| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| తే. |
‘దేవ! నీ దగు కారుణ్య దృష్టి యమృత | పూరమును బోలె నా మీఁదఁ బొలయుటయును దీనదశ పాసె; భవదనుజ్ఞానిరూఢి | నేను జనియెద సంచిత స్థానమునకు.’ |
436 |
| క. |
అని సవినయ ప్రణామం | బున నారాధించి వృష్ణిపుంగవుఁ దగ వీ డ్కొని యా నృగుఁడు విమానం | బున నుత్తమలోకమునకుఁ బోయె నరేంద్రా! |
437 |
| వ. | ఇవ్విధంబున. | 438 |
| క. |
భరితానందుఁ డగుచు నృగుఁ | డరిగిన, లోకహితకారియై కృష్ణుఁడు ని ర్భర మధురతాతిహృద్యా | క్షరంబుఁగా నిట్టు లనియెఁ గౌరవముఖ్యా! |
439 |
| క. |
‘ధరణీసుర ధన హరణము | దురితతమము నృపున కధిక దోషము నృగగో హరణ క్రియ విప్రస్వా | హరణము భూపాలవరున కాపదఁ దెచ్చున్.’ |
440 |
| వ. | అనియె; నివ్వాక్యంబులు నీకుం జెప్పవలవ దైన నితిహాసావసానువర్తి యగుటం జేసి వినిపించితి’ నని చెప్పి యప్పాండవాగ్రజుతో భీష్ముండు వెండియు. | 441 |
| క. |
‘సత్సంగతి సజ్జనులకు | నుత్సవ మొనరించు నృగున కున్నతిఁ ద్రిజగ ద్వత్సలుఁ డగు కృష్ణుండు స | ముత్సుకతం జేరఁ జనుట యొసఁగిన మాడ్కిన్.’ |
442 |
| వ. | అని పలికి మఱియును. | 443 |
| క. |
‘దానము సమగ్ర ఫలదము | భూనాయక! గోవునెడ విబుద్ధిత్వము గీ డైనది గావున గోస | మ్మానన మేమఱక యుండు మది యేప్రొద్దున్.’ |
444 |
| వ. | అనిన విని ధర్మజుండు ‘గోవులయెడ విరుద్ధాచరణంబున నయ్యెడు దురితంబు తెఱంగెఱింగించితి; గో దాన ఫలవిశేషం బింకను విన వలతుం జెప్పవే’ యనుటయు, ననిమిష నదీనందనుం ‘డివ్విషయంబున నైనది యొక్క యితిహాసంబు గల దాకర్ణింపు’ మని యతని కిట్లనియె. | 445 |