పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
వసిష్ఠుఁడు పరశురామునకుఁ జెప్పిన సువర్ణ మహిమము (సం. 13-83-40)
వ. ఏను బ్రహ్మముఖంబున వినినది సువర్ణ విషయంబైన విశేషం బొక్కటి యెఱింగించెద; నవహితుండవై విను’ మని పలికి యమ్మునిపతి యమ్మహాత్మున కిట్లనియె. 140
క. గిరిజయు గిరీశుఁడును నొం | డొరువులకై తప మొనర్చి యొకళు లొకళ్లన్‌
బెరయం బడసి పరమసుఖ | భరితాత్మకు లైరి జగము ప్రమదం బందన్‌.
141
వ. కొండొకకాలంబునకు నయ్యాదిమ గృహస్థుని తేజం బాపరమగృహిణి నిమిత్తంబుగా రేతో ధాతు రూపంబునం బ్రసన్నంబై యమ్మహేశ్వరు మానస వృత్తిం జేసి యగ్నియందు నిలిచియుండ, నత్తఱిం దారకుం డను నొక్క రక్కసుచేతం బెక్కు విధంబులం బాధలంబడి యనిమిషులును మునులును గమలయోనిం గానంజని యద్దానవుండు తముం బఱచిన పాట్లెల్ల నెఱింగించిన, నద్దేవుండు వారితో ‘దీని నెఱింగి యేను మున్న మీకు శోభనం బయ్యెడు తెఱంగు సమకట్టినవాఁడ; మీ రగ్ని నాశ్రయించి మాకు శుభంబు సేయవలయునని సంప్రార్థనంబు సేయునది; యతండు కర్తవ్యం బెఱుంగు; నరుగుం’ డని నియోగించిన సంతోషించి’ యట్లు చేసెద’ మని యవ్విధాత వీడ్కొని వార లగ్నికడకుం బోవ నుత్సహించి. 142
సీ. ఆతని యున్నెడ యారసికొని చను | నప్పు డాతండు నిద్రాతిశయము
నూని ప్రచ్ఛన్నుఁడై యుండుట వారలు | గానక యున్నంతఁ, గప్ప యొకటి
యగ్ని పాతాళంబునం దున్కి యెఱిఁగింప | నప్పావకుఁడు డాఁగి పిప్పలమున
కేగెడు నెడ శాపమిచ్చె జిహ్వాస్ఫూర్తి | లేక రసాలి వివేక మెడలి
 
తే. యుండెడుమ కప్ప లని బొక్కలెండ నెండి | చచ్చియును నీరు వచ్చినఁ జావు బొంకు
సేసి యెలుఁగులు సెలఁగఁగఁ జెలఁగ వరము | వారు కప్పల కిచ్చి రవార్యతేజ!
143
వ. ఇవ్విధంబున విబుధులు మునులు నమ్మండూకంబు మఱుకువ యుడిపి మఱియును. 144
క. అనలుని నన్వేషింపఁగ | వనగజ మొక్కండు రావివలను చతురతం
గనుగీటి చూపవార | వ్వనస్పతిం జేరఁజనఁగ వారని యలుకన్‌.
145
వ. అయ్యగ్నిదేవుండు గజంబులకు జిహ్వ దిరుగం బడ శపించుచు శమీగర్భ నివాసి యయ్యె; నది మొదలుగా నగ్నికి శమీగర్భంబునం దుత్పత్తి కలిగె; నద్దివిజులును దాపసులును గజంబులు ప్రతీపజిహ్వంబు లయ్యును సర్వరసజ్ఞానంబు గలిగి మాననీయంబులగు వరంబులంజేసి రాజితంబు లగునట్లుగా ననుగ్రహించి యగ్గజంబు విషాదంబు మాన్చి; రంత నొక్క శుకం బెఱింగింప శమీగర్భంబున నగ్ని యునికి యెఱింగి యందఱుం గ్రందుకొనం గడువేగంబునం బొదివికొనిన, నిదుర సెడుటకుం గోపించి. 146
ఆ. జిహ్వ మరలఁ బడఁగఁ జిలుకల నగ్ని శ | పించె ; సురలు సెవుల కించునట్టి
పలుకు వాని కొసఁగి చిలుక నానందింపఁ | జేసి యా కృశానుఁ జేరఁ జనిన.
147
వ. అతండు వారి నాలోకించి ‘మీ వచ్చిన కార్యం బేమి?’ యని యడిగిన వారుఁ దారక దైత్యు చేయు బాధ లెఱింగించి, వాఁ డేమి యుపాయంబునం దెగటాఱు నత్తెఱం గాపాదింపు’ మని నిన్నుం బ్రార్థింప వచ్చితి మని పలికి వెండియు. 148
క. ‘మాకుం గుశలము గోరుము; నీకును మే; లివ్విధంబు నీదు మహిమ యీ
లోకంబు లెల్ల మనములఁ | జేకొని కీర్తించునట్లు సేయుము కరుణన్‌.’
149
సీ. అనినఁ బ్రసన్నత ‘నట్టులు చేసెద | నూఱడుం’ డని వారి నూఱడించి
తనయందు వెలుఁగు శంభుని వీర్య మిడియె గం | గా గర్భరూపంబు గాఁగ నాతఁ;
డది యతి పరివృద్ధ మగుటయు ధరియింప | నోర్వక నిర్జర పర్వతంబు
తటమున శరవణస్థంబుగా గంగ యు | త్సృష్ట మొనర్ప నా శిఖరి సతరు
 
తే. వల్లరీగుల్మకముగ సువర్ణమయత | వెలుఁగ బాలుఁడై వెలిఁగె నవ్వీరగర్భ;
మచ్చటికి వచ్చి కృత్తిక లార్వురును మ | దీయ పుత్రకుఁ డనుచు నెత్తికొని రనఘ!
150
వ. ఇత్తెఱంగున నొక్కట నెత్తికొనుటయు నక్కుమారుండును షణ్ముఖుండై యొక్క పెట్ట సకలకృత్తికా స్తన్యపానం బాచరించె; న ట్లగ్నిసంభవ గాంగేయ కార్తికేయత్వంబు లొందిన యయ్యిందుమౌళితేజంబు పదంపడి బ్రహ్మాది దేవతలు పూజింప దేవసేనాధిపతిత్వంబునం బేర్చి యర్చిర్మహిత యయిన మహాశక్తిం దారకుం బరిమార్చి బృందారక ముని బృందంబుల కానందం బొనర్చె’ నని యిట్లప్పరమముని పరశురామునకుం జెప్పి పురహరుం డగు నప్పురుషుండు హిరణ్మయుం డగుటయు ‘నద్దేవదేవుండు దాన తనూభవుండై తోఁచుటయుం దథావిధ రేతోధారణంబున వహ్ని హిరణ్యాత్మకరేతో మూర్తియై హిరణ్యరేతుం డనం జనుటయు, నతండు తద్రేతః కలనంబునం దన్మయుం డగుటంజేసి పురహరునకు వహ్నిరేతుం డను నభిధానంబు గలుగుటయుం దేటపఱచి యవ్విధంబున రూపవంతంబైనది కావున సువర్ణంబు జాతరూప నామకంబై పరఁగుటయు నెఱింగించి. 151
క. మహితాత్మక! యేతాదృశ | మహిమంబు సువర్ణ మది సమంచిత తేజో
మహనీయము తద్దానము | మహత్త్వ మా శివుఁడ యెఱుఁగు మాకుం జూడన్‌.
152
వ. అవ్విశేషంబున నశేష కల్మషంబులం బాసి నరుండు విధూమత్వంబున వెలుంగు శుచియునుం బోలె శుచిత్వ సంపద సొంపారం బెంపారు నని యుపదేశించె నవ్వసిష్ఠ మునివరు వచనంబు లూఁది యమందాదర వర్ణనీయుండై సువర్ణదాన పరంపర లాచరించి. 153
క. ఆ రాముండు శుచిత్వ | శ్రీ రాజితుఁడయ్యె; నట్లు సేయుము నీవుం
గౌరవముఖ్యా! యది భవ | పారావారఘన యానపాత్రము సుమ్మీ!’
154
క. అని యనిమిష తటినీ ప్రియ | తనయుఁడు సెప్పుటయు ధర్మతనయుఁడు హృదయం
బునఁ బ్రమదము నిండార న | తనితో నతిభక్తి వినయ ధామం బగుచున్‌.
155
వ. ‘పితృ యజ్ఞ ప్రకారం బెఱింగింపవే’ యనుటయు నక్కురువరుఁ డన్నరనాథున కిట్లనియె. 156
క. ‘పితృపూజ సమగ్ర్యము దై | వత పూజనమునకు మనుజవల్లభ! పితృ దే
వతలఁ గొనియాడుదురు దే | వత లాదిగఁ గల్గు నెల్లవారును భక్తిన్‌.
157
వ. విశేషించి మనుష్యులకుఁ బితృ సమారాధనంబు సర్వశుభ సాధనంబు. 158
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )