పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
ఇంద్రునకు గౌతమునితో నైన సంవాదము (సం. 13-159-11 (కుంభ))
వ. అనుటయు నా కృత్రిమజనవిభుండు. 056
చ. ‘మునులకు నేనుఁ గేటికి? నమూల్యపుగోవులఁ బుచ్చికొమ్ము వే
యనఘ! పసిండి నీ వలసినంతయు నిచ్చెద’ నన్న ‘శైశవం
బున నిది తల్లి లేకునికిఁ బుట్టిన యక్కటికంబు పెంపునం
బెనుచుటఁ జేసి దీనిపయిఁ బ్రేమము నామదిఁగల్గు భూవరా!
057
క. కావున నొల్లను బదివే | ల్గోవుల నిచ్చినను నిష్కకోటి యొసఁగినం
బోవయ్య యేను మొఱయిడఁ | గా వావిరిఁ గొనఁగఁ దగునె కరిపతి నీకున్‌?’
058
క. అని మునిపతి పలికిన న | జ్జనపతి ‘వాహనము గాఁగ సామజముం గై
కొనఁదగదె రాజునకు ని | ట్లనఁదగునే నీకు? విడువు హస్తిఁ బ్రియమునన్‌.’
059
వ. అని రాజసంబు దోఁపం బలుకుటయు నప్పరమద్విజుండు పుయిలోట దక్కి యిట్లనియె. 060
తే. ‘పుణ్యకర్ములు హర్షంబుఁ బొందఁగనుట | పాపకర్ములు శోకార్తి పాలుపడుట
యెచటఁ గల్గు నజ్జముసభ కేఁగుదెమ్ము | దంతి నచ్చట నిచ్చెద ధరణినాథ!’
061
వ. అనుటయు నతండు. 062
సీ. వినుము నాస్తికు లగు జనులుఁ బాపాత్మకు | లునుగాక యేను వత్తునె మునీంద్ర!
యచటికి?’ నన్న ‘నయ్యముఁడు పుణ్యుఁడు తదీ | యాదరం బొప్పదే?’ యనియె విప్రుఁ
డమ్మాట కవ్విభుం ‘డప్పఁ బ్రోచునతండుఁ | దల్లికిఁ దండ్రి కత్యంతభక్తి
గలవాఁడు నమ్మేలు గనునందు రా నొల్ల’ | నని పల్కెఁ బల్కిన నత్తపస్వి
 
తే. ‘రమ్ము మందాకినికిఁ దత్తటమ్ము పొంత | హస్తి విడిచెద’ ననుమాట యాడ నాతఁ
‘డతిథిశిష్టాన్నభోజులు న ప్రతిగ్ర | హులును గం డ్రది సరకు సేయుదునె యచటు?’
063
క. అనినను ముని ‘మేరు వనం | బున నీ కొప్పింతు గజముఁ బోద’ మనుడు న
జ్జననాథవరేణ్యుండా | తని మోమునఁ జూడ్కి నిగుడ దరహాసముతోన్‌.
064
క. ‘మృదువులు సత్యోపేతులు | సదయులు భూతహితు లందుఁ జనుజనములు నా
కది యేల వేడ్కనిదె వ | చ్చెద నొండొకమంచి చోటు సెప్పు’ మనవుడున్‌.
065
క. ‘నారదమునినాయకుని వి | హారస్థలమైన వనమునం దిచ్చెద నీ
వారణము నచట కిన్నర | ధీరమ్యం బప్సరో మతి ప్రియ మనఘా!’
066
సీ. అనిన గౌతము పల్కు విని ‘గీతనృత్యాది | చతురులై దేవతా సన్మునీంద్ర
హర్షంబు గావించునట్టి వారచ్చటి | కరుగుదు రేనొల్ల నచ్చ’ టనియె
నరపతి; ‘యుత్తరకురుభూము లనిమిష | కమనీయములు సర్వకామ్యవర్షి
యగునందు వాసవుఁ డట వచ్చి కరినొప్పఁ | గొను’ మని పలికె నమ్మునివరుండు
 
తే. ‘కామహింసా రహితులకుఁ గాక నాకుఁ దరమె తత్ప్ర దేశం?’ బని దర్పఫణితి
నాడెఁ బతి; దాని కాభూసురాగ్రగణ్యుఁ | ‘డిందుగృహమున నిత్తు రమ్మిభము’ ననుడు.
067
క. ‘దానరతులు సక్షము లా | దానవిముఖు లందుఁ బోవు తరము జనులు నా
కానెలవు నెలవు కా’ దని | మానవపతి పలుక ముని సమధురవచనుఁడై.
068
వ. అన్నరునాథుతోడ. 069
సీ. ‘రవిపాల నిచ్చెద రమ్ము కుంజరముఁ జే | కొనుటకు’ ననిన నజ్జనవిభుండు
‘నుతతపస్స్వాధ్యాయరతులకు గంతవ్య | మచ్చోటు నాకేల?’ యనుడు ‘వరుణు
పురిఁ గుంభిఁ గైకొను పాద’ మన్న మునిఁ జూచి | ‘యగ్నిహోత్రము నిష్టియజనములును
గలవా రరుగుదురు గాక యన్నెలవొల్ల’ | ననియాడె; భూపతి యతని కాతఁ
 
తే. ‘డింద్రుకడ మర్త్య కోటికి నిష్ట మచట | గౌరు నీకిత్తు నని’ చెప్పె ‘శూరయాజి
వేదిశతవర్షపురుషులు వోదురందు | దాని నేఁగోర’ నని పల్కె ధరణివిభుఁడు.
070
వ. అని పలికిన నప్పరమతపోధనుండు. 071
క. ‘రదిఁగొను మచ్చోటను వే | పొద ప్రాజాపత్యలోకమున’ కనవుడు ‘నా
కది యేల? యశ్వమేధుల | పద’ మనియెం బతి తపస్విపతి యాతనితోన్‌.
072
చ. ‘అపగత మోహశోక మగునట్టిది గోగణలోక మిత్తు మ
ద్ద్విపవరు నందు నీ ‘కనినఁ ‘దీర్థనిషేవులు గోప్రదానపు
ణ్యపరులు బ్రహ్మచర్యనియమాఢ్యులు నచ్చటి కేఁగువారు దా
ని పయిఁ బ్రియంబు నాదు మది నెక్కొన దక్కడ కేల వచ్చెదన్‌?
073
సీ. అని ధృతరాష్ట్రుఁ డాడిన ముని ‘శీతోష్ణ | సుఖదుఃఖ మిత్రారి ముఖములైన
బహువిధద్వంద్వముల్‌ పరఁగవు బ్రహ్మలో | కమున నయ్యెడ సామజము హరింతు
గాని ‘ర మ్మనుడు నమ్మానవపతి ‘యసం | గులుఁ గృతాత్ములు వ్రతాచలితమతులు
నధ్యాత్మనిరతులు నందుఁ బోదురుగాక | యచ్చటు గాన శక్యంబె నాకు
 
తే. నవని సురవర్య!’ యన రాజు నతఁడు సూచి | ముని మహత్తరుఁడే’ నిన్ను ననిమిషేంద్రుఁ
గా నెఱింగితి నెల్లలోకములఁ దిరుగు | దెచటనైనఁ బొందదు గదా యెగ్గు నిన్ను’.
074
చ. అనవుడు మ్రొక్కి యింద్రుఁడు ‘మహాత్మ! మతంగజ హేతు వాదవ
ర్తను ననుఁ బంపు నీ పనుపు దక్కొని చేసెద’ నన్నఁ ‘బుత్త్రుఁ డీ
వనకరి నాకు సాధుజనవత్సల! యిమ్ము కరంబు నెమ్మి దీ
ని’ ననియె సాంత్వనంబుగ మునిప్రవరుండు గులప్రదీపకా!
075
వ. అనిన విని యింద్రుం డిట్లనియె. 076
తే. ‘కరి చెలంగి నీమీఁదఁ బుష్కరము సాఁచి | మూరుకొనియెడు నడుగుల మ్రోల నిల్చి
ముద్దు గురియుచుఁ బలుమఱు మ్రొక్కు నిట్టి | దాని నిన్నేల పాపుదు మాననీయ!
077
మ. ననునే డాఁచెద నన్న నేబుధులుఁ గానంజాల రక్షీణబో
ధన సంపత్తి నెఱింగి తేర్పడ మునీంద్రా! రండు నీవున్‌ భవ
త్తనయుండీ కరియున్‌ నితాంతసుఖ నిత్యంబైన నాకంబునం
దనపాయస్థితి మత్సఖత్వమునఁ బెంపారం బ్రవర్తింపఁగన్‌.’
078
ఆ. అనుడు సంతసిల్లి యట్ల కాకనిన న | మ్ముని వరుండుఁ గరియు మున్ను గాఁగ
నేఁగె దివమునకు మహేంద్రుండు సమ్మోద | భరితుఁడగుచుఁ గురునృపాల వర్య!
079
క. అనిన విని భీష్ముతో న | జ్జనపతి యిట్లనియెఁ ‘దపము సారపు ధర్మం
బని యూఁది మీరు సెప్పుదు | రనఘా! లేకుండునే తదధికం బొకఁడున్‌?’
080
వ. అనుటయు నా దేవవ్రతుం డానరదేవోత్తము నర్మిలి నాలోకించి. 081
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )