| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము |
| వ. | అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్రుతోఁ బితృ కార్యాదులయందు గొడుగులుఁ జెప్పులు నిడుట యుత్తమ ప్రకారం బని చెప్పుదురు; వాని విశేషంబు తెఱం గెఱింగింపవే!’ యనుటయు నమ్మహాత్ముం డమ్మహీపతి కిట్లను; ‘సూర్యజమదగ్ని సంవాదంబను నితిహాసంబు వినుము; దాన నీయడిగినయది తేటపడు, జమదగ్ని మహాముని క్రీడార్థియై శరాసనంబు ధరించి రేణుకాదేవి బాణంబులకట్టఁ గొని తనతోడం జనుదేర నివాసంబు వెడలి యొక్కబయల నయ్యంపపొది నిలువ వైపించికొని దూరాపాతనం బాచరింప నిక్కుసుమకోమలి సని యమ్ము లేఱికొని వచ్చి యిచ్చుచుండు. | 255 |
| తే. |
ఇవ్విధమున వినోదింప నినుఁడు గగన | మధ్యగతుఁ డయ్యె నప్పు డమ్మగువ యమ్ము లేఱి తేరంగఁబోయి యొక్కింత దడసి | యరుగుదెంచిన నాతఁ డయ్యబలతోడ. |
256 |
| క. |
‘లోలాక్షి! యచట నిమ్మరి | యేల తడసి?’ తనుడుఁ బేర్చు నినతేజమునన్ నేలకు వేఁడిమి దనికినఁ | జాలన వెసఁ ద్రొక్కఁ దలయుఁజాలఁ దపించెన్. |
257 |
| క. |
ఇమ్మెయి నలంగి యొక వృ | క్షమ్మున క్రీనీడ నిలిచి చనుదెంచుట నా కిమ్మరి దడయ వలసె’ నని | యమ్ముద్దియ సెప్పెఁ జెమట యడరఁగ మేనన్. |
258 |
| క. |
విని ‘యే మేమీ! నొంచెనె | యినుఁడు నినుం; దత్ఫలంబు నిప్పుడ కుడువం గనియెడుఁ గా కస్త్రానల | మునఁ బొదివెద నతని’ ననియె ముని కోపమునన్. |
259 |
| ఉ. |
దాని నెఱింగి భూసురతఁ దాల్చి వెసం జనుదెంచి యర్కుఁ డ మ్మానిత సంయమిం గని యమత్సరభావము దోఁప ‘రోషమున్ మానుము’ నావుడుం ‘బలుకు మానుము; నీవటు వాయు; మేసెదన్ భానుని నేలఁ గూల’ నని పల్కె మునీంద్రుఁడు శోణితాక్షుఁడై. |
260 |
| చ. |
పలికిన బ్రాహ్మణుం డొదుగఁబాఱక నిల్చి ‘మునీంద్ర! యిట్టు లి ట్టల మగు క్రూరవృత్తికిఁ గడంగుదురే? సవితృండు రశ్ములన్ జల మొసఁగంగ నోషధుల సంపద హవ్యమహత్త్వ మొంది వే ల్పులకు బలంబు నిచ్చునది లుప్తము గాదె యతండు నొచ్చినన్.’ |
261 |
| చ. |
అనినను శాంతిలేమికి భయం బెదఁ గూరఁగ మ్రొక్కి యాతఁ ‘డే నినుఁడ సహింపు నావలన నెగ్గులు గల్గినయేని; నీకు నె మ్మనము దయామయం బని సమస్త జగంబులు సంస్తుతింపఁగా విని ముదమందుదున్; శరణు వేఁడెదఁ గావుము న న్మునీశ్వరా!’ |
262 |
| చ. |
అనినఁ బ్రశాంతుఁడై తపను నా భృగుముఖ్యుఁడు ప్రీతి గారవిం చినఁ బ్రమదంబునన్ గొడుగుఁ జెప్పులు మానసవృత్తిఁ దెచ్చి య మ్ముని కడఁ బెట్టి, యత్తరణి ము న్నివి లేవని పల్కి దీన మైఁ దనుకదు, వీనఁ బాదములఁ దాఁకదు నాదగు వేఁడి యేమియున్. |
263 |
| మ. |
నయ మిట్లారఁగ నాతపత్రము నుపానద్ద్వంద్వముం జూపి చె ప్పి యపూర్వంబగు సృష్టిఖేలనమునం బెంపారు నవ్వస్తువుల్ దయ సద్విప్రున కీగి యైహిక సుఖౌదాత్త్వంబు నాముష్మిక ప్రియమున్ దాతకు సుస్థిరంబులుగఁ గల్పించున్ మునీంద్రోత్తమా! |
264 |
| మ. |
అనినన్ మో మలరన్ దినేశ్వరునిఁ దా నామంత్రితుంజేసి య మ్మునిశార్దూలుఁడు వల్లభాసహితుఁడై మోదంబునం దేలుచుం జనియెన్ నాఁడు జనంబు లెల్లను బ్రహర్షం బందుచున్ వానిఁ గై కొని రవ్వస్తువు లిట్టి వేర్పడఁగ నీకుం జెప్పితిన్ భూవరా! |
265 |
| చ. |
దినకరచిత్తసృష్టములు దివ్యమునీశ్వరులాలితంబు లీ వినుత పదార్థముల్ గరుణ విప్రునకున్ యతి సాధువృద్ధ స జ్జనులకు నిమ్ము నీ; వది సుసారపు ధర్మము సూవె! దానఁ గ ల్గును విను! గోకులాకలితలోకము లోనగు పుణ్యలోకముల్. |
266 |
| క. |
దాన ప్రవణ! యుపాన | ద్దానంబును నాతపత్ర దానము సురస మ్మాననభాజనములగుట | నానాబుధజనులచే వినంబడు నెపుడున్. |
267 |
| క. |
అనిన విని పాండుభూవర తనయోత్తముఁ డిట్టు లనియెఁ దాతకు శూద్రుం డనఘా! యెమ్మెయిచరితం | బున నిహపర పరమసౌఖ్యములఁ జెందఁగనున్? |
268 |
| వ. | అనుటయు నతం డతని కిట్లనియె. | 269 |