| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
నహుషుఁడు భూపాలనము సేయుచుండి రా | జస మించుకయు లేక సత్త్వనిష్ఠఁ బుష్పంబులను ధూపముల దీపముల నివే | ద్యంబుల నమరుల కర్చ లిచ్చుఁ బితృసంతతికి దీనఁ బ్రీతి యొనర్చు రా | క్షస యక్షభూతభుజంగమాది తర్పణంబులు నర్హతానిరూఢములు గా | నివి గొని యొనరించు నిట్లు నిత్య |
|
| తే. |
నిరతిఁ జెల్లించి తత్ఫలపరిణతి ప్ర | దీప్త తేజోవిశేష సంప్రాప్తదేవ రాజ్యుఁడై సురమునిగణ పూజ్యభావ | మహిమఁ బొందియు దీనిఁదా మఱవఁ డధిప! |
034 |
| క. |
సురలఁ బితృదేవతలఁ ద | త్పరతను మున్నెట్టు లట్ల పన్నుగ సమ్య క్పరితృప్తులఁగా జేయుం | బరమకుసుమధూపదీప బలిదానములన్. |
035 |
| తే. |
దానఁజేసి తదీయ మహానుభావ | మంత కంతకు నగ్గల మగుటకతనఁ దగియె మునివరవాహనత్వంబు నమ్మ | హాద్యుతికి వేయునేల యవద్యరహిత! |
036 |
| క. |
విను మనుజేంద్రుల కెవ్వరి | కిని లేని విశేష మతనికిం గలుగుట గ ర్వనిరూఢి నొంది దుర్వ | ర్తనపరుఁడై యాతఁ డజగరత్వముఁ బొందెన్. |
037 |
| వ. | అట్టియెడఁ బూర్వంబునం జేసిన పుష్పాదిదాన పుణ్యవిశేషంబుల మహానుభావంబువలన నవ్వసుమతీశ్వరు శపించిన మునీశ్వరుండు సదయుండయి శాపమోక్షంబు నిర్దేశించెఁ ‘దత్ఫలవిశేషంబునన యశేషదోష నిరసననిపుణుండ వగు నీవప్పుణ్యానుష్ఠానంబున కొదవి’ తని చెప్పి వెండియు. | 038 |
| తే. |
పాండవాగ్రజ! నహుషుండు బ్రహ్మసభకు | నాత్మగృహమున కరిగినయట్ల యరిగె; నట్టి పెంపును జనవిభుం డవ్విశిష్ట | దానఫలమునఁ జూవె పొందంగఁ బడసె. |
039 |
| క. |
అని పలికి భీష్ముఁడిట్లను | ‘విను మెందును దీపదానవిధి మే లనిశం బును జేయ నూర్ధ్వలోకం | బును గర్తకుఁ బరమదివ్య బోధము నిచ్చున్. |
040 |
| క. |
ఎన్ని నిమిషములు దైవత | సన్నిధి వెలుఁ గంగఁ జేయు జనుఁడు ప్రదీపం బన్ని సురవత్సరములు సు | ఖోన్నతి సన్నుతుల నాతఁ డొప్పు దివమునన్. |
041 |
| క. |
అనిన విని ధర్మజుఁడు శం | తనుతనయుని తోడ విప్రధనము హరిం చిన యాతఁ డేగతిం జను? | ననుటయు నతఁ డిట్టు లనియె నన్నరపతికిన్. |
042 |
| క. |
దురితము లనేకములు గల | వరయఁగ లోకమున వాని యన్నిటికంటెన్ ధరణిసురధనము పాపపుఁ | దెరువునఁ గొనుటధిక మండ్రు ధీరవిచారా! |
043 |
| క. |
భూసుర ధనాపహరణము | చేసినఁ గులనాశమగుట సిద్ధము; దానం జేసి యగును జండాల | త్వాసంగము నపరభవము నందు నరేంద్రా! |
044 |
| వ. | ఒక్క యితిహాసంబు సెప్పెద నాకర్ణింపుము. | 045 |
| ఆ. |
క్షత్ర బంధుఁ డనఁగఁ గలఁ డొక్క నరపతి | యతఁడు మాలవాని నధికదుఃఖ భాగిఁ గాంచె గాలిఁ బఱచు విప్రక్షేత్ర | తలము రేణువునకుఁ దలఁగి చనఁగ. |
046 |
| క. |
కని యీ ధూళికిఁ గడు రో | సిన కారణమేమి? యనుడుఁ జెప్పె నతనికి ట్లని యమ్మాలఁడు ‘దొలుబా | మున నేనొక విప్రుకొడుక మునులు నుతింపన్. |
047 |
| ఆ. |
పరమనిష్ఠతోడ బ్రహ్మచర్యవ్రత | మాచరింతు; భిక్షితాన్న మొక్క నాఁడు వేడ్కఁ బుణ్యనది తీరమున భుజిం | పంగఁ దలఁచి చనఁగఁ బాప మడరి. |
048 |
| క. |
ధరణీదేవక్షేత్రము | పరాగపటలంబు బహుళ పవనంబుగతిం బరఁగి నరనాథ! నాదగు | కరంబు నన్నమునఁ బట్టె గడుసాంద్రముగన్. |
049 |
| క. |
ఆ ధూళితోడఁ గుడిచిన | నీ దుర్జన్మంబు వచ్చె; నిది యెఱిఁగెడు సం వేదనము పూర్వపుణ్య ఫ | లోదయమునఁ గలిగె; నిన్న యొక కలగంటిన్. |
050 |
| వ. | దానిం జెప్పెద నవధరింపుము. | 051 |
| క. |
ఒక విప్రవరుఁడు ననుఁగని | ‘యకటకటా! యనుచు నిలిచి యడలకు మీ దుః ఖకలాప మెల్లి వాయును | సకలంబును క్షత్రబంధుసంవాదమునన్.’ |
052 |
| క. |
అనియె ననిచెప్పి వీడ్కొని | చని మృతుఁడై తొంటి బహుళసత్కర్మంబుల్ దను నుత్తమ పదమునకుం | గొనిపోయిన నిత్యసౌఖ్యకుండై యుండెన్. |
053 |
| వ. | అనిన విని యజాతశత్రుండు గంగాపుత్త్రుతో ‘నాకలోకం బేకప్రకార మనోహారియై యుండునో? బహుప్రకార ప్రమోదియై వెలుంగునో? యెఱింగింపవే!’ యనుటయు నతండు ‘పుణ్యకర్మంబు లనేకవిధంబులు గావే? కావునం దత్త దనురూపానేకస్థానంబై నాకంబు నిశ్శోకంబును నస్తోకసుఖకరంబును నై కరం బొప్పుచుండు గౌతమ శతక్రతుసంవాదం బను నితిహాసంబు విను మది భవదీయ ప్రశ్నంబునకుఁ బ్రాదేశవిశదీకరణం బగు నుత్తరంబై యుండెడు; గౌతముండను మహాద్విజుండు వనంబునం దపంబు సేయుచుండి శుండాల శిశువుం దల్లిలేనిదాని నొక్కెడం గని కారుణ్యంబు వొడమి పుత్త్రునింబోలెఁ బెనిచె; నయ్యేనిక కొదమ కాలక్రమంబున మేటి యేనుంగయి మెలంగుచుండె; నక్కాలంబున భూపాలనంబు సేయు ధృతరాష్ట్రుండను రాజు నాకారంబు దాల్చి నాకపతి యయ్యెడకు వచ్చి యవ్వారణపతిం బట్టి తనకుం గొనిపోవువాఁడై దీని నాకిమ్మని యమ్మునిపతి నడుగుటయు నతండు. | 054 |
| తే. |
‘ఇధ్మములు దెచ్చి యిచ్చు నే నిచట లేని | సమయమునఁ గాఁచు నీ పర్ణశాల మర్త్య బుద్ధియుత మిది యీ దంతిఁ బుత్త్రుఁబోలెఁ | బెనిచినాఁడ నీకీఁజాల మనుజనాథ! |
055 |