పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
అత్రిమహాముని నిమి కెఱింగించిన శ్రాద్ధక్రియా విశేషము (సం. 13-91-3)
ఆ. ‘పరిగృహీతు లైన బ్రాహ్మణుల్‌ పంక్తి పా | వన వరిష్ఠు లగుట, వారి కిడిన
దర్భ విష్టరములు దక్షిణావర్తంబు | లగుటఁ గ్రియలు దిలసమగ్ర లగుట.
187
క. అమలినతర దర్భన్యా | సము లెందును దక్షిణంబు సాఁగ నిడిన య
గ్రములు గలిగి యుండుట మం | త్రము లయ్యై విధుల కంచితముగ నడచుటన్‌.
188
ఆ. మునగ యుల్లి యడవి మునగ దుర్మాంసము | లానుగమ్ము మలినమైన యుప్పు
కఱియ జీలకఱ్ఱ కఱివేము గురుజ యిం | గువ ప్రవర్జనీయ కోటి యగుట.
189
క. శునకంబు రజస్వల యగు | వనిత పతితుఁ డంత్యజాతి వాఁ డా క్రియ ప
ట్టున కెయిది తవులఁ జేరక | చనఁ జేయుట నుగ్గడించి సంభావించెన్‌.
190
క. కావున శ్రాద్ధక్రియలకు | భూ వల్లభ! యట్టి భంగి పూజ్యత నిచ్చుం
దా వినిపించెం బితృదే | వావలి నత్రి నిజవంశుఁ డగు నిమికిఁ దగన్‌.
191
వ. అత్తెఱం గెఱింగించెద నత్రి నిమితో నిట్లను శ్రాద్ధంబున నర్యమవరుణ సోమాగ్నులకు భాగంబులు బ్రహ్మ కల్పించె; విశ్వలగు దేవతలు పితృదేవతలతోఁ గూడం దత్క్రియోప యోగ్యతం దోఁతురు వారలకును భాగకల్పనం బొనరించె; దేవతలయందుఁ గొందఱ నూష్మపులయిన మహాభాగులం బితృత్వ నిర్దేశంబున నేర్పరించె; నవ్విరించి వివరించిన నామంబులు సెప్పెద వినుము; బలుండు ధృతి విపాప్ముండు పుణ్యకృత్తు పావనుండు పార్‌ష్ణిక్షేముండు సమూహుండు దివ్యసానువు వివస్వంతుండు వీర్యవంతుండు హ్రీమంతుండు కీర్తిమంతుండు, కృతుండు విద్యుద్వర్చసుండు సోమవర్చసుండు, సూర్యశ్రీ సోమపుండు సూర్యసావిత్రుండు దత్తాత్ముండు పుండరీయకుం డుష్ణినాభుండు నభోదుండు విశ్వాయువు దీప్తి చమూహరుండు సురేశుండు వ్యోమారి శంకరుండు భవుం డీశుండు కర్తకృతి దక్షుండు భువనుండు దివ్యకర్మకృత్తు గణితుండు పంచవీర్యుం డాదిత్యుండు రశ్మిమంతుండు సప్తకృత్తు సోమపూర్వుండు విశ్వకృత్తు కవి యనుగోప్త సుగోప్త నప్త యీశ్వరుండు జితాత్ముండు మునివీర్యుండు దీప్తరోముండు భయంకరుం డను కర్ముండు ప్రతీతుండు ప్రదాత యంశుమంతుండు శైలాభుండు పరమక్రోధి ధీరోష్ణి భూపతి స్రజుండు వజ్రి వరి వీరలు భాగార్హులని చెప్పి వెండియు. 192
క. గిరివన దుర్గము లందును | సరి దుత్తరణంబు నపుడు శ్రాద్ధ విధి సమా
చరణ సమయమున వీరిం | బరికీర్తించిన యతండు వడయు శుభంబుల్‌.
193
ఆ. పూరిపంట ప్రాలు నారుగబియ్యంబు | జంబువున ఫలంబు శ్రాద్ధ కృతికిఁ
గావు తుమ్మ నేడ్వఁగాదు శ్రాద్ధ క్రియా | చరణ సమయములఁ బ్రశాంతివలయు.’
194
వ. అనియునుం జెప్పె నని చెప్పి, సరిత్సూనుండు ధర్మజుతో మఱియు నిట్లనియె. 195
సీ. ‘ఒకతఱి మునివర్యు లొక్కటఁ బెక్కండ్రు | శ్రాద్ధముల్‌ సేయ భోజ్యములు పెక్కు
లనుభవించుటఁ దమ కఱుగమి పుట్టుట | యును, బితృదేవతల్‌ సనిరి సోము
కడ, కట్లు సని తమ కాఱియ సెప్పిన | నతఁడు ‘పద్మజుపాలి కరుగుఁ’ డనియె;
వా రట్ల కా కని బోరన నరిగి ప | ద్మజునిఁ గాంచి యజీర్ణ దశ యెఱుంగ
 
తే. విన్నవించినఁ, దనయొద్ద వెలుఁగుచున్న | యగ్నిఁ జూపి ‘యిక్కీ డితం డపహరించు’
ననిన నగ్ని ‘మత్సహితులై కొనిన నఱుగఁ | జేయువాఁడ నాహారముల్‌ సిద్ధ మదియు.
196
క. అని పలికినఁ బితృదేవత | లనలుఁడు ముఖ్యుఁడుగ నెపుడు నాహారంబుల్‌
గొని సుఖ జీర్ణానందం | బు నొందుదురు సూవె భరతభూపవరేణ్యా!
197
క. కావున సాగ్నికుఁడయి తగ | నే వాఁడొనరించు శ్రాద్ధ మీడ్యం బది; సం
భావింతురు పెద్దయుఁ బితృ | దేవత లసురులకు రాదు తేఱియుఁ జూడన్‌.
198
ఆ. అనఘ! పితృపితామహ ప్రపితామహ | పూజనములు శిష్ట పూర్వకముగఁ
జేయవలయు నియతి దాయ దొడ్గిన జన్ని | దంబుతోడ భక్తిధామ మగుచు.
199
తే. పిండ సంబంధమునఁ బాయుఁ బ్రేతభావ | మది సుగతి నిచ్చు; గయఁ బిండ మట్లు గాన
నరుగునో గయ కొకఁ డైన నని కదా య | నేక పుత్త్రులఁ గోరుదు రిద్ధచరిత!
200
క. గౌరి యగు కన్య వరదా | నా రూఢం జేఁత; నీలమైన వృషభమున్‌
గారవమున విడుపు ముదం | బారంగాఁ జేయుఁ బితృచయము చిత్తములన్‌.
201
క. శ్రాద్ధంబు ప్రకారంబును | వృద్ధా చార్యోక్తభంగి వివరించితి; నీ
బుద్ధిం దోఁచినదాని స | మిద్ధ గుణోదార! యడుగు మెయ్యది యైనన్‌.’
202
క. అని నిర్జరాపగానం | దనుండు పలుకుటయుఁ, బ్రియము దళుకొత్తఁగఁ బాం
డు నృపాలు నగ్రనందనుఁ | డనూన వినయమున నమ్మహామతి తోడన్‌.
203
క. ‘తప మని యార్యులు సెప్పుదు | రుపవాసవ్రతము; నదియె; యొండు గలదొ సా
రపుఁ దపము తెఱఁగు నాకుం | గృప నెఱిఁగింపుము విధూతకిల్బిష!’ యనుడున్‌.
204
క. అమ్మహాత్ముఁ డిట్టు లనుఁ ‘బెక్కు దివసంబు | లుపవసించి యునికి తపము చొప్పె
దాన విను తపస్వి గానేరఁ డది యాత్మ | ఘాత మగుట నరుఁడు గౌరవేంద్ర!
205
క. సత్యంబు బ్రహ్మచర్యము | నిత్యశుచిత మౌన మతుల నియమము దయ శు
ద్ధ త్యాగంబుఁ దపస్సం | పత్త్యాకృతు లండ్రు బుధులు పౌరవముఖ్యా!’
206
వ. అనిన విని కురుపతి కురుపితామహునితో ‘మహాత్మా! దానశీలుని యప్రతిగ్రాహకుని విశేషం బెట్టిది? యెఱింగింపు’ మనవుడు నా దేవవ్రతుం ‘డీ విషయంబునకు సప్తర్షి వృషాదర్భి సంవాదం బను నితిహాసంబు గల’ దని చెప్పి యమ్మనుజపతి కిట్లనియె. 207
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )