వ. అనుచు నమ్మహనీయ హర్మ్యంబు సొచ్చి, యందు మణిమయ పర్యంకంబునం బవ్వళించి యున్న యప్పరమ మునిం గనిరి, అపరక్షణంబున నతం డంతర్ధానంబు సేసె. అతనితోడన యా మేడయు మున్ను గన్న యశేష విశేషంబులును నదృశ్యంబు లయ్యె, అయ్యిరువురు నిట్టట్టు మెలంగి యక్కాన నొక్కెడఁ గౌశబృసీ సమాసీనుండును జపపరుండునునైన యాసంయమివరు నాలోకించి; రట్లు గాంచి భూవిభుండు భార్యతో నిట్లనియె. 323
తే. ‘ఉవిద! మునియోగబల మిట్టు లుండునే! య | నూనరాజ్యంబు సులభంబు మానవులకు
బ్రాహ్మణత్వంబుఁ దపము దుర్లభము దపము | కలిమిఁ జేయుచు నున్నాఁడు వలసినట్లు.’
324
చ. అనునెడ నిందు రండని సమాదర మొప్పఁగ వారిఁ బిల్చె న
మ్ముని; నరనాథుఁడున్‌, సతియు, మోడ్చిన చేతులతోడఁ జేరఁగాఁ
జని, ధరఁ జాఁగి మ్రొక్కుటయు, సంయమి దీవన లిచ్చి, రాజు నా
ననమున సుప్రసన్న నయన ప్రభ పర్వఁగ నెమ్మి నిట్లనున్‌.
325
ఆ. ‘మనసు నింద్రియములు మనుజేంద్ర! యింత వ | శ్యంబు లగునె నీకు? నరయఁ గీ డొ
కింత యైన లేదు సంతసమందితి; | నిత్తు వరము వేఁడు మెద్దియైన.’
326
క. అనిన విని యగ్ని కల్పుఁడ | వనఁ జను ‘నీమది ప్రసన్నమగునట్టులుగా
మునిజనవంద్యా ! కొల్వం | గను కంటెను మిగులమేలు గలదే కోరన్‌.’
327
వ. అని పలికి కుశికుండు వెండియు. 328
తే. ‘ఒకటి యడిగెదఁ గృప చిగురొత్తఁ జెప్ప | వలయు; మీరు మా యింటికి వచ్చి యొక్క
ప్రక్కక్రిందుగ నిరువది యొక్క దినము | లనఘ! నిద్రించి; తది మొదలైన నీదు.
329
క. చరితం బద్భుతము మునీ | శ్వర! దీనికిఁ గారణము విచారమున కగో
చర; మెఱిఁగింపు ‘మనుడు నా | ధరణీవల్లభునితో నతం డిట్లనియెన్‌.
330
వ. సురలు మునులు సురజ్యేష్ఠుం గొలిచియుండం బ్రసంగ వశంబున నప్పరమేష్ఠి వారలతో భృగు కుశిక వంశంబులకు బ్రహ్మక్షత్రంబులు తడంబడి సంకరంబు వాటిల్లు నని చెప్పె; నప్పు డేనచ్చట నుండి వినుటం జేసి యాసంకరంబున కోర్వక మీ యన్వయంబు నిర్మూలంబు సేయువాఁడ నయి వ్రతంబు నెపంబిడి, భవద్గృహంబు సొచ్చి యిన్ని పోకలం బోయితి; అలసి డస్సి యెప్పుడేని మీర లడ్డ మాడుదురు అప్పుడ శపింతు నిట్టిద నా యెత్తికోలు; మీ యందు ధైర్యహానియు శోకంబును గోపంబును లేమిని మెచ్చి వరం బిచ్చియుం దనివి సనక, తనువులతోడన మీరు నాకలోకం బాలోకించు నట్లుగా నీ గంగాతీరంబున సంఘటించితి; దానిం గని నరేంద్రత్వంబుదెస నుదాసీన భావంబు నొంది బ్రాహ్మణ్యంబునందు స స్పృహుండ వై తది యెఱుఁగుదు; నీకు మూఁడవవాఁడు బ్రహ్మతేజో దీప్తుం డయి జనియించు; వరంబు వేఁడు’ మనుటయు నమ్మానవపతి దీనికంటెను గడచిన వరంబునుం గలదే? మదీయ సంతానంబు బ్రహ్మత్వ ప్రాప్త మహత్త్వ నిరూఢంబును, గాఢధర్మ తత్పరంబునుంగా నను గ్రహింపు’ మనిన నమ్ముని ‘యట్ల యయ్యెడు నూఱడిల్లుము. నీదు మనుమండు త్రిలోక పూజనీయుండు’ అని పల్కిన నప్పతి ‘వాఁడేమి కతంబున బ్రాహ్మణుం డగు నత్తెఱంగెఱింగింపవే’ యనవుడు నత్తాపసోత్తముండు ‘విను మస్మద్వంశంబున ఋచీకుం డనువాఁడు జన్మించి నీ తనయుం’ డైన గాధి యనియెడు వాని పుత్రి భార్యగాఁ బరిగ్రహించు; నత్తపోధనుండు దననందనుం డగు జమదగ్నియందు సమస్త ధనుర్వేదంబును నావహించు, నవ్విశేషంబు తత్పుత్త్రునందు ఫలియించు; నది యంతయు సకల క్షత్రియ క్షయకారి యైన దైవంబు కృత్యంబు, దానివలన ఋచీక, గాధి వధూజనానుష్ఠాన పరివర్తనంబు గలుగు; నది కారణంబుగా నుగ్రక్షత్రధర్ముండగు పరశురాముండు జమదగ్నికిం, బరమ బ్రాహ్మణ్యగణ్యుం డయిన విశ్వామిత్రుండు గాధికి జనియింతురు, బ్రహ్మ పలుకు సత్యంబ; యుష్మదన్వయంబు భార్గవ కులసంబంధంబున జనశ్లాఘనీయంబై వెలయం గలయది, యేను తీర్థంబునకుం జనియెద, నీవు సుఖివై యుండుము’ అని చెప్పుటయు, నప్పుడమిఱేఁడు భార్యాసహితంబుగ సవిశేష వినయంబగు వందనం బాచరించి వీడ్కొని చనియె; జ్యవనుండును నిజేచ్ఛం జనియె; నిది పరశురామ విశ్వామిత్ర జన్మ ప్రకారంబు. 331
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )