| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
దుష్టమైన గోదానంబు గష్టవృత్తిఁ దెచ్చె నృగనాముఁ డగు జగతీవిభునకు నత్తెఱం గితిహాసమై యవనిఁ బరఁగు; వినుము సెప్పెద దాని వివేకధుర్య! |
417 |
| క. |
ద్వారవతి నొక్క నూతం | దోరపుఁ దను వక్కజమగు తొండ నొకటి న చ్చేరువ మెలఁగుజనులు గని | నీ రిది గలఁగించు నిట్ల నిలిచిన యేనిన్. |
418 |
| క. |
అని బలు మ్రోకులు వేగమ | కొని వచ్చి తగిల్చి లావుగొని తిగువఁగ నా ఘనజంతు వచలితంబై | యునికికి విస్మయము నొందు నుల్లంబులతోన్. |
419 |
| తే. |
కృష్ణు పాలికిఁ బోయి యక్కీట మున్న | తెఱఁగు సెప్పినఁ జని దానిఁ దిగిచె వెడల నమ్మహాత్ముఁ డెఱింగియు నర్థితోడ | నడుగ నది ‘యేను నృగుఁడఁ జు’ మ్మనియె ననఘ! |
420 |
| వ. | అనిన విని యద్దేవుండు ‘నీ వనేక గో సహస్రంబుల విప్రజనంబుల కిచ్చి తని విందు; మిట్టి దుర్జన్మంబు నీకేల వాటిల్లె?’ ననుటయు నమ్మనుజవల్లభుండు. | 421 |
| సీ. |
ఉత్తమ బ్రాహ్మణుం డొకనికి నొక్కనాఁ | డొక గోవు నిచ్చితి నుల్ల మలర నతఁడును గొనిపోయె; నది మేఁత కర్థి మా | కదుపుల లోపలఁ గలసి వచ్చె గోవుల మఱియును గోపాలకులు దాన | విధికినై తెచ్చుచో విధివశమున వానిలో నదియును వచ్చిన నెఱుఁగక | దానంబు సేసితి; దాని మున్న |
|
| ఆ. |
గొనినయతఁడు దడవి కని ‘యిది నాదు గో’ | వనియెఁ బిదపఁ గొనిన యతఁడు పెనఁగి ‘నాకు నృపతి యొసఁగె’ నా నిద్దఱకును వా| దైన నన్నుఁ గాన నరుగుదెంచి. |
422 |
| వ. | తనముందటి తెఱం గెఱింగించి. | 423 |
| క. |
ఇచ్చినవారల కొనఁగా | వచ్చిన నడ్డంబు గలదె వసుధాధిప! యం చిచ్చఁగడు నొచ్చి పలికిరి | వెచ్చని నిట్టూర్పులడర విప్రులిరువురున్. |
424 |
| వ. | మఱియుం బొడము మాటల నమ్మొదవు పోకడ నాకుఁ దెల్లం బగుటయు. | 425 |
| ఉ. |
దానికి నేను జిత్తమునఁ దాపము నొందుచు మున్ను గొన్న య మ్మానితవిప్రు వేఁడికొని ‘మంచివి గోవులు నీకు నూఱు వే యైనను నిచ్చెదన్ విడువవయ్య మహీసురవర్య! నెమ్మి న ద్ధేనువు’ నన్న నాస్యమున దీనత దోఁపఁగ నాతఁ డిట్లనున్. |
426 |
| తే. |
‘పాలు గడుఁ బెక్కు దాని సబాము లెస్స | పెయ్య కర్మిలి గలదు మత్ప్రియ సుతుండు పాల కేడ్చిన యపుడ చన్పట్టనిచ్చు - నేది ప్రొద్దైన నట్టి గో వెందుఁ గలదు? |
427 |
| క. |
శ్రీవోలె నింటిలో నా | గోవుండఁగఁ జూతుఁగాని కోటి మొదవులుం గావు సరి దాని’ కని భూ | దేవుఁడు వోవుటయు నేను దీనత దోఁపన్. |
428 |
| చ. |
‘కనకము ధేనువుల్ మణి నికాయము లిచ్చెద; నేమి యైనఁ ద క్కును మది కిష్టమైన యది గోరుము గోవున’ కంచుఁ జేరి త క్కిన ధరణీసుపర్వునకుఁ గీడ్పడి యెమ్మెయి వేఁడికొన్న ‘నేఁ గొన భవదీయ రాజ్యమును; గుత్సితవృత్తికి నియ్యకొందునే?’ |
429 |
| తే. |
అనియెఁ గాని నా మాట గైకొనఁడ యాతఁ; డట్టి యెడఁ గాలవశగతి యావహిల్లి యముని కడ కేఁగ నాతోడ నతఁడు వికచ | నలినలోచన! యిట్లని పలికెఁ బ్రీతి. |
430 |
| చ. |
‘జనవర! పుణ్యకర్మము లసంఖ్యము లీవొనరించి తొక్క వి ప్రునిధన మజ్ఞతం గొనుటఁ బొందె సకిల్బిషభావ మల్ప మి ట్లొనరిన రెంట నయ్యెడు మహోన్నతి దుర్గతులందు మున్ను నీ చనునెడ యెద్ది నావుడు న సౌఖ్యపుఁ జోటని సమ్మతించితిన్. |
431 |
| ఆ. |
అట్టు లియ్యకొనిన యా క్షణమాత్ర మ | స్తకము క్రిందు గాఁగ ధరణిఁ బడఁగ వలసె; నపుడు వింటి నలఘు కృపార్ద్ర వ | ర్ణాలికలితమైన యముని పలుకు. |
432 |
| వ. | అది యెయ్యది యంటేని. | 433 |
| తే. |
వాసుదేవుఁ డనేక సంవత్సరముల | కధిప! నీ యున్న చోటికి నరుగుదెంచి యుద్ధరించు ని న్నట నిత్యసిద్ధ సౌఖ్య | మైన లోకమునకుఁ జను దనఘ! నీవు. |
434 |
| వ. | ఇట్లు వినుచు నిలాతలంబునం బడి కృకలాసత్వంబు నొంది చరియించుచుండి, నేఁడు దైవదత్తంబయిన చిత్తవర్తనంబునం జేసి యిక్కూపంబునకు వచ్చిన యపర క్షణంబునం గృకలాసంబులకు లేనిమేని పెం పావహిల్లిన నుల్లంబు సవిస్మయం బగుచునుండ యమప్రసాదంబున నెప్పుడును మాయని పరిజ్ఞానంబు వర్తిల్లనున్నంతం బరమ యోగీంద్ర భావ్యంబగునీ భవ్యసన్నిధి దొరకొనియె’ నని పలికె నప్పు డప్పుడమిఱేనికిఁ బూర్వాచరిత పుణ్య కర్మానురూపం బగు రూపం బావిర్భవించిన దానికిం బ్రమోదభరితుం డై యతండు. | 435 |