పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
సర్వవర్ణ సామాన్యధర్మ నిరూపణ ప్రకారము (సం. 13-152-1 (కుంభ))
వ. అని చెప్పి సర్వజాతి సామాన్యంబులగు ధర్మంబు లెఱింగించు నాదరంబున నమ్మునివరుం డిట్లనియె. 296
సీ. పరధనంబుల కాసపడక యొడ్లను | దనయట్ల కాఁజూచుచు నఖిల వస్తు
వులుఁ దోఁచు నడఁగు వీచుల చందమున మెఱుం | గులభంగి నని కనుఁగొనుచు నెందు
నాసక్తిలేక భూతాలిపై దయ కల్గి | నడచుట హితము తోనడచుఁ జేసి
నది మేల చేయుట చదురు కీ డవశతఁ | దొడరఁ బ్రాయశ్చిత్త దోహలమున
 
తే. వేగ తొలఁగించు టొప్పెడు వెరవ యెమ్ము | లేని జంతువుఁ జంపి త్రిస్నానములను
ద్వాదశ ప్రాణసంయమ నాదరమున | నొక్క యుపవాసమునఁ బాపయుక్తి వాయు.
297
ఆ. అస్థి కలిగి హీనమగుజంతు వైనఁ ద | ద్ద్విగుణవృత్తి వలయుఁ బ్రగుణజంతు
వునకు నలుమడించుకొనునది నరమాత్ర | హింస యష్టగుణ కృతీహఁ బాయు.
298
క. హీననరునట్ల గుఱ్ఱము | నేనుఁగును మనుష్యవధ మనేకాబ్దికభి
క్షానిరతి ప్రభృతి సుక | ర్మానుష్ఠానములఁ గాని యఱుగ దలఁతులన్‌.
299
తే. కల్లు ద్రావుట గురుతల్పగమన మధిక | పాతకము లివి ప్రాణముల్‌ వాయఁబెట్టి
చేయు ప్రతికారములఁ గాని చెడవు గోధ | రాద్యధిక దానములనైన నఱుగ వండ్రు.
300
క. ఇవి యెఱిఁగి యెపుడు పరలో | కవిభీతి మనంబునందుఁ గల్గి సకలభూ
తవిషయదయ నూనిన య | ట్టి వాఁడు కీడెల్లఁ బోనడిచి మేలొందున్‌.
301
క. ఈ నెఱిఁ గైకొని శూద్రుం | డైనను గ్రమవృత్తి నవ్యయంబగు పదముం
గానం బడయుట గల్గును | వానికి నియమముల త్రోవ వలవక యునికిన్‌.
302
వ. అని నిర్దేశించి యరిష్టంబు లెఱిఁగింప ననుకంప పుట్టుటయు. 303
సీ. పురుషు హిరణ్మయు నరుఁడెవ్వఁ డుత్తర | మునఁ గాంచు దక్షిణముఖత నుండ
నతనికి వర్షత్రయమున మృత్యువు వచ్చు; | రవి మండలంబు నిష్ప్రభము గాఁగఁ
గనిన రెండేఁడులఁ; గౌముదిఁ దననీడఁ | దూఁటు చూచిన నొక్క యేఁట; నది వి
మౌళియై యున్న షణ్మాసమాత్రంబునఁ; | గర్ణముల్‌ గరములఁ గదియ మూసి
 
ఆ. కొనిన యపుడు మ్రోఁత వినకున్న నెలనాళ్ళఁ; | గర్ణములును నాసికయును బట్టు
కదల వికృత వర్ణకత పండ్లఁ గన్నులఁ | గలుగ నాఁడ మరణ మొలయునండ్రు.
304
వ. అట్లు వర్తిల్లు నరిష్టంబులం దెయ్యవి దోఁచినం గలంకం బొరయని యంతరంగంబుతోడఁ దృష్ణాకలితంబైన సంసారంబునందలి వ్యాసంగంబు వదలి హృదయం బేకాగ్రంబు గావించి మునీంద్ర నిర్దిష్ట నిర్మలధ్యాన కర్మం బులం దగిలి యుండె నేనిం గాలాంతకప్రసాదంబు పడయుం దెలివికొఱంతం గాలగోచరత్వంబు నొంది వైశ్య రాజన్య విప్రకులంబులం దత్తద్విధ సంపత్సమృద్ధంబులుఁ బ్రబుద్ధంబులు నగు వంశంబులం గ్రమంబున జనించి. 305
క. అయ్యై కర్మంబుల దెస | నెయ్యం బెసలారఁ గలిగి నియమ నిరూఢుం
డియ్యన యన సుకృతంబుల | నయ్యెడు సౌఖ్యంబు నిహమునందుఁ బరమునన్‌.
306
తే. అనుభవించుచు గమనంబు నాగమనము | నాచరించుచు బ్రహ్మసభాంతమైన
పుణ్యలోక నికాయంబుఁ బొంది యెల్ల | నెఱిఁగి యూహించి యిట్లని యెడఁ దలంచు.
307
క. ‘ఇవి యెల్ల నశాశ్వతములు | భవమరణాకలితములును; బటుసంసారో
ద్భవదుఃఖయుక్తములు; సుఖ | లవయుతములు వీని యందు లౌల్యంబేలా?’
308
వ. అని తలంచి యపునర్భవకారియు ననధికంబును నచలంబును నగు ధర్మంబు కోరుచుండు నకృతకర్మఫలంబు నొందను గృతకర్మ ఫలంబు తొఱంగను నెవ్వరికి వశంబు కామి ధ్రువం బగుటం జేసి కృతకర్మవిశేషంబున నతండు వాసవాది వరిష్ఠసహవాసంబున వర్తించి. 309
తే. పుణ్యఫలకాలమున యంతమున నితాంత | సంప్రబుద్ధ జనంబు వంశమునఁ బుట్టి
బ్రహ్మసంస్కారముల నెల్లఁ బడసి యతిథి | దేవ పితృకోటులకుఁ బరితృప్తి చేసి.
310
తే. భార్య పుత్రు లాదిగఁ గల పాశసంచ | యంబు నిరసించి యతిధర్మ మాచరించి
యిలు వెడలి గురుశుశ్రూష నలఘు సాంఖ్య | యోగ శాస్త్ర రహస్యైకయోగ మొంది.
311
సీ. పుణ్యంబులైన యరణ్యంబులను శూన్య | గృహముల దేవతాగృహములందు
గుహలను నిలుచుచుఁ గుడుపు భిక్ష నొనర్చి | యొకచోట మరగక యొల్లమియును
వలపును నెడలి నిర్ద్వంద్వత పాటించి | మమత యహంకృతి మాని నిత్య
తృప్తాత్ముఁడును జనాధీనత్వరహితుండు |నై గమ్యదిశ యొక్కఁ డనఁగ లేక
 
ఆ. మెలఁగుచుండి పక్వఫలము తొడిమఁ బాయు | పగిది గుణచయంబుఁ బాసి యక్ష
యంబు నచలమును నిరామయంబును నగు | పదముఁ జెందు శుద్ధభావ మెసఁగ.
312
వ. అని చెప్పి. 313
క. భిక్షుకుఁ డిమ్మెయి నీడముఁ | బక్షి విడుచునట్లు మాయఁబాసి యభేద్యం
బక్షర మను తత్త్వంబును | సాక్షాత్కృతిఁ గూర్చి నిలుచు శాశ్వత పదవిన్‌.
314
వ. అమ్మహానుభావుండు సంసార సాగరంబు గడచుటయ కాదాశ్రితులనుం గడపం జాలియుండు. 315
ఉ. కావున భిక్షుఁ జెంది ప్రియకారిత శూద్రుఁడు గొల్చునేని సం
భావితుఁ డైన యాతని కృపారసమాని తదీయ సంగ వి
ద్రావిత కల్మషుండయి చిరక్రమవృత్తిత నూయి గ్రొచ్చి నీ
ర్వావిరి గన్నయట్టులు శివంబగు తత్త్వము గాంచు నెమ్మెయిన్‌.
316
తే. అఖిల జనులకుఁ బరమ పదాభిలాష | వృత్తి సామాన్య; యది యొండు వెంట శూద్ర
జనములకు నెట్లు వొరలిన సఫల గాదు | దాని భిక్షుకసేవ సత్ఫలతఁ గూర్చు.
317
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )