| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము |
| సీ. |
వినుము ధర్మము లెల్ల వినుతకృత్యంబుల | తప మెన్ని యెన్నఁగా ధర్మ మెందుఁ గలదు?; తపం బనఁగా నియతాశన | త్వము; భగీరథుఁడు పద్మజుని సభకు నరిగిన నతనితో నద్దేవుఁ డిందుల | కతుల నిర్మలతపమాచరింప కరుగుదేరంగ నెవ్వరికిని రాదెట్లు | వచ్చితో? యనిన నవ్వసుమతీశుఁ |
|
| తే. |
డేను గోదానములును భూదానములును | గన్యకాదానములుఁ దీర్థకలనములును రాజసూయాశ్వమేధాధ్వరములుఁ బెక్కు | సేసినాఁడ వచ్చుట దానఁజేసి కాదు. |
082 |
| మ. |
అవనీదేవత లొక్కెడం గ్రతువిధి వ్యాసక్తు లై యుండఁ ద త్ప్రవిఘాతంబులు దోఁచె నేను రణసంరంభంబునన్ వారి కు త్సవ మొందించితి వానిఁబాపి ముదమొందన్ వారు నన్ బ్రహ్మపా ల వరిష్ఠావ్యయ సౌఖ్య మొందు మని లీలం జెప్పినన్ వచ్చితిన్. |
083 |
| తే. |
ఆఁకలియు నీరువట్టును నాదరింప | కేను విప్రులపని సేసి యిట్టిమహిమఁ గంటి నియతాశనత్వమ కాక తప మ | నంగ వేఱొండె? ధర్మాభినంద్యహృదయ!’ |
084 |
| చ. |
అనుటయు బ్రహ్మ యవ్విభున కర్చన లిచ్చి తగంగ గారవిం చె నధిప! నీవు విప్రుల భజింపుము సంయమితాశనుండవై యని దివిజాపగాసుతుఁడు సాదరభాషణ వృత్తిఁ జెప్పిన న్విని ముదమంది ధర్మజుఁడు నెమ్మి దలిర్పఁగ నమ్మహాత్ముతోన్. |
085 |
| క. |
‘పురుషుఁడు శతాయు వనుశ్రుతి | పురుషవరా! బాలురైనఁ బొందుదురు మృతిం జిరమగు నేమిట నాయు వ | చిరమగు నెద్దానఁ? దెలియఁజెప్పుము కరుణన్.’ |
086 |
| వ. | అనుటయు నయ్యఖిలధర్మవేది యవ్విభున కిట్లనియె. | 087 |
| తే. |
‘అనఘ! ఆచార మాయువుఁ బెనుచు నదియ | కాదు శ్రీయును గీర్తియుం గలుగఁ జేయు విను దురాచారుఁ డాయువు పెనుపుఁ బొందఁ | డతని సర్వభూతంబులు నభిభవించు.’ |
088 |
| క. |
కావున నాచారపరత |భూవర! మేల్ సాధుజనులు వోవు తెరువు సం భావించుట యాచారము | దా వర్ణాశ్రమ సమర్హతం బరఁగు నృపా! |
089 |
| ఆ. |
గురునిమాట సరకు గొనమి దుశ్శీలత | పిట్ట పుడుక గోరు పిసుకఁ ద్రుంపఁ గఱవ మరుగు టుదయకాలాస్తమయ సమ | యముల భానుఁ జూచు టాయు వడఁచు. |
090 |
| క. |
విను క్రోధంబును హింసయు | ననృతంబును లేమి సంధ్య లైనం దదుపా సనము సురపూజనము రే - పొనరించుట చిరతరాయు వొనరించు నృపా! |
091 |
| క. |
పరదారగమన మొప్పదు, | పురుషున కది యెల్ల పాపములకంటె నరే శ్వరవర! యాయుస్సంక్షయ | కరంబు దద్వర్జనంబు గడు మే లరయన్. |
092 |
| క. |
పరదారలయందును సఖి | గురువృద్ధ నృపాలబాలకుల బాంధవభూ సుర వైద్య భృత్య బుధ నా | గరికుల సతు లాయువునకుఁ గడుఁ జే టనఘా! |
093 |
| వ. | అని చెప్పి. | 094 |
| క. |
మేలివి గీడివి యని భూ | పాలక! యేఁ జెప్పినట్టి పను లెఱుఁగుము నీ పోలిన యాయువు పెనుపం | జాలు ననియు నపహరింప శక్తము లనియున్. |
095 |
| తే. |
తగనియది యెద్దియైన వ్రతంబు పూని | మాన నోచిన నాయువు మాల్పకుండు నంతటన పోవ దాయు వత్యంతవృద్ధిఁ | జేయుఁ దగినది సేసినఁ జెప్పనేల? |
096 |
| వ. | అని పరిభాషించి. | 097 |
| క. |
దేవగృహము కడ వీథిని | గోవాటమునందు రచ్చకొట్టము పొంతన్ భూవర! సస్యములను వి | ష్ఠావిసృజన మొప్పదండ్రు చారిత్రవిదుల్. |
098 |
| ఆ. |
ప్రాఙ్ముఖుఙండు నార్ద్రపాదుండు నై భోజ | నంబు సేఁత మే లనంగ విందు నిలిచియుండి కుడుపు నింద్య మమ్మెయి మూత్ర | సర్జనంబుఁ బాపసరణి యండ్రు. |
099 |
| క. |
అనలము గోవును బ్రాహ్మణుఁ జన దెంగిలితోడ ముట్టఁ జంద్రార్కులఁ జూ డను నమ్మెయిఁ దగ దాసన | మును గాంస్యము ననఘ! భిన్నములు వర్జ్యంబుల్. |
100 |
| ఆ. |
వృద్ధు వచ్చునపుడు విను బాలు ప్రాణంబు | లెగయఁజూచి యతని కెదురు లేచి ప్రణతిఁ జేసెనేనిఁ బాదునఁబడి యవి | దొంటి యట్ల నిలుచు దురితదూర! |
101 |
| తే. |
అధ్యయనమున మస్తకం బంటుటయును | నిద్రయును నశుచితతోడ నింద్యకోటి శిరము గోకంగఁ దగ దిరుచేత మస్త | కంబు తైలంబుఁ బూయఁగాఁ గాదు మేన. |
102 |
| సీ. |
వైరనిర్బంధంబు వలవదు గురునితో | నతఁడు కోపించిన ననుసరించి తేర్చుట మేలు నిందించుట గురునెడ | ననృతమాడుట మాయు వపహరించు విప్రగోక్షత్రియ వృద్ధ దుర్బల భార | వహ గర్భిణులకు నీవలయుఁ దెరువు మాన్యభూదేవుని మంగళంబుల వన | స్పతులను వలగొని చనఁగవలయుఁ |
|
| తే. |
బంచదశిని జతుర్దశిఁ బద్మమిత్త్ర | వసుతిథుల జన్మతిథులందు వలయు బ్రహ్మ చర్య మడుగు లొండొంటితోఁ జనదు తోమ | దోషములు గొండియముఁ గ్రూరభాషణంబు. |
103 |
| తే. |
అంగహీను దరిద్రు విద్యావిహీను | రూపహీనునిఁ దెగడుట పాప మండ్రు వేద దేవతానిందలు వేతనార్థ | కముగ జోస్యంబు నడపుట కల్మషములు. |
104 |
| సీ. |
దంతధావనము మూత్రపురీష సర్జనం | బులు మౌనియై చేయవలయు; నుభయ సంధ్యల నిద్రింపఁ జనదు; తండ్రికి రేపు | మ్రొక్కి యాచార్యవిప్రులకు వరుస మఱి మ్రొక్కునది; వీరి కెఱఁగుట దక్కదే | వార్చనంబునకు మున్నన్యుకడకుఁ జనఁగాదు; గర్భిణీసంయోగ | మొప్పదు | పరిణయంబునకు మున్ సురతసుఖము |
|
| తే. |
ననుభవించిన నవకీర్ణ యందు రట్టి | యఘము వోవుఁ బ్రాయశ్చిత్త మాచరింప నుత్తరము పడమర దలయుఁగ శయింపఁ | దగదు శీర్ణతల్పంబు నిద్రయును గీడు. |
105 |
| క. |
సిత పీతంబులు ధార్యము | లతులమతీ! కుసుమకోటియందుఁ గృతస్నా నత రే పాపము శుచితా | చ్యుతుఁడగు సుస్నాతుఁడేని నొడలు దొడసినన్. |
106 |
| తే. |
నీళ్ళ నాడక మును పూఁత నిందితంబు | సీర తడితో విదిర్చుట సెట్ట; యొరులు గట్టి విడిచిన వస్త్రంబు గట్టఁ గాదు | మడత మార్చు టొప్పదు కడుమాపు డైన. |
107 |
| క. |
వలవదు వటపిప్పలముల | ఫలములు నమలంగ మేడిపండ్లును దగ; దా వుల మేకల నెమిళుల యెఱ | చులుఁ గానివి యవిహితంపుఁ జోటుల నధిపా! |
108 |
| క. |
విను మొరు మూ చూ | చిన భోజ్యము నింద్య; మన్యచిత్తము తోడం గొనఁదగ దాహారము; పొ | త్తునఁ గుడుచుట యఘము గూడు దూషించుటయున్. |
109 |
| క. |
చేతఁగొని యుప్పు నమలుట, రాతిపయిని నుప్పు గొనుట, రాత్రి దధిమధూ పేతంబుగఁ గుడుచుట, ధ | ర్మేతరములు; రేయి సక్తు వెగ్గు నరేంద్రా! |
110 |
| క. |
ఒకళులు సూచినయది వా | రికిఁ బెట్టక నమలుటయును బ్రీతిం దన పం క్తికిఁ దెచ్చిన చుట్టలు వే | ఱొక భంగిం గుడువఁ గుడుపు నుఱు విషభుక్తిన్. |
111 |
| క. |
నేయు మధువు సక్తువు దధి | పాయసము జలంబు భుక్తపరిశిష్టము భూ నాయక! యేరికి నిడఁ దగ | దాయువు పెంపారఁ గోరు టాత్మఁ గలిగినన్. |
112 |
| తే. |
అంగుళాగ్రముల్ చిటికెనలందు మొదళు | లనఘ! దేవర్షి తీర్థము లనఁగఁ బరఁగు వరుస వలకేలి యుప్పలవాయి పైతృ | కంపుఁదీర్థంబు తర్పణకార్యమునకు. |
113 |
| క. |
ఆచమనపూర్వకంబుగ | నాచరణీయంబు సర్వ మగుతర్పణమున్ వాచః పరుషత క్రోధం | బాచార విధిజ్ఞు లఘము లండ్రు కుమారా! |
114 |
| క. |
దినమున సురతం బెయ్యెడఁ | జనదు; చెడిపఁ గన్యఁ గవయఁ జనదు; పతిత నం టని దాని నగ్నఁ జూడం | జన దుమిసిన వార్పకునికి సక్షుతుఁడైనన్. |
115 |
| ఆ. |
అట్టియెడలఁ దనకు నాచమనము దొర | కొనకయున్న సూర్యుఁ గనుచుఁ బ్రణవ కలనతోడఁ గూడ వలచెవి ముట్టుట | శుచిత నిచ్చు నండ్రు సూరిజనులు. |
116 |
| ఆ. |
భగిని గురుని మిత్త్రుఁ బండితు వంశజుఁ | బేదపడినఁ దెచ్చి ప్రియముతోడఁ దనగృహమున కల్మి కనురూపముగఁ బ్రోపు | పెనుపు సేయు నాయువునకు సిరికి. |
117 |
| క. |
పారావతములు శుకములు | శారికలును బుష్పలతలు జనవర! పసిఁడిం దారమున నైన ముట్టులు | నారయ గృహమంగళంబు లాదర్శములున్. |
118 |
| తే. |
గ్రువ్వ గ్రద్ద దివ్యారుపుఁ బ్రువ్వు గూబ | యిల్లు సొచ్చిన శాంతి సేయింప వలయుఁ జదువుఁ గుడుపును సందెలఁ జనదు రాత్రి | యైనఁ బితృకార్యములు సేయు టఘముఁ జేయు. |
119 |
| క. |
కులమును రూపము శీలముఁ | గల కన్య వరించి యందుఁ గనిన యపత్యం బులకుఁ దగ నడపునది మం | గళములు గృతదైవపైతృక క్రియుఁ డగుచున్. |
120 |
| తే. |
వలయుఁ బ్రాఙఙ్ము ఖోదఙ్ము ఖత్వముల నొకటి | తారకంబులుఁ దిథులును వారములును జోస్యు లెఱిఁగించినవి మేలు సువ్రతైక | లోల! మంగలి పనికిని దైలమునకు. |
121 |
| క. |
వినుము సపిండీకరణ | మ్మున నేకోద్దిష్టమునను భోజనవిధి వ ర్జన మొప్పు; నామతింపక | చన దామెతఁ గుడువఁ బోవ సజ్జనవినుతా! |
122 |
| క. |
తల్లికిఁ దండ్రికి సుతులకు | నెల్ల విధంబులను వలయు హితములు సెప్పన్ మల్లకుఁడు గాక కర్జము | సల్లభ్యము గాఁగఁ జూచి సౌజన్యనిధీ! |
123 |
| సీ. |
క్షత్రియుం డశ్వంబు గజమును రథమును | నెక్కు నేర్పులు గనుఁ బెక్కు గఱచి నానాయుధాభ్యాస నైపుణంబునఁ బొల్చి | యుద్ధతంత్రములకు నోహటింప కుండెడు మదిఁ బేర్చి దండనీతికి బోధ | కంబగు నట్టి శాస్త్రంబు మొదలు గాఁగ గాంధర్వంబు గామమంత్రంబు లో | నుగ శాస్త్రముల నెల్లఁ దగిన భంగి |
|
| ఆ. |
నలవరించి మున్న యధ్యయనంబునఁ | జొరవ గలిగి ధర్మచరణవేది యై ప్రజాభిరక్ష యధ్వరకరణంబు | వలను మెఱసి నడవవలయు నధిప! |
124 |
| క. |
విను వర్ణాచారంబుల | ననఘ! యిచటఁ దెలుపఁ దొడఁగ నైనను మును లీ పను లాయుర్వృద్ధికరము | లనుట కతన వలసె నీకునై చెప్పంగన్. |
125 |
| సీ. |
అధిప! రజస్వల నంటుట కల్మష | మాచరితస్నాన యైన సతిఁ జ తుర్థదినంబున దోషాసమయమునఁ | జెందంగఁ దగు నండ్రు గొంద ఱార్యు లేనవునాఁ డొంద నింతియు షష్ఠాహ | మునఁ బొంద మగవాఁడు బుట్టు వినుము మఱియును సమవిషమములగు దివసంబు | లందోలిఁ బురుషుండు నంగనయును |
|
| తే. |
సంభవింతు రిట్టులు షోడశంబు దాఁక | నెల్లనాఁడును ఋతుశక్తి యెడలకుండ నెట్టి కార్యము గల్గిన ఋతుమతీస | మాగమము దప్పనీకున్న నాయు వెక్కు. |
126 |
| క. |
విను మాచార మవశ్యం | బును నడపఁగ వలయు ధర్మమున కది మూలం బనఘా! ధర్మం బాయువుఁ | బెనుచును లక్ష్మిని యశంబుఁ బెంపొందించున్. |
127 |
| తే. |
ఇన్ని యాచారములలోన నెక్కు డండ్రు | సకలభూతంబు లందును సదయుఁ డగుట యాదిమును లట్లు గావున నఖిలవర్ణ | ములకు దయకల్మి పెద్దయు వలయుగుణము. |
128 |
| క. |
ఈ యాచారాధ్యాయం | బాయుశ్శ్రీకీర్తికారి యగుఁ బాపంబుల్ వాయం జేయును బృథివీ | నాయక! సద్భక్తిఁ జదివినను దగ వినినన్. |
129 |
| తే. |
అనిన బ్రీతుఁడై పాండునృపాగ్రతనయుఁ | డమరతటినీతనూజుతో నన్నదమ్ము లేమివిధమునఁ దమలోన నెనసి నడచు | వార? లెఱిఁగింపు’ మనుటయు గారవమున. |
130 |
| వ. | అతం డతని కిట్లనియె. | 131 |
| క. |
‘విను భక్తియు వెఱపుఁ గలిగి | యనుజన్ములు పెద్దవాని నారాధింపన్ జనవర! యతండుఁ దమ్ములఁ | గొనియాడన్ సిరికిఁ బ ట్టగుదు రుజ్జ్వలులై. |
132 |
| క. |
అనుజుఁ డొకఁడు వెంగలియై | నను దప్పెడుఁ గాని పెద్దనకుఁ గార్యజ్ఞా ననిరూఢి లేక తక్కిన | ననుజన్ములు సిక్కువడుదు రవనీనాథా! |
133 |
| చ. |
జనవర! యన్నదమ్ములు ప్రసన్నమతిం గలకల్మి పంచి కు డ్చిన వినుతించు లోకములు; శ్రీయుఁ బొరింబొరిఁ బెంపు నొందు; లో భనిరతిఁ బెద్ద కాసపడి పాడి దొఱంగినఁ బ్రాణగొడ్డపుం బనులగు నవ్విధంబు మనపడ్డది కాదె జగం బెఱుంగఁగన్! |
134 |
| తే. |
తండ్రి పిమ్మట నన్నయ తండ్రి పిన్న | వారలకు నెల్ల నాతనివనిత తల్లి తల్లికడచన్న నని చెప్పి తాత మఱియు | మనుమనికి నిట్టులను నభిమన్యుపౌత్ర! |
135 |
| క. |
మానవనాయక! యగ్రజుఁ డైనను ననుజన్ముఁ డేని నన్యాయంబుం బూని సహోదరులకుఁ గీ | డైన నతఁడు దండ్యుఁ డందు రవనీపతికిన్. |
136 |
| వ. | అని సహోదరప్రకారంబు సెప్పి వెండియు. | 137 |
| క. |
విను మప్పఁ దల్లియట్లుగఁ; గొని నడపఁగ వలయుఁ జన్ను గుడిపి పెనిచె నె వ్వనిత యదియు నాతనికిని | జననీసమ యండ్రు బుధులు సౌజన్యనిధీ! |
138 |
| క. |
జనకుం డధికుఁ డుపాధ్యా | యునకుఁ బదిమడుంగు లెక్కు డుర్వీనాథా! జనకునకు దశ గుణంబులు | జనని గురుత్వమున నిది ప్రశస్తము శ్రుతులన్. |
139 |
| క. |
జననీజనకులచే నగు | జననం బాగమము దను విషయ మని చెప్పున్ విను మాచార్యు వలన నొం | దిన పు ట్టజరామరంబు దివ్యంబునగున్. |
140 |
| వ. | కావున గౌరవంబున నాచార్యుండు సర్వాధికుండు. | 141 |
| క. |
అని యిట్లు సుప్రసంగం | బున గురుజన తారతమ్యములు సెప్పినఁ దా విని శంతనుతనయున కి | ట్లనుఁ బాండు నృపాగ్రతనయుఁ డతులిత భక్తిన్. |
142 |
| క. |
‘భూసురులకు నృపులకు నుప | వాసము దగుఁ గాని యన్యవర్ణులకుఁ దదీ యాసక్తి కలిమి పెద్దయు | దోసంబని విందు ధర్మధుర్యస్వాంతా! |
143 |