పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
భీష్ముఁడు ధర్మరాజున కుపవాసవిధివిశేషంబు సెప్పుట (సం. 13-163-3 (కుంభ))
వ. ఉపవాసవిధియోగ్యతయును దత్ఫల విశేషంబును వినవలతుం జెప్పవే’ యనుటయు నప్పురుషవరుం డప్పుడమి ఱేనితో, ‘దీని నీవు నన్నడిగినట్ల యే నంగిరసు నడిగిన నమ్మునిపతి నాకుం జెప్పె నత్తెఱంగుఁ జెప్పెద నాకర్ణింపు’ మని పలికి యిట్లనియె. 144
క. రాత్రిత్రయంబు బ్రహ్మ | క్షత్రియులకు నుపవసింపఁ జనుఁ దదధికమున్‌
గాత్రస్థితిఁ దప్పింపని | మాత్ర నయిన మేలు కురుసమాజవరేణ్యా!
145
క. విను వైశ్యులకును శూద్రుల | కును నాలుగు కుడుపు లుడుగు కొలఁదికి మిగులం
జన దుపవసింప నుపవా | సనిరూఢత పెంపు కల్మషము వారలకున్‌.
146
ఆ. పౌర్ణమాసిఁ బూర్వపక్షాష్టమీ చతు | ర్దశుల నుభయపక్ష వశత వచ్చు
షష్ఠిఁ బంచమిని సునిష్ఠమై నుపవాస | మున్న వివిధశుభము లొలయు నండ్రు.
147
సీ. ఏకభుక్తవ్రత మెంతయు నిష్ఠ మా | సం బెల్ల నడపిన సద్ద్విజుండు
సుభగాకృతియు రూపశోభితాంగనయు స | త్సుతులును ధనధాన్యతతులు భోగ
ములు సద్గుణంబులు భూరియశంబును | మొదలైన బహుశుభంబులకుఁ బాత్ర
మగు నేఁడుకాల మయ్యతులవ్రతము సల్పి | యఖిల భూలోకసౌఖ్యములుఁ ద్రిదివ
 
తే. మోదమును గండ్రు రెండును మూఁడు నాల్గు | నీ క్రమంబున నోపిన ట్లెక్కినట్టి
దినము లెడ పెట్టి కుడుచుచు ధృతి నొకేఁడు | నడపువారల తెఱఁగు లేర్పడఁగ వినుము.
148
క. ఎక్కుడు దినముల శుభములు | నెక్కు నఖిలవైభవములు నెక్కు దినమునం
దక్కక యుండెడు కాలము | నెక్కు మహాత్మతయు నెక్కు నిభపురనాథా!
149
తే. వత్సరం బెల్లఁ బక్షోపవాసనియతిఁ | గడపు నతనికిఁ బుణ్యలోకంబు లెల్ల
వాసభూములు మాసోపవాసవృత్తి | యైన బ్రహ్మలోకంబు సౌఖ్యంబు గలుగు.
150
ఆ. ఎంత నిష్ఠ గలిగె నేనియు మాసంబు | లోనియంద యెక్కుడైన దినము
లధిప! యుపవసింపనగుఁ గాని మాసాధి | కోపవాసవృత్తి పాపమండ్రు.
151
వ. యుగసామర్థ్యంబుననుం బురుషుమహానుభావవిశేషంబుననుంజేసి యుపవాసవ్రతంబు మహాధికకాలకృతం బయినను గీడుం జేయక యత్యంతఫలప్రదంబై యుండు. 152
తే. మాతకును వేదమునకు ధర్మంబునకును | బరములగు గురుశాస్త్ర లాభములు లేవు;
తపము లే దుపవాసవ్రతంబుకంటె | నధిక మైనది యండ్రు మహాత్ము లనఘ!
153
తే. పావనంబులలో నెల్ల బ్రాహ్మణుండు | పరమపావన మను శ్రుతి పౌరవేంద్ర!
యట్లు గావున భూదేవతార్చనంబు | భక్తి సంభృతముగ నడపంగ వలయు.
154
వ. అప్రసక్తం బైనను నీయర్థంబు వినవలయు నట్టిది గావునం జెప్పితి’ నని పలికి వెండియు. 155
చ. ‘అనశననిష్ఠఁజేసి సుర లాదిమునుల్‌ మహితానుభావులై
రనఘ! సహస్రవర్ష సమనంతర కల్పితమైన యేకభు
క్తనియమతంత్రమున్‌ నడపి గాధితనూజుఁడు బ్రాహ్మణత్వముం
గనియె మహోపవాసములఁ గాని ఫలంబులు లేవు భూవరా!
156
క. కావున నుపవాసవ్రత | సేవనము శరీరమునకుఁ జిత్తంబునకుం
బావన మైహిక మహిమయు | దేవనిలయ సుఖము నివ్విధిన్‌ సమకూరున్‌.
157
క. పరమగు నీవ్రతమున కం | గిరసుఁడు దర్శకుఁడు దత్సుగీత విధమునన్‌
నరు లెవ్వరు దర్శకులగు | దురు వారిం బొరయ వేమి దుఃఖములు నృపా!
158
క. ఈ తంత్రంబు పఠించినఁ | బ్రీతి వినినఁ బాయు బహుదురితములు దిర్య
గ్జాతుల భాష లెఱింగెడు | నాతెలి వగు నపరభవమునందు నరులకున్‌.
159
వ. అనిన విని ధర్మజుండు సర్వధర్మజ్ఞానమాననీయునితో ‘యజ్ఞకర్త యగుట మేలని మీరు పెక్కెడలం జెప్పితిరి; యజ్ఞంబు ధనధాన్యవిభవ సహాయసంపన్నులకుం దక్కం దక్కటివారలకుం జేయ శక్యంబు గామి దెల్లం బెల్లవారికి ననుష్ఠింపనయ్యెడు నట్టి పుణ్యకర్మం బెయ్యది యుపదేశింపవే’ యనుటయు నమ్మహీపతికి నమ్మహితాత్ముం డిట్లనియె. 160
క. ‘నరవర! యర్థంబులునుం | బరివారము లేకయును శుభస్థితిఁ జేయన్‌
దొరకొని యుండుట గని యం | గిరసుం డుపవాసముం బ్రకీర్తించెఁ దగన్‌.
161
క. ఉపవాసాయాసంబును | నృపముఖ్యా! దుస్సహముగ నీవు దలఁచి య
జ్ఞపరత్వము దుర్ఘట మను | నెపమిడి యి ట్లడిగి తని మనీషం గంటిన్‌.
162
వ. అనశనవ్రతంబు లందును జులుకని తెఱం గెఱింగించెద. 163
చ. పగలును రేయుఁ గుడ్చి జలపానము లోనుగఁ గుడ్చునప్డు తు
ష్టిగ నొనరించి మర్త్యుఁ డొకటిన్‌ నడుమన్‌ మఱి యెప్డు నంటకే
మిగతిని బాపముం బొరయమిం దలకొల్పుచు హోమకార్యముం
దగుమెయిఁ జేయుచున్న విను తంగెటిజున్నగు నూర్థ్వలోకముల్‌.
164
వ. ఇది మేలితెఱంగు గొందఱు దుష్కరంబుగాఁ దలంతు రట్టివారలు దమయోపినభంగుల నంగిరసుం డుపదేశించిన యుపవాస వ్రతవిశేషంబు లనుష్ఠించు వా రని చెప్పిన నప్పౌరవోత్తముం డయ్యుత్తమ బోధనిధికి నమస్కరించి యధ్యాత్మక విద్యాబోధక ప్రకారంబులగు వాక్యసంచయంబులు పెక్కెడలం గృష్ణద్వైపాయనాది మునీంద్రులును గృష్ణుండును నాకర్ణింప నుపన్యసించితిరి కృష్ణశ్రోతృత్వంబు మహార్హతమంబు గృష్ణుని యున్న రూ పెఱుంగుటయు నత్యంతసంభావనీయంబు. 165
ఆ. ఎవ్వఁ డెఱుఁగఁబడిన నెఱుఁగంగఁ బాలివి | యైన యెల్ల యవియు నవగతంబు
లగుట యీ పరాశరాత్మజుఁ డాశ్రిత | కోటి కర్థిఁ గృష్ణు గుఱిచి చెప్పె.
166
క. కావున నధ్యాత్మక వా | క్యావలికిం జేరుగడ మహామహిమపదం
బై విలసిల్లెడుఁ గృష్ణుఁడ | యే వినఁగా వలతు నమ్మహితవాక్యంబుల్‌.’
167
వ. అని పలికి యింకను నధ్యాత్మవిద్యావివరణంబు లగు వాక్యంబు లనుగ్రహింపవలయు నని సంప్రార్థనంబు సేసిన నప్పార్థివాగ్రగణ్యుతో నక్కురువరేణ్యుండు హరసనత్కుమార సంవాదంబు సెప్పెద నది యధ్యాత్మ విద్యోపకార ప్రకారంబు లైన యుపన్యాసంబుల నొప్పియుండు విను మని యిట్లనియె. 168
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )