పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
సనత్కుమారుఁడు శివునకు దేహాంతర్గతదైవతములం దెలుపుట (సం. 13-167-1(కుంభ))
సీ. జిహ్వ సోముఁడు వాణి శిఖి ప్రాణమున గాడ్పు | దానంబునందు శతహ్రదాలి
వ్యానస్తనాంతరవర్తులై పర్జన్య | గగనముల్‌ బలమునఁ గౌశికుండు
మతి నపానమున సమానంబునందు నీ | శాన మిత్రాప్సరస్సమితు లక్షు
లందు సూర్యుఁడు మేన నంఘ్రులఁ జెవి భూమి | ధరణిధరుండు దిక్తతి యుపస్థ
 
తే. మునఁ బ్రజాపతి బుద్ధి యం దనఘ! బ్రహ్మ | యుండు నింతకు బుధ్యమానుం డనంగ
వెలుఁగు నాత్మ యధిష్ఠాత విను ప్రబుద్ధుఁ | డన నబుద్ధుండు నా నొప్పు నతఁడు మఱియు.
196
క. ఈ దైవతముల నన్నిటి | నాదరమునఁ గనుచు యోగి యచలితనిష్ఠన్‌
వేదమయా! మూర్ధగతుం | డై దక్షతపేర్మి నిలుపుఁ బ్రాణము లచటన్‌.
197
తే. అపుడు బుధ్యమానునిఁగను నవ్వరిష్ఠ | తత్త్వ మవ్యక్త మండ్రు తద్దర్శియగుఁ బ్ర
బుద్ధుఁ డాతని నతని నబుద్ధుఁ డెఱుఁగు | చుండు నివి యాత్మదశ లతఁ డొకఁడ యనఘ!
198
క. ఇవ్విధము గాంచు యోగికి | నెవ్వరు సరిగారు యతు లనేకు లచలులై
యవ్వస్తువు గోరుదు రది | దవ్వొరులకు యోగితతికిఁ దక్క మహేశా!
199
ఆ. క్షరుఁడు నక్షరుండుఁ బరుఁడును నందు ర | వ్వినుతదశలఁ బంచవింశకుఁడు ప్ర
బుద్ధనాముఁ డతఁ డబుద్ధునిఁ గనుఁ బురు | ష విధముగను బ్రకృతిసంగ మెఱుఁగు.
200
క. విను షడ్వింశుఁ డబుద్ధుం | డనఁ జను వాఙఙ్మనసములకు నందక యునికిం
దనుఁగా నాతత్త్వంబుం | గనిన ప్రబుద్ధుండ యతఁడు కామధ్వంసీ!
201
క. వేఱుగఁ గనినం బ్రకృతికిఁ | జూఱ విడిచినట్ల తనదు సుజ్ఞానము న
క్కాఱు విడిచి తనకంటెను | మీఱ నొకటి లేమి గాన్పు మెయికొనవలయున్‌.
202
వ. అని చెప్పి. 203
తే. తత్త్వమునఁగల్గు మూఁ డవస్థలను దెల్ల | ముగ భవద్భవ్యసన్నిధి నిగదనమునఁ
గూర్చు టఖిలేశ! నీ వెఱుంగుటయు నాకు | నెల్ల యోగిజనంబులు నెఱుఁగు టయ్యె.’
204
వ. అని పలికి ‘మునిజనకృత్యంబులు వివరించెద నవధరింపు’ మనుమాటయు సువ్యక్తంబుగా నాడి యాక్రీడా తపస్వికి నప్పరమయశస్వి యిట్లనియె. 205
క. ముని వనమున శూన్యాలయ | మున నైన గుహానికేతమున నేనిని నా
సనబంధధీరుఁడై మన | మునఁ గొని యింద్రియము విషయమునఁ బెడఁబాపున్‌.
206
క. గురు నుపదేశము నడపుం | బురహర! విణ్మూత్ర వేగముల నాఁకలితోఁ
బొరయం డయ్యభ్యసనము | గురువుగ నాహార మెపుడుఁ గొనఁ డే చవులన్‌.
207
క. కుడిచిన యప్పుడ యోగము | దొడఁగుటయును వలదు; మనసు దూలకయుండన్‌
మృడ! వినుము బుద్ధిగొని యె | క్కుడు నిష్ఠను వలయు దానిఁ గుదియింపంగన్‌.
208
క. అది గుదిసిన విజ్ఞానము | గదలక నిర్వాత దీపకాంతియుఁ బోలెం
బొదలును జిత్తంబును నుప | లదశాసంప్రాప్తి నిశ్చలం బగు దానన్‌.
209
తే. అనఘ! నిర్జన నిశ్శబ్దమైన యట్టి | చోటు హృదయస్థుఁ డగు దేవుఁ జూచుపనికి
వలయు; లేకున్న శబ్దసంకలిత మేని | సజ్జనాన్విత స్థల మార్యసమ్మతంబు.
210
క. విను తమము నిస్తమముఁ జే | తనారహిత చేతనా సుధామయతా స్థా
ననిరూఢము నగు తత్త్వము | గను నిన్నియుఁ గలుగు యోగి కరుణామూర్తీ!
211
క. మదనహరా! యోగనిరతు | లది గని దుఃఖముల దొఱఁగి యజరామరతా
స్పదమగు నెలవుల నిలుతురు | పొదలుదు రణిమాదిచయ విభూతిపదమునన్‌.
212
వ. అని మఱియును. 213
తే. యక్షగంధర్వసిద్ధ సాధ్యాది భూత | కోటికంటెను మిగిలి యోగులు నిజేచ్ఛఁ
బరఁగుదురు భవ్యయోగతత్పరుల మేము | నిట్టు లగుట యోగీశ! నీ యెఱుఁగు పనియ.
214
వ. అని సహజన్ము లయిన సనక సనందన సనత్సుజాతులం దలఁపించిన వాఁడయి వెండియు. 215
తే. యోగధర్మంబు కంటెను నుత్తమంబు | గలుగ నేరదు ధర్మ మొక్కటియు నపున
రాగమం బగు పదమున కరయ నిదియ | మేటి నిచ్చెన సంయమికోటి కెల్ల.
216
క. యోగంబుతెఱఁగు సెప్పితి | భోగివరాభరణ! సాంఖ్యమును జెప్పెదఁ ద
ద్భాగులగు నైష్ఠికులు భవ | సాగరముం గడతు రైక్యసంబోధమునన్‌.
217
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )