పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
నక్షత్రదాన మహిమాతిశయ నిరూపణము (సం. 13-63-1)
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘నక్షత్ర విషయంబులైన దానంబుల తెఱంగెఱింగింపవే’ యనుటయు ‘నిట్లు దేవకీదేవి యడుగ నన్నారీరత్నంబునకు నారదుండు సెప్పిన వాక్యంబుల యర్థంబు లుపన్యసించెద నాకర్ణింపుము.’ 377
సీ. కార్తెఁ బాయస మబ్జగర్భునితార మా | షములు మాంసమ్ము నంజంగఁ గలుగు
నన్నంబు శశితారయందు గోవార్ద్ర న | దితి తారఁ బులగంబు దీపుగలయు
నట్టులు గురుతార నధిప ! సువర్ణమా | శ్లేష రూప్యము మఖఁ జెల్లు నుప్పు
తిలలు భగుం డధిదేవత యగు తారఁ | జెఱకుఁ దేనియ నుపాసిక్త మైన
 
తే. భక్త ముత్తరఫల్గునిఁ బాలతోడ | పౌష్టికాన్నంబు రవితార సకరిరథము
చిత్తనాఁడు శ్రీగంధపుఁ జెక్క స్వాతిఁ | దనకుఁ బ్రియమైన యది మేలు దానమునకు.
378
సీ. అనఘ! విశాఖ నె ద్దనురాధఁ బైచీర | విను జ్యేష్ఠఁ దగఁ గఱివేము గూర్చి
ముల్లంగి మూల సన్మూలఫలంబుఁ బూ | ర్వాషాఢఁ బెరు వుత్తరాఖ్య యైన
యాషాడ మాక్షికార్ద్రాన్నంబు హరివసు | జలతారకములఁ గంబళము గుజ్జు
లమరిన బండియు యవలుఁ బూర్వోత్తరా | భాద్ర పౌష్ణాశ్వినీ భరణులందుఁ.
 
తే. గ్రొవ్వుగల మేక నంజుడు గొఱియ యెఱచి | కంచుకుండతో మొద వశ్వకలిత శకట
మతుల తిలధేను లీఁ బాడి; యఖిలతార | కముల నీగులు నూర్థ్వలోకములఁ జేయు.’
379
వ. అని యెఱింగించి యమ్మానవపతితో నమ్మాననీయుండిట్లనియె. 380
క. ‘అలఘుతర సకల కామ్యం | బుల నిచ్చినయట్టి మహిత పుణ్యంబై తా
వెలుఁగుఁ గనక మిచ్చుట యని | పలికెం గర్మజ్ఞుఁ డత్రి పరహితచరితా!
381
తే. కనక మాయుఃప్రదంబు, పావనము, భావ | శుద్ధి నొనరించు దాతకు; సువ్రతమున
వేడ్కతో దాని నిచ్చుట వేఱ పొగడ | నేల? యనియె హరిశ్చంద్రుఁ డిద్ధతేజ!
382
క. పానీయదాన ముత్తమ | దానం బని యఖిల ధర్మతత్త్వ దృఢ పరి
జ్ఞానానూనుం డగు మను | మానవపతి సెప్పె నృపసమాజ వరేణ్యా!
383
క. కావునఁ జెఱువులు నూతులు | బావులుఁ గొలఁకులును నెపుడుఁ బౌరవవర్యా!
కావింపవలయు; నవి గడుఁ | బావనములు పుణ్యలోక భాగిత నిచ్చున్‌.
384
క. అనఘా! యెవ్వని కావిం | చిన సలిలాశయమునందుఁ జెలఁగుచు గోవుల్‌
గొను నీ రాతని వంశం | బున కవి గావించు నూర్థ్వ భువన ప్రాప్తిన్‌.
385
తే. ఆఁకలేక యెవ్వాని జలాశయమున | మండు వేసవి యందును మనుజకోటి
యవభృథస్నాన పానంబు లాచరించు | నతఁడు వొందఁడు వివిధ దుర్గాది గతులు.
386
క. యాగాది కర్మముల కుప | యోగింపంబడుటఁజేసి యుత్తమము, ఘృతం
బాగురు వస్తువు నిచ్చుట | యాగములకు నగ్నికిం బ్రియంబై యుండున్‌.
387
తే. గరగ లొసఁగిన నరుఁడు భూసురు లొనర్చు | ఆచమనముఖ కర్మంబులందు షష్ఠ
భాగఫల మొందు నెగడికిఁ బాచనమున | కింధనము లిచ్చి ధనముల నెసక మెసఁగు.
388
ఆ. ఛత్ర మిచ్చి కాంచుఁ బుత్త్రులఁ బురుషుండు | సకల కామ్య దానసమము శకట
మిచ్చు టనఘ! చెప్పు లిచ్చినఁ గంటకు | లైన రిపులఁ ద్రొక్కి యతఁడు దిరుగు.
389
క. తిలలు పితృభోజ్యములుగా | జలజభవుఁడు సేసెఁ బితృనిచయ మలరఁ గడుం
దిల లిచ్చిన శుచు లగుదురు | దొలఁగుం బర్వసురతాది దోషము లెల్లన్‌.
390
తే. దివ్యముని యగు కాశ్యపు భవ్య గాత్ర | ముల జనించి భవ్యంబు లై తిలలు వెలయు;
నట్లు గావునఁ దత్కృతయజన మఖిల | వస్తు యజనంబుతో సరివచ్చు నండ్రు.
391
క. తిలదాన మఖిల దానం | బుల కంటె విశిష్ట మెల్ల మునులును నియతిం
దిల లర్హములగు పాత్రం | బుల కిచ్చియ కాదె పెంపు వొందిరి వత్సా!’
392
వ. ‘అని చెప్పి యాపగాతనయుం డొక విశేషంబు వినిపింపవలసి ధర్మజున కిట్లనియె.’ 393
ఉ. ‘దానము లాదిగాఁ గలుగు ధర్మము లెల్లను జేఁతకున్‌ నిజా
ధీనపుఁ జోటు గావలయు దేవతలున్‌ మునులుం జతుర్ముఖుం
గానఁగఁ బోయి యజ్ఞముఖ కర్మ సమాచరణార్థ మై తదీ
యానుమతిం దగం బడసి యయ్యయిచోటుల నాచరింపరే.
394
క. కాననము గిరులు నదులును | నానా తీర్థములు భూజనంబుల కెల్లన్‌
భూనుత! సాధారణములు | వానను ధర్మములు సేయవచ్చు నిజేచ్ఛన్‌.
395
ఆ. అధిప! నా మనమునయందుఁ దోఁచినయది | యాచరింపవలయు నర్థమగుటఁ
జేసి దీని నీకుఁ జెప్పితి గో దాన | శస్తమహిమ వినుము విస్తరింతు.
396
సీ. గోవు లెక్కుడు తపోభావితాత్ముల కంటె | ననినఁ దద్గౌరవంబునకు మేర
గలదె? సత్యాఖ్య లోకంబున నవి సోమ | సంగతత్వంబున సంచరించు
వినుత హోమముల కెల్లను బాలుఁ బెరువు నే | యును నిచ్చుఁ గర్సనంబునకు నొదవుఁ
దోలు శృంగంబులు వాలంబు రోమ చ | యము శకృన్మూత్రము లఖిలవర్త
 
ఆ. నముల కుపకరించు; శ్రమము శీతాతప | వ్యథయు లేమి నెపుడు నతిభరంపుఁ
బనులు సేయు గోవు బ్రాహ్మణుఁ డన నేక | తత్త్వ మగుటఁ బరపదంబుఁ గాంచు.
397
క. గోవుల విప్రుల కిచ్చిన | నే విషమపు గతులఁ బొరయ కేరికి నరుగం
గా వశము గానిలోకము | లావాసంబులుగ నిలుతు రతి సుఖవృత్తిన్‌.
398
క. గోవుల పాలమృతం బని | దేవేంద్రుఁడు సెప్పెఁ గాన ధీరత్వనిధీ!
గోవు నొసఁగ నమృతము స | ద్భావంబున నిచ్చినట్టి ఫల మొడఁగూడున్‌.
399
తే. అనఘ! గోవులు ప్రాణంబు లని సమస్త | మునులు సెప్పుదు; రట్లు గావునఁ దలంపఁ
బ్రాణదాన విధాన సంప్రాప్త మైన | ఫలము గోదానకర్తకుఁ గలుగుఁ జూవె!
400
క. క్రూరునకు నాస్తికునకు దు | రారంభున కిచ్చినం బరమ దుఃఖమునుం
గూరును గో; వది దాతను | నారకిఁ జేయుం; బరీక్షణము గడు వలయున్‌.
401
ఆ. గొడ్డు బడుగుఁ దెవులు గొంటుఁ గ్రే పెడలిన | దాని నెచ్చటేని నూన మైన
యట్టిదాని నొకట నాయాసపడి యున్న | దాని నీరు గోప్రదానవిదులు.
402
క. విను పుణ్యలోకముల కా | వనఘా! విప్రులకు గోచయంబులఁ బెక్కి
చ్చిన నవి దాతకు మోక్షం | బును జేయఁగఁ జాలు నండ్రు పూర్వాచార్యుల్‌.’
403
వ. ‘అని చెప్పి గాంగేయుం డన్న పానీయ దానఫలాతిశయంబులు వెండియు వినిపింప వేడ్కసేసి యవ్విభున కిట్లనియె’ 404
సీ. ‘అధిప! యింకను విను మన్నంబు జలమును | నిచ్చుట యీవుల కెల్ల నెక్కు
డగుట నేఁ జెప్పెద నమృత సుధాస్వధా | నామముల్‌ సురలందు నాగకులము
నందును బితృకోటియందును వర్తిల్లు | నన్నంబునకు నోలినట్లుఁ గాక
యది ప్రాణ మండ్రు మహాత్ములు గావున | దానిఁ బెట్టుట ప్రాణదాన సమము;
 
తే. విను విశేషించి తత్పాకమునకు జల ము | పాశ్రయము చంద్రునకుఁ బుట్టఁ బట్టునయ్యె
జలము చంద్రుండు గాఁడె యోషధులఁ బ్రోచుఁ | గాన యుత్తమ మన్నంబు కంటె జలము.’
405
వ. అని పలికి మఱియును. 406
క. ‘తనకుఁ గలయట్టి యన్నము | నన సుర పితృపూజనములు నరునకు నడపం
జను నతిథి తర్పణము దా | నన తగ నొనరించు వాఁడు నరవరముఖ్యా!’
407
వ. అని నిర్దేశించి తిలదానం బత్యాదరణీయంబని ప్రసంగించి ‘యది వినినది యైనను నేమి? తద్విషయంబున కొక్క యితిహాసంబు గలదు; చెప్పెద విను ‘మని పలికి, యనిమిష నదీనందనుండు కుంతీనందనాగ్రజుతో నిట్లనియె. 408
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )