పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకుఁ బితృపూజా విధానం బెఱింగించుట (సం. 13-87-3)
క. అమవస నమవసఁ బితృయ | జ్ఞము దగఁ బిండ ప్రదాన సహితముగా భ
క్తి మెయిం జేయు నతఁడు ని | త్యముఁ జేసిన వాఁడ యగు సమంచిత చరితా!
159
వ. పితృయజ్ఞంబునకుఁ దిథి విశేషంబు సెప్పెద. 160
సీ. పాడ్యమిఁ బితృయజ్ఞపరుఁడైనఁ జారుకాం | తాపతి; విదియఁ గాంతలకుఁ దండ్రి’
తదియను జవితిని దా వాజిధనికుండు | పశుభాగి పంచమి బహుసుతుండు,
షష్ఠి భానాత్ముండు, సప్తమిఁ గృషిభాగి, | యష్టమి వాణిజ్య పుష్టుఁడు, వసు
గజ ధర్మవిష్ణు చిత్తజ తిథులం | దేకశత జంతువులను గోచయముఁ గుప్య
 
తే. ములును దగ బ్రహ్మ వర్చస్వి పుత్రకులును | ధనము గలవాఁడు విను చతుర్దశి రణైక
భాగి పున్నమ నమవస భవ్య సర్వ | కామ్య ఫలభాగి యగుఁ జువ్వె కౌరవేంద్ర!
161
క. అపరంబగు పక్షంబును | నపరాహ్ణము మేలు పితృసమర్చనమున కా
ద్యపుఁ దిథి దశమి చతుర్దశి | నృపవర! యప్పక్షమునను నింద్యతఁ బొరయున్‌.’
162
క. అనిన విని ధర్మసూనుం | ‘డనఘా! యెద్దానఁ బితృసమర్చన మొనరిం
చిన నధిక ఫలంబగు న | వ్వినుత ద్రవ్యములఁ జెప్పవే తెలియంగన్‌.’
163
వ. అనుటయు దేవవ్రతుం డతని కిట్లనియె. 164
క. ‘తిలపాయస ఘృతములు పితృ | కలనములకు నుత్తమములు; గవ్యంబు మహా
ఫల; మెదియైనన్‌ మత్స్యం | బులు మాంసము విహితవిధిఁ బ్రభూత ఫలంబుల్‌.
165
తే. గొఱియనంజుడు ఖడ్గంబు నెఱచి గండ | మృగమునందలి పలలంబు మేఁకమాంస
మొక్కఁడొకటికి ఫలమున నెక్కు డండ్రు | పితృ సమర్చన విదులైన పెద్ద లధిప!
166
వ. నక్షత్ర విశేషం బాకర్ణింపుము. 167
సీ. కార్తెఁ బైతృక మగు కర్మ మొనర్ప ని | శ్శత్రుత, రోహిణిఁ, బుత్ర లబ్ధి,
శశితారకమున నోజః ప్రాప్తి యార్ధ్రఁ గ్రూ | రపు వర్తనము, పునర్వసువు నందుఁ
గృషి ఫలోదయ, మనిమిష గురుతార సు | పుష్టి, యాశ్లేష నుత్కృష్ట వీర
తనుజ లాభము, మఖం దనకులమున పెంపు, | పుబ్బ సౌభాగ్య విస్ఫూర్తి సిద్ధి,
 
తే. యర్యమునితారఁ బెక్కపత్యములు పుట్టు, | హస్తమునఁ గర్మసఫలత, యవులతార
సుందరాకార యుతులగు సుతులఁ గనుట, | యనిలతార వాణిజ్య వర్ధనము గలుగు.
168
సీ. వినుము విశాఖ సత్తనయ బహుత్వ మ | నూరాధ రాజాధికార, మైంద్ర
మునఁ బ్రభుత్వము పెంపు; మూలఁ బూర్వాషాఢ | నారోగ్యమును నుత్తమాతిశయము,
నుత్తరాషాఢ శోకోదయ రహితత్వ, | మభిజిత్తునందు విద్యాభియుక్తి,
శ్రవణ కాలమునఁ బరమ గతి సిద్ధి, ధ | నిష్ఠ రాజ్యము, జలనిధిపతార
 
తే. మొదలుగాఁ దారకంబులు మూఁట నఖిల | కార్యఫలములు, సదజావికములు గోవు,
లవుల మూఁటను గుప్య వృద్ధ్యశ్వకాయు | వులు శుచి శ్రాద్ధకర్తకుఁ గలుగు నధిప!’
169
వ. అనిన నప్పుడమిఱేఁ డప్పురుషవరునిం ‘బితృ పూజనంబులకుఁ బాత్రంబు లెట్టివి గావలయు?’ నని యడిగిన నయ్యమరనదీనందనుం డిట్లనియె. 170
క. దైవిక కృత్యంబులకును | భూవర! భూసురుల సూక్ష్మముగ శోధింపం
గా వలదు గాని పితృ పూ | జావిధికిఁ బరీక్ష వలయు సమ్యగ్భంగిన్‌.
171
వ. కావున నీ వడిగి మేలు చేసి తాకర్ణింపుము. 172
తే. కులవయో రూపశీల విద్యల నుదాత్తు | లనఁగఁ దగువారు పంక్తి పావనులు తద్గు
ణమ్ము లారయ లేని జనములు పంక్తి | దూషకులు పైతృకమునకు దోషదూర!
173
వ. మఱియును బంక్తి దూషకులం జెప్పెద నాకర్ణింపుము. 174
సీ. జూదరి గరదుండు వేదంబు సదువని | వాఁడు వడ్డికి నిచ్చువాఁడు గాయ
కుండు గ్రామము పనిఁ గుడుచునాతఁడు గృహ | దాహి కుష్ఠము గల తనువు నాతఁ
డఱుఁ దెవుల్‌ గొన్నాతఁ డఖిల వస్తువులును | నమ్మెడు నతఁడు సోమమ్ము విక్ర
యించిన యతఁ డబ్ధి సంచార లాభోప | జీవకుం డుర్వీశ సేవకుండు
 
తే. భార్యయును దాను బుత్రులఁ బంచికొన్న | వాఁడు పసులఁ బెక్కేలెడువాఁడు కపట
కృత్యముల మ్రుచ్చిమిని శిల్పకృతుల బ్రదుకు | వారు పంక్తిదూషకు లండ్రు పౌరవేంద్ర!’
175
వ. అని చెప్పి వెండియు. 176
క. ‘తలఁ జీరసుట్టియును జె | ప్పులు దొడిగియుఁ జేసినట్టి భోజనము ఫలం
బలఘుచరిత! పద్మజుఁ డసు | రల భాగం బని విధించెఁ బ్రకటఫణితులన్‌.
177
తే. పలుదెఱంగుల వంటకంబులఁ బ్రమాద | జాతమై యశుచిత్వంబు సంభవించి
నప్పు డసురులు గొండ్రు క్రియా ఫలంబుఁ; | దిలలు పైఁ జల్ల నశుచిత దొలఁగు నండ్రు.
178
క. శాంతుఁడు సువ్రతశీలుఁడు | దాంతుం డధ్యాపకుండు దయగలవాఁ డ
త్యంత ప్రబోధ సంప | ద్వంతుఁడు పావనులు భూపవర! పంక్తులకున్‌.
179
క. వ్యాకరణ ధర్మశాస్త్ర వి | వేకములుఁ బురాణజాత వేదిత్వము బ్ర
హ్మైకత్వ బోధనము నధి | పా! కలిగినవారు పంక్తిపావనులు గడున్‌.
180
తే. మేలి గుణములు గనియు నమిత్రజనము | శ్రాద్ధ పాత్రంబుఁ జేయంగఁ జన దమిత్ర
దత్తమైనది భస్మహుతంబుఁ జౌట | నిడిన విత్తును బోలెనై చెడు నృపాల!
181
క. మును ముట్ట నెఱిఁగి శ్రాద్ధం | బునకుం గైకొనుట మేలు భూసురునిం గై
కొని యరసి కాఁ డనిన నా | తని యుమ్మలికంబు సెఱుచు ధార్మికు నైనన్‌.
182
క. ఈ తెఱఁగు లెల్ల నెఱిఁగి సు | నీతంబుగ శ్రాద్ధ మధిక నియతి నడపు ని
ర్ధూత దురితుండు నడచుఁ బ్రి | యాతిశయం బెసఁగ దేవయానమున నృపా!’
183
వ. అని చెప్పి శాంతనవుండు కౌంతేయాగ్రజునితో మఱియు నిట్లను ‘బ్రహ్మమానస పుత్త్రుండగు నత్రిమునీంద్రు వంశంబునకుం దొడవగు దత్తాత్రేయ నందనుండు నిమినామధేయుండగు సంయమి కొడుకు శ్రీమంతుండను పేరివాఁడు మృతుం డగుటయు. 184
క. నిమి యక్కుమారునకు శ్రా | ద్ధము సేయుచు నుండి భక్తిఁ దలఁచినఁ గృప న
త్రిమునీంద్రుఁడు వచ్చి క్రియా | సమీక్షణము సేసె మది నెసఁగు నర్మిలితోన్‌.
185
వ. అట్లు పావక క్రియా కలాపం బనుసంధించి యా సంయమివరుండు. 186
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )