పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - తృతీయాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకుఁ దటాక నిర్మాణ ఫలవిశేషంబు సెప్పుట (సం. 13-92-1)
సీ. దేవ తిర్యఙ్నరస్థావరాశ్రయము త | టాకంబు విను మట్లుఁ గాక యందు
గోకులంబులు నీరు గొని దాని కర్తకు | లము నెల్లఁ బుణ్యలోకమున కనుచు
నీ లోకమున శ్రీయు నెక్కుడు కీర్తియు | నతనికిఁ జేయు వర్షాగమమున
సీతున వేసవిఁ జెఱువులో నీరున్న | నగ్నిహోత్రాదిమయజ్ఞ వాజ
 
ఆ. పేయఫలములోలి నాయన కగుఁ గట్టఁ | దగిన తరువు లిడిన సుగతి గలుగు
నిహసుఖంబుఁ బొందు విహగాది బహుభూత | వాససౌఖ్య మతఁడు సేసెఁ గాన.
330
క. సలిలాశయములు చేసిన | నలఘుప్రియ మందుఁ బితృచయము లూర్ధ్వగతుల్‌
గలుగును దానం దమ కను | తలఁపున నది గోరుచుండు ధర్మతనూజా!
331
తే. ఛాయ నతిథి వర్గంబుఁ బుష్పముల సురగ | ణంబుఁ బండులఁ బితృనివహంబుఁ బ్రమద
మందఁ జేయు వృక్షంబు లట్లగుట వృక్ష | రోపణ క్రియ మేటి ధర్మువు కుమార!
332
క. అనిన విని ప్రీతుఁడై య | జ్జన విభుఁడు గృహస్థధర్మ సాకల్యజ్ఞా
న నిరూఢి నాదు చిత్తం | బున నొలయింపు భవదీయ పుణ్యఫణితులన్‌.
333
క. అనవుడుఁ దాత యలరి య | మ్మనుమనితో నిట్టు లనియె మహియును విష్ణుం
డును జేసిన సంవాదము | విను మది నీ కోర్కిఁ దీర్చు విశ్రుత కీర్తీ!
334
తే. నన్ను నీ వడిగిన యట్లు వెన్నుఁ డర్థి | బుజ్జవంబులు మున్నుగ భూమిదేవి
నడిగె; దానికిఁ బ్రియమంది యమ్మహాను | భావ యిట్లని చెప్పెఁ దద్భావ మలర.
335
క. ‘దేవా ! హుతవహపరిచ | ర్యావిధి యొనరించి బలిసమాచరణము భ
క్త్యావేశంబునఁ జేయఁగ | దైవతసంఘంబు సమ్మదంబునఁ దేలున్‌.
336
తే. అన్నమున దుగ్ధమునఁ బండ్లనైన మూల | కోటి నైనను దనుపారు నీటనైన
నిత్యమును జేయునది పితృకృత్య మోపి | వైశ్వదేవ మవశ్య నిర్వాహ్య మనఘ!
337
క. ఆ చేఁత పిదప దానం | బాచరణీయంబు శక్తి కనుగుణముగ భి
క్షాచర్య సేయు విప్రుల | వేచి యిడఁగవలయు నెపుడు వేగమ భిక్షల్‌.
338
తే. అప్పటికి వారు లేకున్న నగ్రమగ్ని | ముఖమునందైన నిడునది సఖుల బంధు
జనుల నతిథుల గురుల భోజనవిధాన | తృప్తులుగఁ జేసి బలివిధిఁ దీర్పవలయు.
339
వ. బలు లుభయ ప్రకారంబులు; వానియందు ధర్మాధర్మౌషధి వనరక్షోజనాది విషయంబైన శ్రౌతబలి యేను మున్ను నిర్దేశించినది; యిప్పుడు చెప్పినయది పశుపక్షి చండాల ప్రభృతి గోచరంబగు స్మార్తబలి’ యని నిర్దేశించి వెండియు. 340
ఆ. విను గృహస్థధర్మవిధ మిది యీ భంగి | నడపి పిదప భోజనంబు సేయ
వలయు విప్రుఁ డిట్టి వాఁడొందు నిహపర | సౌఖ్యసంపదలఁ బ్రశస్తచరిత!’
341
క. అని చెప్పినఁ గృష్ణుఁడు నె | మ్మన మలర గృహస్థవిధి సమాచరణము ని
ష్ఠ నడపెఁ గర్మ శ్రద్ధా | ఘన! నీవును నట్ల నడపు గార్హస్థ్యంబున్‌.
342
క. అది దురితనిరాసము న | భ్యుదయానందంబు జేయుఁ బుణ్యయశస్సం
పద నిచ్చు నూర్ధ్వలోక | ప్రదమగు దానిఁ గొనియాడు భరతవరేణ్యా!’
343
వ. అని యిట్లు భీష్ముండు భీమాగ్రజునకు గృహస్థ ధర్మప్రకారం బెఱింగించెనని చెప్పుటయు నప్పౌరవకులోత్తముల సంప్రశ్నోత్తరంబులు మఱి యెత్తెఱంగునం జెల్లెం? జెప్పవే యనుటయు. 344
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )