పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
వృషాదర్భి పుత్తెంచిన కృత్తి శునస్సఖునిచే మృతిఁ బొందుట (సం. 13-95-48)
వ. ‘ ఏ నెవ్వత నైతి నేమి? యిక్కొలని కావలియున్న దాన’ ననుటయు నమ్మునులు వెల్లనై’ యాఁకట నలందురి యుపజీవింప నొండేమియు లేమింజేసి యీ సరోవరంబున బిసంబులు వెఱికికొని భక్షించు వారమై వచ్చితి’ మనిన నవ్వనిత ‘మీ మీ పేళ్ళు సెప్పిమఱి పద్మవనంబు ప్రవేశించువా’ రని పలికిన నప్పరమమును లన్నాతి యాతుధాని యగుటయుం గృత్తియగుటయు వధింప వచ్చినది యగుటయు నెఱింగి కశ్యపాదులగు పదుండ్రును దానికి దుర్బోధత్వంబు దోఁచునట్లుగా నిర్వచన సహితంబుగాఁ దమనామంబులు సెప్పి; రప్పాపవర్తన వెఱఁగు పడియుండ శునస్సఖుండు దన యభిధానం బభివ్యక్తంబుగా నుగ్గడించినం గృత్తి ‘నీ పేరు దెలియం జెప్ప విదియేమి?’ యనవుడు నతండు ‘తేటపడం జెప్పియుండం జెప్పవనియెద; విట్లంట తప్పుగాదె? యిట్టి యుద్దండవు మంత్ర దండంబు పాలు వడు’ మని బ్రహ్మదండ నిభంబగు నిజహస్తగత దండంబున దాని శిరంబు బెట్టు వ్రేయుచుఁ ‘బాపకర్మురాలా! పడు ము భస్మంబ వగు మని నిష్ఠురాక్షరంబుగా నిర్దేశించిన దుర్దశ యగుచుంబడి యా రక్కసి భస్మీభూతయయ్యె; నప్పు డప్పదునొకండ్రునుం బ్రమోదంబునం బయోజషండంబు సొచ్చి. 222
తే. బిసము లాదట నందఱుఁ బెఱికి రొంపి | వోవ నీటఁ దెమల్చి మోపుగ నమర్చి
తీరమునఁ బెట్టి నియమముల్‌ దీర్పఁజొచ్చి | తీర్చి యాఁకలి దముఁ గోసి తినఁగఁ గూడి.
223
క. కొలను వెడలి బిసము లిడిన | నెలవునకుం బోయి యచట నిగిడించిన చూ
డ్కుల కవి దోఁపక యున్నను | గలయం బరికించి యెట్లుఁ గానక తమలోన్‌.
224
వ. ఒండొరుల శంకించి శపథంబులు పలుకుదుము గాక యని నిశ్చయించి శునస్సఖుని వినువానింగాఁ జేసికొని; రప్పు డత్రి యిట్లనియె. 225
తే. ‘మొదవుఁ దన్నుట, రవియభిముఖత దనకుఁ | గలుగు మూత్ర పురీష మోక్షణము సేఁత,
యధ్యయన మనధ్యయనమునందు నడపు | టగు బిసంబులు మ్రుచ్చిలి నట్టు లైన.’
226
వ. అనుటయు వసిష్ఠుండు. 227
క. శ్రుతి సదువమి; సన్న్యాస | స్థితిఁ గాముకుఁ డగుట; గుక్కఁ జేకొని తిరుగన్‌
మతి రోయమి నయ్యెడు దు | ర్గతి తూఁడులు మ్రుచ్చిలించు కష్టునకు నగున్‌.’
228
వ. అని వెండియు. 229
క. ‘సుత నమ్మికొనుట, శరణా | గతుఁ జేకొనకునికి నిచ్చు కారుణికు దరి
ద్రతఁ జూచియు వేఁడుట నగు | గతి బిసములు దాఁచికొనుట గల్గినఁ గల్గున్‌.’
230
వ. అనియెఁ; దదనంతరంబ. 231
చ. ‘పలలవృథోపభుక్తి, సభఁ బక్షముఁ బల్కుట, దుష్టదాన, ము
గ్మలి దివసంబునం గవయు కష్టత, విప్రజనంబు లుబ్ధతా
కులితముఁ జేఁత, యెల్లసరకుం గొని యమ్ముట కాదె తూఁడు తీఁ
గలపొది మ్రుచ్చిలించు’ టని కశ్యపసంయమి వల్కె భూవరా!
232
వ. పదంపడి. 233
క. జ్ఞాతులయెడ గోవులయెడ | గోతులయెడ ధర్మ మెడలి క్రూరుఁ డగుట కా
ర్యాతుర విప్రోపేక్షా | నీతి బిసము లపహరించు నిపుణత యరయన్‌.
234
క. అని పలికి భరద్వాజుం | డను మఱియు ‘హవిస్సు గ్రంప నగ్ని నిడుట, యొ
జ్జ నధఃకరించి చదువుట | యను నివి సరియౌ బిసాపహరణంబునకున్‌.’
235
వ. అని పలుకుటయు. 236
తే. “ముట్టునను భార్యఁ గవయుట, మూత్రమును బు | రీషమును నీర విడుపు, విద్వేషయుక్తి
యోషి దుపజీవనము మృణాళోత్కరంబు | మ్రుచ్చిలుటఁ బోలు కల్మషములె తలంప.’
237
క. అని జమదగ్ని మఱియు ని | ట్లను ‘నన్యోన్యాతిధిత్వ మసహాయపువై
రనిరూఢి, పాఁడి మొదవుం | గనలి యడుచు టీడె బిసనికర చోరతకున్‌.
238
వ. అనవుడు గౌతముండు. 239
క. ‘ధృతవేద త్యజనానల | వితతి వృథాత్యాగ సోమ విక్రయ వృషలీ
పతితా దుర్గ్రామాజీ | వితలు బిసస్తేయ కష్టవృత్తికి నెనయే?
240
వ. అని నిర్దేశించిన విశ్వామిత్రుం డిట్లనియె. 241
క. ‘తగు భృత్యులఁ బ్రోవకునికి | దగని భటులఁ బ్రోపు కపటధార్మికవృత్తిన్‌
జగతీపతిఁ గొల్చుట లె | స్సగఁ బోలఁగ నేర్చునే బిసస్తైన్యంబున్‌?’
242
వ. నావుడు నరుంధతి యల్ల నవ్వుచు. 243
క. ‘సతతంబు నత్త దూఱుటఁ, బతియెడ దుశ్చిత్త యగుటఁ, బరమాన్నము నొ
క్కత సేవించుట నగు దు | ర్గతి బిసములు డాఁచికొన్న కష్టకుఁ గలుగున్‌.’
244
సీ. అనుడు ‘వంటకము సేసిన యింతి తా మున్ను | గుడుచుట, పనియెడఁ గుటిల యగుట,
బొంకులు పలుకుట, పుత్త్రిక వెలగొని | యిచ్చుట, సుజనుల కెగ్గు సేఁత,
యెట్టి దుర్గతిఁ దెచ్చు నట్టిద కల్గు బి | సావలి మ్రుచ్చిలి నట్టులైన;
నిట్లు గాకయుఁ బుట్టువెల్ల దాస్యంబు నీఁ | గకపోవు నక్కీడు గల నికృష్ట’
 
తే. యనియె గండ; ‘యసంతానుఁ డగుట, గర్భ దాసుఁ డగుట దరిద్రత్వ తప్తుఁ డగుట
చెందుఁ దూఁడులకట్ట మ్రుచ్చిలిన కష్ట | నరుని’ కని పల్కెఁ బశుసఖనాముఁ డధిప!
245
వ. అని యిట్లందఱుం దన కభిముఖులై పలికిరి; వారితో శునస్సఖుం డిట్లనియె. 246
క. ‘ఛందోజ్ఞున కైనను, దన | నందన నధ్వర ధురీణునకు నైనను నా
నందముగ నిచ్చుటం బో | లుం దూఁడులకట్ట మ్రుచ్చిలుట దలపోయన్‌.’
247
తే. అనిన నయ్యందఱును ‘బుణ్యమైన కర్మ | మనఘ! శపథంబునకు విషయముగ నీవు
పలికి; తటుగాన బిసలతా ప్రతతి సపహ | రించినాఁడవు; మమ్ముఁ గారింప కిమ్ము.
248
సీ. అనిన ‘నిక్కం బిది యందఱు నొండొరు | నేమనియెదరొ? వీ రీబిసముల
పొది యేను దాఁచి చూచెద నని దాఁచితి; | నిదె కొనుఁ’ డని దాని నిచ్చి, మీకు
నలిగి వధించుటకై హోమవహ్నిఁ బు | ట్టించి వృషాదర్భి పంచెఁ గృత్తి;
నది మున్న కాంచి రక్షార్థినై వచ్చి యా | రక్కసిఁ జంపితి; నిక్కమునకు
 
ఆ. వాసవుండ; లోభవర్జనముఖ భవ | త్స ద్గుణములఁ జేసి శాశ్వతంపు
నెలవు గలిగె; రండు నెగయుండు పుణ్యలో | కముల’ కని సమాదరమునఁ బలికె.
249
వ. అట్లు పలుకుటయు. 250
చ. అనయముఁ బ్రీతిఁబొంది మును ‘లట్టుల చేసెద మంచు నింద్రు ప
జ్జన తగ నేఁగి దేవపరిషత్పరిపూజ్యపదస్థులై వెలిం
గి నిఖిలలోక నిత్యపరికీర్తితమూర్తుల నొప్పి; రింతయు
న్విను మపరిగ్రహంబు మహనీయత నైనది సూవె భూవరా!
251
క. కావున లోభము విడుచుట | కేవియు సరిగావు గుణము; లీగుణము మహీ
దేవునకు వలయుఁ బెద్దయు | నీ విధమున కమరసంఘ మెంతయు మెచ్చున్‌.’
252
వ. అని చెప్పి భీష్ముండు వెండియు. 253
ఉ. ‘ఈ యితిహాస మార్యసభ నెవ్వఁడు సమ్మతిఁ జెప్పువాఁడు దీ
ర్ఘాయువు శ్రీయు ధర్మము సమంచితకీర్తియు వృద్ధిఁ బొంద సౌ
ఖ్యాయతనాత్ముఁడై మను; సురావలియుం బితృకోటియుం బ్రియ
శ్రీ యలరారఁ గీ డతనిఁ జెందక యుండఁగఁ జేయు నెయ్యెడన్‌.’
254
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )