పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము
గో ప్రభావ విషయకం బగు నౌద్దాలకి పుత్త్ర చరిత్రము (సం. 13-70-1)
సీ. ‘అనఘుఁ డౌద్దాలకి యను మహాముని | దన తనయునిఁ బిలిచి యిధ్మములు దర్భ
కట్టయు జలపూర్ణ కలశంబుఁ బువ్వులు | మఱచి వచ్చితి నేటి మడఁ గుమార!
గొని రమ్ము వేగంబ చని’ | యన్ననాచికేతాహ్వయుం డగు నతం డరుగునంత
వాహిని పొంగిన వఱ్ఱోడి యవి వోయెఁ | గానక యాతండు క్రమ్మఱంగ
 
ఆ. నరుగుదెంచి కాన ననుటయు నాఁకలి | దనదు కర్మవైకృతంబు సైఁపఁ
జాలకలిగి ‘యోరి! జముఁ జూడఁ బొ’మ్మని | శాప మిచ్చెఁ దండ్రి భూపవర్య!
446
వ. ఇట్లు శపియించిన నబ్బాలకుండు గేలు మోడ్చి ఫాలంబున మోపికొనుచుం ‘బ్రసన్నుండ వగు’ మని పలుకు పలుకఁగాఁ జేతనారహితుండై పడుటయు నమ్మునివరుండు. 447
క. కనుఁగొని పశ్చాత్తాపం | బున నుల్లం బెరియ నిట్లు పుత్త్రకు నే నే
పనికై చేసితి విగతా | సునిఁగా నని మూర్ఛ మునుఁగుచుం బడియె ధరన్‌.
448
వ. పడి యొక్కింతసేపునకుం దేఱి తనయుం దేఱి చూచి యశ్రులొలుక నబ్బాలకు నురంబున మొగంబు మోపి చేష్ట దక్కి యుండ, నద్దినశేషంబును నయ్యామినియునుం జనియె సూర్యోదయ సమయంబున. 449
ఆ. అతని కన్ను నీర నాప్లుతంబైన యా | శవము చేతనించి చలన మొంది
యెలమి నత్తపస్వి యీక్షించుచుండఁ గ | న్దెఱచె, నిట్లు మగుడఁ దెలివినొంది.
450
క. తనుఁ గనుఁగొనియెడి సుతుతో | మునిపతి యి ట్లనియెఁ ‘బుణ్యముల ప్రోఁకవు నీ
వనఘ! చని పుణ్యలోకముఁ | గని మత్పుణ్యమున రాక గలిగెను మగుడన్‌.
451
క. నీదగు తనువున దివ్యా | మోదము సాంద్రమయి సోడు ముట్టెడు నత్యా
హ్లాదమహాశ్చర్యసము | త్పాది యగుచు; నీగతాగతములం జెపుమా!’
452
వ. అనిన విని యమ్మునిపతికిం బ్రణమిల్లి యక్కుమారుం డిట్లనియె. 453
సీ. ‘ నీ యాజ్ఞఁ జని కమనీయ విశాలమై | మణిమయత్వంబున మహిత మగుచు
వెలిఁగెడు సమవర్తి కొలువు కూటముఁ బ్రవే | శించితి నాతఁడు సేరఁ బిలిచి
యంచితాసనము వెట్టించి భవద్గౌర వాతిశయంబున నర్ఘ్య ముఖ్య
పరిపూజనముల సంభావించె నతనితో | ‘నే లోకమున వసియించువాఁడ
 
తే. ననఘ! యానతి యిమ్ము నా కంటి ‘ననిన | ‘నీవు సావవు; నీ తండ్రి నిన్ను జమునిఁ
జూడఁ బొమ్మని పనిచినఁ జూచి; తంద | యరుగు మమ్ముని వగ పేద’ ననియె నతఁడు.
454
వ. అనుటయు ‘నట్లకాక! మగిడిపోయెద; నీ కడకు వచ్చితి, ధర్మమయుండవగు నిన్ను దర్శించితిం; బుణ్యలోకంబులు దర్శింప వేడ్క పుట్టెడుఁ జూపవే’ యని విన్నవించిన. 455
ఉ. అంచిత వాహనా కలిత యానముఁ దేరఁగఁ బంచి నన్ను నె
క్కించి సహాధిరూఢుఁ డయి కేల్‌ దన కేల నమర్చి సత్కథా
సంచయవర్తనుం డగుచుఁ జారుముఖాబ్జవికాస మొప్ప వ
ర్తించుచుఁ బుణ్యలోకములు ప్రీతి యెలర్పఁగ నాకుఁ జూపినన్‌.
456
తే. నయనములకుఁ జిత్తమున కానంద మొసఁగు | నట్టి మణిగేహవాపికోద్యానములును
బరమభక్ష్య భోజ్యాత్మక గిరులు హృద్య | దుగ్ధ ఘృతమయ ఘనసరిత్తులును గంటి.
457
వ. మఱియు గంధమాల్య దివ్యాంబరాభరణ ప్రముఖంబులగు భోగ యోగ్య పదార్థంబులు మహారాసులై యుండ నాలోకించితి; ‘నీ లోకంబు లే పుణ్యంబులు సేసిన జనుల కనుభావ్యంబు?’ లని యడిగితి; నడిగిన ధర్మరా జిట్టిట్టి వారివని యెఱింగించి ‘యిం దధిక విభవంబులైన యట్టి మాననీయ స్థానంబులు గోదానంబు లాచరించిన వారలయవి; భక్ష్యభోజ్య గిరులును దుగ్ధ ఘృతనదులును వారివ’ యని చెప్పి, వెండియు. 458
క. మానిత పాత్రము సద ను | ష్ఠానంబును బ్రీతి భక్తి సంపన్నతలున్‌
ధేనువు మేలిమియుం గల | దానముఫల మిట్టి దనఁగఁ దరమె యజునకున్‌.
459
తే. బలము లేఁబ్రాయమును రూపుఁ గలుగునట్టి | గనపయెద్దు సద్ధర్మ విప్రునకు నిచ్చి
నతఁడు సద్విధి గోదాన మాచరించి | నతని పడసిన గతిఁ గాంచు ననఘచరిత!
460
క. గోవులు సూర్యుని యుజ్జ్వల | గోవులయ ట్లగుటఁ జేసి గోదానపరుల్‌
భూవినుతా! సూర్య సదృశు | లై వెలుఁగుదు; రిట్ల చెప్పు నాగమఫణితుల్‌.’
461
క. అని పలికి వీడుకొలిపిన | మునివర! యజ్జముని చరణముల కెఱఁగి ముదం
బున వచ్చితి’ ననె జనకుని | మన మానందరసపూర మయతం బొంగన్‌.
462
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )