పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
హర సనత్కుమార సంవాదప్రకారము (సం. 13-165-5 (కుంభ))
చ. హరుఁడు సనత్కుమారుకడ కర్థిమెయిం జనుదేర నమ్మునీ
శ్వరుఁ డుచితాసనాదు లుపచారవిధిజ్ఞతఁ దా నొనర్చి యా
దరభరితాత్ముఁడై ‘యభిమతం బగు కార్య మనుగ్రహింపు త
త్పరమతి నిర్వహింతుఁ దగ దానిఁ ద్రిలోచన! మృత్యుమోచనా!
169
తే. అనిన ‘నీతోడ గోష్ఠికి నర్థిపుట్టి | యరుగుదెంచితిఁ దమ్ముఁడ!’ యని ప్రమోద
మెసఁగఁ బల్కి యప్పరమేశుఁ డిట్టు లనియె | నఖిలలోకార్చితుం డగు నతనితోడ.
170
క. ‘ధ్యానమున దర్శనీయం | బైనది యే వస్తు? వెన్ని యనఘచరిత! స
మ్మానితతత్త్వంబులు? సం | ఖ్యానము యోగంబు నెట్టి గతులం జెల్లున్‌?’
171
వ. చెప్పుము. మఱియు నధ్యాత్మవిషయంబులగు విశేషంబులును వివరింపు మనుటయు నయ్యంభోజసంభవుం డయ్యభవున కిట్లనియె. 172
క. అరయఁగఁ దత్త్వము లనునవి | యిరువది నాల్గండ్రు గొంద ఱిభదనుజహరా!
యిరువది మూఁ డనుటయుఁ గల | దిరువది యేనండ్రు వానినే యెట్లనినన్‌.
173
క. ఇరువది మూఁ డనువార | ల్గిరిజేశ్వర! ప్రాకృతుల్‌ మలీమసవిధ మ
త్తెరువు మనోబుద్ధులు వా | రరయఁగ నొక్కండ యండు రది యట్లుండెన్‌.
174
క. ఇరువది నాల్గనువారలు | నరసి మనశ్శుద్ధి బుద్ధి యను కాన్పున న
ప్పరుసునఁ బలికెద రేఁ గను | తెరువున విను తత్త్వవిధము దేవస్తుత్యా!
175
తే. పంచవింశ మధిష్ఠానభావ మొంది | విలసనము నిచ్చుఁ దగఁ జతుర్వింశతికిని;
దన్నకని తనయంద డిందంగఁ జేయు | దాన నప్పిండు గలయది లేనియదియు.
176
వ. చతుర్వింశతి తత్త్వంబులు వివరించెద. 177
తే. అవధరింపుము భూతంబు లయిదుఁ దద్గు | ణములుఁ బది యింద్రియములు మనంబు బుద్ధి
యును మహేశ! యహంకారమును బ్రకృతియు | నాఁగఁ దత్త్వంబు లిరువది నాల్గు వొలుచు.
178
వ. ఆ చతుర్వింశతి తత్త్వంబుల నధిష్ఠించి యుండు తత్త్వంబు నిర్దేశించెద. 179
క. దేహం బనియెడ నెరవున | నూహించును బుధుఁడు దాననుండుం గాష్ఠ
స్వాహాప్రియు క్రియఁ బురుషుఁడు | సో-హ మనిన కాన్పు రుద్ర! యతనిఁ గను టగున్‌.
180
క. ఈ నెఱి నిలుచుట గలుగదు | మానేర్ష్యావంతు లైన మానవులకు ని
ష్ఠానూన తపోవర్తకు | లైనను గార్హస్థ్యబహుముఖాత్మకు లగుటన్‌.
181
వ. శ్రుతి పురుషు నమృతార్థ తత్త్వంబనియు బ్రహ్మం బనియు నిర్దేశించు. 182
తే. అన్ని తత్త్వంబులకు నమృతార్థతత్త్వ | మెక్కు డది ఈశ్వరంబు ననీశ్వరంబు
సత్యపాకంబు నతిరహస్యంబు దానిఁ | గనిన మృత్యుజాలము చిక్కు గడవవచ్చు.
183
క. అనఘ! యనులోమమునఁ దోఁ | పును బ్రతిలోమమున లయము వొందుటయును గ
ల్గును సర్వతత్త్వముల కవి | యెనయిక బ్రహ్మమును గలయు టేకత్వ మగున్‌.
184
తే. ఉత్తమశ్రద్ధ లేకున్నఁ జిత్త మేక | ముఖము గాకున్న నింద్రియముల జయింప
కున్న వేదంబు చదువకయున్న నతని | కీ పరిజ్ఞాన మీఁ దగ దిద్ధచరిత!
185
వ. అని చెప్పి తదనంతరంబ యధ్యాత్మంబుల నధిభూతంబుల నధిదైవంబుల నుపన్యసించె నా సనత్కుమారుండు దత్ప్రపంచంబు నారదునకుం జెప్పుట యేను నీకెఱింగించి యప్పరిపాటి నిన్ను మున్న వినిపించితి ధర్మనందనా! యమ్మునిపతి మఱియు నప్పశుపతితో నిట్లనియె. 186
ఆ. సకల జంతువులకు సామాన్య మధ్యాత్మ | మాదిగాఁగఁ గల్గు నంతవట్టు
నిట్లు గాఁగ నెఱుఁగు టెఱుఁగుట యొండుమైఁ | గనుట యెఱుక గాదు కామదమన!
187
క. విను మధ్యాత్మప్రభృతులు | గనిరే? మున్నమరదనుజ గంధర్వులునుం
గనుటయుఁ గల్గునె? బ్రహ్మం | బున నున్న నిజంబు తత్ప్రబోధం బసదే?
188
క. ఓం కారవాచ్య మది యన | హంకార నిరూఢ భావనారాధ్యము ని
ష్పంక మశీత మనుష్ణము | శంకర మఖిలంబునకుఁ దృషాహరము శివా!
189
తే. అప్రమేయ మవిజ్ఞేయ మచల మాది | విరహితంబు నితాంతంబు విమల మవ్య
యంబు పుండరీకాక్ష మనక్షవిషయ | మచ్యుతము సదసత్పరమైక్యభాసి.
190
క. అది నారాయణుఁ డొకనికి | విదిత మతనివలన సురలు వివిధమునులు ని
ర్మదసిద్ధసాధ్యగణములు | మొదలగు నర్హుల సుబోధముల పొలమయ్యెన్‌.
191
వ. అట్లయిన నా తత్త్వంబు దృశ్యత్వంబు నిరూఢంబుగా దెట్లనిన వినుము బంద విముక్తుండు కదా కనువాఁడు. 192
చ. స్మరహర! పొందు నింద్రియసమాజయుగంబు మనంబు బుద్ధియుం
బరువడిమై నహంకరణబంధము వాసిన జీవుఁ దత్సము
త్కరసహితంబుగా నతఁడు దాఁ బరతత్త్వమునందు లీనతం
బొరయును, దాని నెవ్వరు ప్రబోధముగాఁ గనువారు? సెప్పుమా!
193
క. భూతము లన్నియు నడఁగిన | యాతఱిఁ దనుఁ దాన కనుచు నంజనరహిత
త్వాతిశయ మెసఁగ వెలిఁగెడు | నాతెలి వాతత్త్వమునకు నమరు మహేశా!
194
ఆ. అని సనత్కుమారుఁ డభవుతో మఱియు ని | ట్లనియె దేహవర్తులైన దైవ
తముల నెల్ల నాదరమున నాకర్ణింపు | మేర్పరింతు యోగహితము గోరి.
195
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )