పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
సప్తర్షి వృషాదర్భి సంవాదం బను నితిహాసంబు ప్రకారము (సం. 13-94-4)
తే. ‘కశ్యపాత్రి విశ్వామిత్ర గౌతములును | విను భరద్వాజ జమదగ్నులును వసిష్ఠుఁ
డును జగంబుల నెల్లఁ బేర్కొనిన ఋషులు | వారి సప్తర్షిగణ మండ్రు కౌరవేంద్ర!
208
వ. వసిష్ఠుని దేవి యగు నరుంధతి యెందును నతనితోడన తిరుగు; నయ్యందఱకుం బరిచారికయై గండ యను చేడియ వర్తించుఁ; దద్వల్లభుండగు పశుసఖుండును వారలకుం బరిచారకత్వం బాచరించు; నప్పదుండ్రును దపశ్చరణ పరులై ధరణిం జరించుచుండ నత్యంతఘోర యగు ననావృష్టి దోఁచి జీవసాధనంబు లగు పదార్థంబులు దుర్లభంబులై జనంబులకుఁ బ్రాణంబులు రక్షించుకొనుట దుష్కరంబై చెల్లెం; గశ్యపాదులు నతి క్షుధార్తులై యాహారం బన్వేషించు నెడ శిబిసూనుం డైన యాజ్య నామధేయుండు తొల్లి యజ్ఞదక్షిణార్థం బుగాఁ దన కొడుకు నీలుండను వాని ఋత్విగ్జనంబుల కిచ్చినం దద్వశగతి నుండి కాలం బగుటయు మృతి నొందినం దదీయ శవంబు. 209
క. సొదపై నుండఁగ వారలు | పదుండ్రునుం జూచి దాని భక్షింపంగా
మదిఁ గోరి చేరి చుట్టుం | బొదివిన సమయమునఁ గాటి పొంత తెరువునన్‌.
210
తే. వేఁట వోయి మరలి విభుఁ డొక్కరుఁడు వృషా | దర్భినాముఁ డతుల దానపరుఁడు
పోయి పోయి కాంచి, పోవక నిలిచి, య | మ్మునులతోడ నధిక వినయ మెసఁగ.
211
క. ‘మీ రాఁకలి పెల్లున నా | హారంబుగ శవముఁ గొనుట కడరితి; రిట్లే
లా? రం డిచ్చెద మీ కా | హారంబులు వలసినట్టి’ వని తా మఱియున్‌.
212
క. బహువిధముల ధాన్యములును | బహు రసవర్గములు మీకు భక్తి నొసఁగెదన్‌
బహుతురగ శకట గోగణ | బహుళ బహుగ్రామములును బహుమతి నిత్తున్‌.’
213
వ. అనిన వార లతని కిట్లనిరి. 214
తే. ‘రాజవర! రాజుదెసఁ బ్రతిగ్రహము విషముఁ | గల్లుఁగాఁ జూతు మిట్టులు గాంచి యున్న
యట్టి మాకు నీవిచ్చెదనుట మా వి | ధం బెఱుంగమి యింతియ; తప్పు గాదు.’
215
క. అనుడు విషాదము తోడం | జని కృత్రిమ వన ఫలములు సమకట్టి తగన్‌
జనపతి మంత్రుల ఋషులకుఁ | గొనిపాండని పంప వా రంకుఠిత భక్తిన్‌.
216
వ. వానిం దెచ్చి యమ్మహాత్ములకు సమర్పించిన. 217
ఆ. వారు పట్టి చూచి వానివ్రేఁగున హేమ | గర్భకంబు లగుట గాంచి నవ్వి
పుచ్చుకొనక యున్నఁ బోయి భూపతికి న | త్తెఱఁ గమాత్యకోటి యెఱుఁగఁ జెప్పె.
218
క. విని యతఁడు రాజసంబున | గనలు వొడమి కృత్తి వేల్వఁగాఁ దగువారిం
బనిచిన నప్పుడు హోమం | బున రాక్షసి యోర్తు పుట్టె భూపవరేణ్యా!
219
వ. పుట్టియప్పుడమిఱేని ముందట నిలిచి ‘పనియేమి పనుపు’ మనిన నతండు ప్రీతుండై ‘కశ్యపాదులం గనుపుగొట్టు’ మని పనిచిన, నది వార లున్నెడ రోసిపోయె, నంతకు మున్న వారు వనంబున మూలంబులు ఫలంబులు వెదకి తిరుగుచుండ శునస్సఖుండను పరివ్రాజకుండు వచ్చి వారిం గని వందనంబు సేసిన వారలభినందించి; రతండు నమ్మునులం గలిసి యేకార్థుండై సంచరించె; నట్లు చరించు నమ్మహాత్ము లతిక్షుధాన్వితులై తామరతూండ్లు పుచ్చికొని నమలుటకై యొక్క నలినాకరంబునకు సత్వరగతి నరుగుచు నున్న నా రక్కసి యక్కొలని కడ్డంబుగాఁ బోయి పొడసూపి నిలిచిన. 220
క. ఈ కమలవనము చేరువ | నే కార్యము సేయఁ జూచె? దీ వెవ్వత?’ వం
చా కొలను సొరఁగ నమ్ముని | లోకము సేరుటయు నచ్చెలువ యెలుఁ గెసఁగన్‌.
221
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )