పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు సువర్ణ దాన మహిమాతిశయంబు సెప్పుట (సం. 13-83-6)
సీ. శంతను నృపతి లోకాంతరగతుఁడైన విను తదీయశ్రాద్ధ విధి యొనర్పఁ
బూని గంగాద్వారమున కేఁగి మా తల్లి | గంగ సాహాయ్యంబు గారవమున
నాచరింపంగఁ గ్రియాకలాపం బెల్ల | నడపఁ బిండ ప్రదానంబు సమయ
మగుటయు దర్భ విన్యాస మొనర్ప నం | దంగుళీయక కంకణాంగదములఁ
 
ఆ. గాంతమైన యొక్క కరము వొడమి యఱ | చేయి సాఁచుటయును జిత్త మద్భు
తంబుఁ బొంద దానిఁ దప్పక చూచి య | య్యధిపు బాహు వగుట యాత్మ నెఱిఁగి.
128
క. జనకుఁడు వేడుకఁ జే సాఁ | చిన యంతన సంతసిల్లి చేతం బిండం
బనుమానింపక యేఁ బె | ట్టిన శాస్త్రవిధాన గతి ఘటింపమి వచ్చున్‌.
129
తే. పితృకరంబునఁ బిండంబు పెట్టు మనదు | శాస్త్ర మంచిత మగు కుశాస్తరణమునన
పెట్టఁ జెప్పు; నట్లగుట ‘నేఁ బెట్టఁ జేత’ | నని మనంబునఁ దలఁచి వచనము సేసి.
130
క. అమలంబగు కుశసంస్తర | ణమునం బిండంబు వెట్టినం దోఁచిన హ
స్త మదృశ్యమయ్యె; మత్పితృ | సమితి ముదము మోములం దెసఁగఁ బొడ సూపెన్‌.
131
క. పొడసూపి ధర్మమార్గం | బెడపక ‘నీ విట్లు పిండ మిడుటకు హర్షం
బడరినఁ జనుదెంచితి మె | క్కుడు తృప్తిం బొందితిమి ప్రగుణ్యచరిత్రా!’
132
వ. అని పలికి వెండియు. 133
క. ‘భూమికి గోవులకునునై | హేమమిడుట యస్మదీయ హితమును దేవ
స్తోమ ప్రియముం బావన | తా మహనీయంబుఁ జుమ్ము ధర్మవిధిజ్ఞా!
134
క. పావనము సువర్ణము వం | శావలికిం దనకు నిర్మలాత్మత నిచ్చున్‌;
నీ వది యెఱిఁగి సకలయ | జ్ఞావసరములను సువర్ణ యాజివ యగుమీ!
135
క. అని చెప్పి చనిన నాదగు | మనము సువర్ణ ప్రదాన మహిమ కెలయఁ ద
ద్వినుతా నుష్ఠానపర | త్వ నిరూఢుఁడ నైతి నేను ధర్మతనూజా!’
136
వ. అని పలికి యా భూవల్లభునితో భీష్ముండు వెండియు నిట్లను ‘నిది యేను గనినది సువర్ణదాన మహిమ; మఱియును వినినదియుం గల దాకర్ణింపుము. 137
సీ. పరశురాముఁడు గిన్క నిరువది యొక్క మా | ఱదయుఁడై రాజుల వెదకి వెదకి
వధియించి, కృపపుట్టి వాజిమేధంబు ప్రా | యశ్చిత్తముగఁ జేసి, యంతఁ దనివి
సనక వసిష్ఠాది మునివరేణ్యులఁ గూర్చి | ‘కల్మష పంకంబు గడిగి పురుషు
నత్యంత విమలుఁ జేయంగ నెయ్యది యోపు?’ ననిన వసిష్ఠుఁ డిట్లనియె నతని
 
ఆ. ‘కనఘ! విను సువర్ణ మగ్నిమయంబు దే | వతలు నగ్నిమయత నతిశయిల్లు
వారు గావునను సువర్ణదానంబు దే | వతల నీగి యట్ల శ్రుతులు సెప్పు.
138
తే. కావున సువర్ణ మసదృశ | పావనతాస్పదము; దాని భక్తిమెయిన్‌ వి
ప్రావలి కిచ్చిన యతనికిఁ బావనతం గొఱఁత గలదె పావనమూర్తీ!
139
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )