పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు దానవిశేషముల నెఱింగించుట (సం. 13-92-28 (కుంభ))
క. అని కురుపితామహుఁడు సె | ప్పిన విని, ధర్మాత్మజుండు ప్రియమందుచు నా
తనితో ‘దానవిశేషము | లనఘా! యెఱిఁగింపు’ మనుడు నతఁ డిట్లనియెన్‌.
332
సీ. ‘కాంస్యోపదోహయుఁ గాంచన చారుశృం | గయు ధవళాంబర కలితయును, స
దక్షిణయును నయి తగుగోవుఁ బాత్రత్వ | భవ్యవిప్రునకు సద్భక్తితోడ
నిచ్చిన దానికి నెన్ని రోమము లన్ని | దివ్యవత్సరములుఁ ద్రిదశలోక
మున వసింతురు; కులంబున యేడు తరముల | జనముల సుగతికి ననుతు రధిప!
 
ఆ. కన్య, భూమి, గృహము, గనక, మన్నము, జల | మంబరంబు, శయన, మాసనంబు,
వాహనంబు, విప్రవరునకు నీగి లో | కముల రెంట సౌఖ్యకారి యండ్రు.
333
క. అనిన విని పాండవాగ్రజుఁ | ‘డనఘా! యిన్నింటికంటె నధికంబగు దా
ని నెఱింగింపు’ మనుడు, న | జ్జనపతి కిట్లను నతఁడు ప్రసన్నాత్మకుఁడై.
334
తే. ‘అర్థి గోరిన వస్తువు లర్థితోడ | నీగి యెల్ల దానములకు నెక్కుడరయ;
నఖిల భూతమ్ములకు నభయంబు నిచ్చు |టంతకంటెను మే లందు రార్యజనులు.’
335
వ. ‘అని చెప్పి వినుమని మఱియు నిట్లనియె’. 336
తే. వీరశయనంబు మేలండ్రు వీనికంటె | మఱియుఁ గొన్నింటి కంటెను మనుజనాథ!
దానముల కావు, వెదకిన దానిఁ బోల | లేవు, పుణ్య కర్మములలో నేవియైన.’
337
వ. అనుటయు ధర్మజుండు తమ్ములం దెసం గనుంగొనిన, వార లతని చిత్తం బెఱింగి రణమరణ స్తుతి సేయ, నతండు సమరంబునం జచ్చిన బంధు, మిత్ర జ్ఞాతి, జనంబుల వలని శోకంబు వదలి వాహినీ నందను వాక్యంబు లభినందించె; నా దేవవ్రతుండు వెండియు. 338
క. ‘అరియైన దీనుఁడై తను | శరణం బని వేఁడినం , బ్రసన్నాత్మత న
ప్పురుషుని కోరిక దీర్చినఁ | బురుషోత్తముఁ డందు రతనిఁ బురుషవరేణ్యా!
339
క. అడుగక యున్నను, నాలిం | గొడుకుల రక్షింప లేక, కుతిలపడుచు నె
ప్పుడుఁ బేదతనము గల నరు | నెడ రుడుపఁగవలయు నది మహితగుణ మనఘా!
340
క. నిజదారపరులు సంతత | యజనరతులుఁ గామరోష హంతలు నగు స
ద్ద్విజుల నరసి ధన మిచ్చుట | త్రిజగత్పూజ్య మగు నండ్రు ధీరవిచారా!’
341
వ. అనినం బాండవాగ్రజుండు ‘యాచనా యాచనంబులలో నెయ్యది దానార్హం బగు?’ నని యడిగిన నతనికిఁ బితామహుం డిట్లనియె. 342
చ. ‘అడిగిన నిచ్చుకంటెను నయాచకుఁ గాఁగ నెఱింగి యిచ్చు టె
క్కుడు ఫలమిచ్చు; దానవిధికోవిద! వేడుట సావు వేఁడఁగా
బడు టది పెద్దసావు; దగు ప్రార్థన పూర్ణము సేయునాతఁ డా
యడిగిన వానిఁ దన్నును దయారతిఁ గావఁగఁ జాలు వాఁడగున్‌.’
343
వ. అనిన విని యుధిష్ఠిరుం డతని కిట్లనియె. 344
క. దానము యజ్ఞక్రియ నాఁ | గా నతులిత ధర్మవిధులు గల; వందు ధరి
త్రీ నాథోత్తమ! యధిక ఫ | లానూనంబై వెలుంగు నది యెయ్యదియో?’
345
వ. వినవలఁతుం జెప్పవే’ యని యడిగిన నయ్యనిమిష నదీనందనుం డప్పాండు నందనాగ్రజున కిట్లనియె. 346
ఉ. భూసురకోటికిన్‌ వినయపూర్వముగా ధన ధాన్య గో మణి
క్ష్మా సలిలాన్న ముఖ్యములు సమ్మతి నీగి సుయజ్ఞ మాసనో
ద్భాసితసత్క్రియన్‌ నడపు భవ్యుఁడు యజ్ఞములుం దపంబులుం
జేసిన పుణ్యముం బడయుఁ; జేయుము దానము లోపి నిత్యమున్‌.’
347
క. అనవుడు నాతనితో ని | ట్లనుఁ గుంతీతనయముఖ్యుఁ ‘డనఘా! పెక్కుల్‌
వినఁబడు దానము లధికం | బనఁ దగియెడు దాన మెద్ది? యన్నిటిలోనన్‌.’
348
వ. అని యడిగిన నయ్యాపగాసూనుం డమ్మానవపతి కిట్లనియె. 349
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )