పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
పరాశరమునిప్రణీత ధర్మవిశేషంబు భీష్ముండు ధర్మజునకుం జెప్పుట (సం. 13-153-1 (కుంభ))
తే. వర్ణములకెల్ల నింద్రియ వ్యాప్తి నిగ్ర | హంబు వలయు నియ్యది గన్నయంతఁ దృప్తిఁ
బొంది యొండాసపడకున్న నొందు సాధు | జనులు వెదకు ననామయ సత్పదంబు.
318
తే. పరమమైన యీ ధర్మంబు వట్టి పాప | యోనులగు కామినులును వైశ్యులును శూద్రు
లును సుగతి గాంతు రనిన సజ్జనతఁ బరఁగు | బ్రాహ్మణులకు రాజులకును బ్రాఁతె సుగతి?
319
వ. అని చెప్పి వెండియు. 320
సీ. బోధ మక్షీణపాపునకుఁ గల్గదు సద్గు | రుండు సెప్పంగ సంశ్రుతములైన
పనులఁ బాపంబులు వాసిన నిర్మల | జ్ఞానోదయం బగు దాన గర్వ
ముదయింప వచ్చిన నుడుపంగవలయు గ | ర్వంబున గురుసమారాధనంబు
వదలిన నా బోధవైభవ మెడలిన | యంతటఁ బోక కీ డావహిల్లుఁ
 
ఆ. బరమబోధమునకు ఫల ముపశాంతిగా | నెఱిఁగి యెంతబోధ మెక్కు డయ్యె
నంతశాంతుఁ డగుచు ననవరతంబును | గురునిఁ గొలిచి మేలు పురుషుఁ డొందు.
321
సీ. రక్షించునది యుదరంబు శిశ్నము ధృతిఁ | బాణిపాదములు దృక్పాటవములు
వినుఁ డింద్రియంబుల మనమును మనమున | బుద్ధి నిట్లైనఁ బ్రబోధవికచ
హృదయస్థుఁడై ధూమ మెడలిన శిఖివోలె | వెలుఁగు దేవునిఁ జూచు వెరవు గలుగు
యుక్తుండు గాకేల యొదవు మహీశ్వరుఁ | గనుట? యుక్తాత్ముండు గనును భక్తి
 
తే. నట్టి భంగికిఁ జాలిన యట్టిఁడైన | వికృతిషోడశకంబును ప్రకృతి సప్త
కంబు మూలప్రకృతిఁ జిత్తకలన నరయ | వికృతియును బ్రకృతియుఁ గాని విభునిఁ గాంచు.
322
క. ఇది సాంఖ్యానము దీనిని | మది కలవడఁ జేసికొనుచు మఱవక గురు ని
ర్మదుఁడై కొలువఁగఁ గేవల | పదము నతని కరుణ పెంపు ప్రకటము సేయున్‌.
323
తే. భిక్షుభావంబుఁ బొంది యీ శిక్ష యూఁది | మెలఁగు నర్హత త్రైవర్ణికులకుఁ గలదు
శూద్రునకు భిక్షుసంసర్గ సులభ మమల | పదము వానికి భిక్షుతఁ బరఁగఁ జనదు.
324
క. పరమజ్ఞానుల యొద్దను | బరఁగిన నజ్ఞుఁడును బోధభరితుఁడగు నిరం
తర మేరుసమీపస్థితి | హిరణ్యరుచిఁ గాక మెసకమెసఁగిన పగిదిన్‌.
325
క. గురు శుశ్రూషా మహిమం | గరుణఁ జతుర్వర్ణ హితముగా నిమ్మాడ్కిం
బరివర్ణితంబు సేసెం | బరాశర మునీశ్వరుండు పౌరవముఖ్యా!
326
వ. అని సకల ధర్మోపదేశధుర్యుండైన భీష్ముండు పరాశర మునివర్యు వాక్యసంచయంబు సెప్పినం బరితుష్టుండయి పరమ వినయంబునం బాండవాగ్రజుం డక్కురుకులాగ్రగణ్యుతో ‘నరులు సురలకు వంద్యులగు వారును గలరని విందు వారల వర్తనంబెట్టి దెఱింగింపు’ మనిన నతం డతని కిట్లనియె. 327
సీ. ‘ఇట్లు మాతలి యమరేంద్రుని నడిగిన | ధర్మార్థ కామముల్‌ ధర్మచరిత
వర్తనఁ జెల్లించువారు, వామాక్షులు | గోరఁగాఁ దగు రూపగుణ సమృద్ధి
గలిగియు వర్జితకాము లయ్యెడు వారు | విద్యాధనైశ్వర్యవిషయ గర్వ
విరహితులగువారు విజితేంద్రియులు నిజ | దారతృప్తులుఁ దపోధనము గాఢ
 
తే. తత్పరతఁ గూర్చు ఘనులు సత్యవ్రతులును | బరమశౌచులు బహుకార్యపరత లేని
గూఢధర్ములు సన్న్యాస కోవిదులును | దనకు నభివంద్యు లగుట యతండు సెప్పె.
328
వ. అనిన విని ధర్మతనయుండు ‘తటాక నిర్మాణ రూపంబగు ధర్మంబు విశేషంబు వినవలతుం జెప్పవే’ యనుటయు ననిమిషనదీనందనుం డాదరభరితుండై. 329
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )