పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
భూదాన మహిమాభివర్ణనము (సం. 13-61-1)
క. దానము లన్నిటికిని భూ | దానం బెక్కుడు సమస్త ధాన్యములుఁ బ్రభూ
తానేక వస్త్ర ధన ర | త్నానూనత్వమును భూమి నవుట కతమునన్‌.
350
క. కనకము రజతము వస్త్రం | బును ధాన్యము వివిధ రత్నములు నిచ్చిన య
వ్వినుత ఫలంబుల నెల్లను | గను నుత్తమభూమి దానకర్త నరేంద్రా!
351
సీ. భూమి కెంతాయువు భూదానకర్తయు | నంతకాలము సుఖ మందుచుండు
నమరలోకంబున; నల్పమైనను భూమి | యిచ్చిన బహుభూమి యేలు నతఁడు;
రాజు విశేషించి రణమృతి యొండెను | భూదాన కర్తృత్వ పుణ్య మొండెఁ
బడయంగవలయుఁ బాపఁగ నోపు బ్రహ్మ హ | త్యాది పాతకముల నైన భూమి
 
తే. దాన మెంత పాపాత్ముచే నైన భూమిఁ | గొనిన గల్మష మొందదు; వినుము మహిత
మైన భూదానవిధియును నశ్వమేధ | యాగమును సదృశంబులం డ్రాదిమునులు.
352
క. దారిద్ర్యముచేఁ గుందుచు | నేరిని నడుగంగఁ బోవ కెంతయుఁ గృశతం
గూరిన విప్రున కుర్వర | వారని దయ నీగి ఫలము వాగ్గోచరమే?
353
తే. యాగకర్తయు శాంతుండు నైన యట్టి | విప్రుఁ బ్రార్థించి యైన నుర్వీప్రతి గ్ర
హంబు సేయించు టత్యధికంబు భూమి | దానవిధి విశేషంబులలోన నెల్ల.
354
క. విను మర్హుఁడైన విప్రున | కనఘా! గోచర్మమాత్ర యగు మేదిని ని
చ్చినఁ బోని యట్టి పాపము | నినుపొడుపునఁ జెడని తమము నెందును గలవే?
355
క. ఆజిప్రాప్త మృతులు గురు | పూజకులును, మఱియు నెట్టి పుణ్యాత్మకులున్‌
రాజోత్తమ! భూదాన | భ్రాజిష్ణునిఁ బోల రండ్రు పరమమునీంద్రుల్‌’.
356
వ. అని చెప్పి భీష్ముండు వెండియు నిట్లను ‘భూదేవి జనులకు హితంబుగా నానతిచ్చిన వాక్యంబులు భూగీత లనంబరఁగు; వాని విని పరశురాముండు భూదానపరుం డయ్యె నని విందుము పాండవాగ్రజా! యవి నీ వాకర్ణింపుము. 357
క. ‘నను నిండు రెండు లోకము | లను జెడని యశస్సుఖంబులం బడయఁగఁ గో
రినయట్లయినను దీనికి | నెన లేవు సుఁడీ! తలంప నే ధర్మములున్‌.
358
చ. ఇతరుల దాన మేనిఁ దమ యీగియ యేనిని నన్ను మార్తురే
మతి నరకాధివాసగతి మాన్పఁ దలంచుట గల్గినన్‌ సమం
చితముగ భక్తి నిచ్చుట కుశీలత మార్చుట నాకు హర్ష భా
సితయుఁ; బరాభవ వ్యథయు జేఁత సుఁడీ! యిదె చాటి చెప్పితిన్‌.’
359
క. ‘వినుఁ డుభయలోకముల మే | లొనరింతుం గీ డొకింతయును నిలువఁగ నీ
క నిరాసంబు నొనర్తును | నను నిచ్చిన నెట్టి దుర్జనములకు నైనన్‌.’
360
వ. అనియె ‘నని యవ్వాక్యంబు లుపన్యసించి దేవవ్రతుం డన్నర దేవోత్తమునకు మఱియుం జెప్పు; ‘నవ్విషయంబున నింద్రుం డడుగ బృహస్పతి సెప్పిన వచనంబులు వినుము చెప్పెద. 361
ఆ. ‘భూమి రత్నగర్భ పురుహూత! యటు గాన | కలుగు భూమిదాన కర్త యైన
వాని కశ్వ హస్తి వనితాది సర్వ ర | త్నములు నిచ్చునట్టి యమితఫలము.
362
క. వసుదాయిని యైన వసుధ | నొసఁగి నతనిఁ దన్న తన్న యొసఁగె ననుచు సం
తసపడు భూతము లన్నియు | నసమానము భూమిదాన మమరాధీశా!
363
క. విను రాజులకు నవశ్యం | బును జేయఁగవలయు నధిక భూదానము; రా
జనువాఁ డఘముల కాకర | మనఘా! యది దక్కనొంట నది వ్యయ మగునే?
364
క. పూర్వదత్త యైన భూమి నెవ్వఁడు పుచ్చి | కొనియె, నతఁడు దనదు కులమువారి
నిరువదొక్కతరము నరకవాసులఁ జేయు | దాను నడుము గాఁగ ధర్మనిరత!
365
క. మును దా విప్రున కిచ్చెద | నని భువి యీ కుండుకంటె నధికపుఁ బాపం
బును నడుగ కిచ్చుటకు మిగి | లిన పుణ్యము నెందు నరయ లేవండ్రు బుధుల్‌.’
366
వ. అనిన విని యజాతశత్రుండు సురనదీపుత్త్రుతో ‘దానపరులయిన మానవులకు దాతవ్యంబులగువాని విశేషంబు లెఱింగింపవే’ యనుటయు, నతం డన్న కనక పానీయ ప్రముఖంబులైన పదార్థంబుల విశేషంబులు గల; వవి యెఱింగించెద; నొక్కనాఁ డన్నంబు విషయం బైన దానంబు ప్రకారంబు. 367
క. ఏ నడుగఁగ నారదముని | మానితముగఁ జెప్పినట్టి మాటలు సువ్య
క్తానూన వృత్తిఁ జెప్పెద | భూనాయక! యేక చిత్తమున విను వానిన్‌.
368
క. మునులును దివిజులు నన్నము | వినుతింతురు లోకతంత్రవిధిఁ గ్రతువులు ద
క్కునుగల సర్వము నన్నం | బున నడచుం గాన యన్నము విశిష్ట మిలన్‌.
369
ఆ. అన్నదాన సదృశ మగు దాన మెందు నె | న్నఁడును లేదు గావునను విధేయ
మన్నదాన మధిక యత్నపూతంబుగాఁ | బూని దానిచేఁత పుణ్యతమము.
370
సీ. ప్రాణంబులకు విధారక మన్న మింటి జ | నంబుల కుడిగి యైనను సుభక్తి
నతిథికిఁ బెట్టుట యధిక పుణ్యము శ్రాంతు | వృద్ధుఁ దాపసు బాలు వికలు వనితఁ
గడపఁగా దాఁకలి గదిరి యర్థించిన | గృహమేధి కవమతి గినుక దగదు
కాలంబుతోఁ గుక్క మాలఁడు దుదిగాఁగ | నాఁకొని వచ్చిన ననుగుణముగ
 
ఆ. నాచరింపవలయు నాహార కల్పన | మునుల దేవ పితృ సముత్క రముల
నన్నదాన విధుల నాదరంబుగఁ బ్రియ | మొందఁ జేఁతఁబోల వొండు విధులు.
371
క. కులమును, విద్యయు, వృత్తము | నలఘుమతీ! యన్న మిడుటకై యడుగంగా
వలవదు; విప్రుని నాదర | మలరంగా నిడుట లెస్స యడిగిన మాత్రన్‌.’
372
వ. అని వెండియు. 373
తే. అజుఁడు కల్పాదియం దన్న మమృత మనియె | నన్న హాని బలాధికు నైన దుర్బ
లాత్ముఁగాఁ జేయుఁ, గావున నన్న భుక్తి | సకలధాతు వృద్ధికినయి జనము గోరు.’
374
క. అని యతఁడు వల్కె ననియును | విని యన్నము సవినయముగ విప్రాదులకున్‌
మనుజేశ! యిడుదు నీవును | మన మలరఁగఁబెట్టుమీ సమస్త జనులకున్‌.
375
ఆ. అన్న మిడిన మణిమయావాసశయ్యాస | నములు నమృత భోజనంబు హృద్య
మాల్య లేపనములు మహనీయ మహిళాను | భవముఁ జిరతనొందు దివమునందు.’
376
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )