| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - ద్వితీయాశ్వాసము |
| వ. | అని చెప్పిన విని కుంతీతనయాగ్రజుండు ‘గోదాన కర్త లెందేని వసింతు రాలోకం బెట్టి? దెఱింగింపు’ మనిన నన్నరదేవునితో దేవవ్రతుండు ‘దీనికి బ్రహ్మవాక్యంబులు గల; విట్ల యింద్రుం డడిగిన నతనికి బ్రహ్మ యిట్లనియె. | 463 |
| ఆ. |
‘అడిగి మేలు సేసి; తాలోక మెవ్వరు | నెఱుఁగ కునికిఁ దెల్ల; మేను సువ్ర తాత్ములైన మునులు నతుల పాతివ్రత్య | సతులు నెఱుఁగుదుము విశాలచిత్త! |
464 |
| క. |
విను మయ్యెడఁ గాలక్రమ | మును డప్పియు రోగములును ముదిమియు లే; వ వ్వినుత స్థానం బవ్యయ | మును గేవల సార సంప్రమోదకరంబున్. |
465 |
| వ. | దానిపేరు గోలోకంబు. | 466 |
| క. |
గురు శుశ్రూషకులును, స | త్యరతులు శమదమ వినిర్మలాత్ములు దుర్భ క్ష్యరహితులును నిల్తు రను | త్తర మగునచ్చోట గోప్రదానపరులతోన్. |
467 |
| వ. | అని వెండియు. | 468 |
| ఉ. |
‘దాయధనంబు సంగరవిధా సముపార్జితమున్ సధర్మ కో పాయసమాహితంబును శుభప్రతిపాదనలబ్ధమున్ మరు న్నాయక! వెండియుం గలుగు నాయపుఁ జొప్పుల సొమ్ములుం దగన్ గో యజనార్థ సత్క్రియలకుం బెఱసొమ్ముల నైనఁ గీడగున్. |
469 |
| క. |
విను గోలోకంబును గడ | చిన లోకము గలుగ; దూఁది చెప్పెదఁ బుణ్యం బును గోప్రదాన విధి మిగి | లిన యట్టిది వత్స! యొండు లే దరయంగన్. |
470 |
| తే. |
ఆగమాధ్యయనంబు, వ్రతాభిరతియు, | నైజకర్మ శీలము, గురుపూజనంబు, మాతృపితృ రక్షణముఁ, బాత్ర మహిమ లప్ర | తర్క్య ఫలదాయి యైన గోదానవిధికి. |
471 |
| క. |
అని నిర్దేశించిన న | వ్వనరుహసంభవుని దివ్యవాక్యంబులు నె మ్మనమున నిడి గోయజ్ఞము | లనూనవిధి నడపె నింద్రుఁ డమలచరిత్రా! |
472 |
| క. |
నీవును నవధానముతో | గోవుల మన్నింపు పాత్రకోటి కొసఁగు స త్సేవిత పుణ్య చరిత్రము | లా వెరవునఁ బోల వెన్నియైనఁ గుమారా!’ |
473 |
| క. |
అని యిట్లు గోవిశేషము | లనేక భంగులను బాండవాగ్రజునకు శం తనుసుతుఁడు సెప్పె నన విని | ‘మునివర! యేభంగి వాక్యములు మఱి సెల్లెన్?’ |
474 |
| వ. | అని యడుగుటయు. | 475 |