పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
సనత్కుమారుఁడు రుద్రునకు సాంఖ్యయోగంబు తెఱం గెఱింగించుట (సం. 13-168-1(కుంభ))
వ. కావున నత్యాదరంబున నాకర్ణింపు’ మని పలికి యిట్లనియె. 218
ఆ. ‘ఇంద్రియములకంటె నీశాన! మన మహం | కారతత్త్వ మంతకంటె, దాని
కంటె బుద్ధి, బుద్ధికంటెఁ బ్రకృతి యెక్కు | డిన్నిటికిని బురుషుఁ డెక్కు డరయ.
219
తే. అంబరాది భూతములు శబ్దాది గుణము | లింద్రియము లిరుదెఱఁగు బాలేందుమౌళి!
మన మహంకారబుద్ధు లిట్లొనరి ప్రకృతిఁ | గలయఁ దత్త్వచతుర్వింశకత్వ మొందు.
220
క. చేతనుఁ డగు పురుషుని ని | శ్చేతనయగు ప్రకృతి వొంది చేతనతాప్ర
స్ఫీత యగుం బెఱతత్త్వము | లాతత్త్వం బను మహాబ్ధియందలి తరఁగల్‌.
221
క. గుణములఁ బొందఁడు పురుషుఁడు | గుణమహితా! ప్రకృతి యిచ్చు గుణముల కేమే
గుణములు దానను గుణులై | గుణిత్వ మా నిర్గుణాత్మకున కొలయించున్‌.
222
తే. వీని నెల్ల నసత్కోటిగా నెఱింగి | కొనుచుఁ బ్రకృతి నుపేక్షించి తనకుఁ దాన
కాని యొండెద్దియును లేమి గాంచినపుడు | పురుషుఁ డపగత ధూమాగ్నిఁ బోలి వెలుఁగు.
223
తే. అట్లు గాక యహంకార మావహిల్లి | ప్రకృతి దానని సృష్టికిఁ బ్రలయమునకుఁ
గర్త యైన వికారాత్మకత్వ మొందుఁ | బ్రకృతివికృతులు గాని యా ప్రభువు నపుడు.
224
క. ధృతి పూనమిఁ బ్రకృతికి వశ | గతుఁ డగుచు దమోమయత్వకలితం బగు న
వ్వితతాసుఖితత్వము సుఖ | మతిఁ బురుషుం డనుభవించు మదనధ్వంసీ |
225
క. నేరిమి దాని నుపేక్షం | జేరుప షడ్వింశభావసిద్ధిఁ బొరయు గౌ
రీరమణ! పంచవింశుఁడు | సారామల నిపుణమతిఁ బ్రసన్నాత్మకుఁడై.
226
క. సత్త్వాశ్రయమునఁ బురుషుఁడు | దత్త్వాశ్రయమునను సత్త్వతత్త్వముల వివే
కిత్వాలేపత్వములన | విత్త్వముఁ జిత్త్వంబు నొందు విశ్వాధారా!
227
క. నానా త్వైకత్వము ల | జ్ఞానజ్ఞానజము లనపజయ! కండ్రు బుధుల్‌
వాని నవిద్యయు విద్యయుఁ గా నివి విను పంచవింశకస్థావస్థల్‌.
228
క. విద్యామయషడ్వింశుఁడు | విద్యావిద్యావిభేదవిరహితుఁ డజరుం
డాద్యుఁ డనంతుం డచ్యుతుఁ | డద్యతనుఁ డనాది కేవలాత్మకుఁ డరయన్‌.’
229
ఆ. అని యుపన్యసించి యమ్మునిపతి యను | శంభుతోడ మఱియు ‘సాంఖ్యయోగ
శిష్టమానసుల కరిష్టపరిజ్ఞాన | వైభవాతిశయము వలసియుండు.
230
వ. ఎట్లనిన దృష్టారిష్టవికృతులయి యా సుకృతుల విచ్ఛిన్నాత్మాను సంధానంబునం దదీయ దురవస్థం ద్రోవంజాలుదు రరిష్ఠంబు లవధరింపు’ మను పలుకు పలికి ‘వాని నెల్లను వివరించెద’; నని పరాశర సంయమీశ్వరుండు శిష్యుల కుపదేశించిన విధంబులైయుండు నంతవట్టును మును నీ వాకర్ణించి తని యమ్మునివరుండు మఱియు నమ్మహాదేవుతో ‘నరిష్ఠంబులం గాంచి యోగిజనంబులు సర్వాంగధారణ సహితంబును బరమహితంబును నగు ననేకత్వాకలన కృత్యంబున మృత్యువు జయింతు’ రని నిర్దేశించి. 231
క. జలమున మీను నుదుంబర | ఫలమున మశకములుఁ బోలెఁ బ్రకృతిం దా ని
మ్ముల నునికి తెలిసి వేర్పా |టలవఱిచిన పురుషుఁ డవ్యయత్వము పొందున్‌.
232
తే. కమలదళమున నున్న జలము విధమునఁ | బ్రకృతినుండి తదీయసంబంధవికృతి
లేని తనుఁ గని వెలుఁగు నిర్లేపనిశ్చ | లాజరామరపదవి జీవాహ్వయుండు.
233
ఆ. ప్రకృతి నిట్లు వాసి పంచవింశుండు ష | డ్వింశభావమొంది విమలశివ ని
రంజన స్వరూపుఁడై వెలుఁగొందు న | త్తెఱఁగు ముక్తియండ్రు దేవదేవ!
234
క. ఈ పరిబోధం బభవా! కాపిల మస్మద్గురుండు గపిలుఁ డతని శి
క్షాపరిణతి బహుశిష్యులు | దీపితవిజ్ఞానులైరి దృఢనిశ్చయతన్‌.
235
క. ఏనును శిష్యుల కీ వి | జ్ఞానము పెక్కండ్రకుం బ్రసన్నమతిని గా
ఢానూనంబుగఁ దెలిపితి | మానిత మది దివ్యమునిసమాజముచేతన్‌.
236
వ. గార్గ్య గౌతమ కాత్యాయనాదులు దీనన చేసి దీప్తబోధులయి వీతాతంకులును విజ్వరులును నిర్లేపులును నిర్భరానందులు నైరని చెప్పి వెండియు నిట్లనియె. 237
క. సంగము బంధ మఖిల ని | స్సంగత మోక్షంబు బహువిచారము లేలా?
పింగజటాజూట కలిత! గంగాబాలేందు మహిత! గౌరీసహితా!’
238
క. అని యిట్లు శివునకును న | మ్ముని విజ్ఞాపించి గగనమున కెగసి వెసం
జనియె శివుండును నిజది | వ్య నిరర్గళ చిత్తపథ విహారుం డయ్యెన్‌.
239
క. అని చెప్పిన భీష్మున కి | ట్లను ధర్మతనూజుఁ డెక్కుడైన శుచిత్వం
బొనరింపఁ జాలు తీర్థం | బనఘా! యెఱిఁగింపవే దయం దెల్లముగన్‌.
240
సీ. అనవుడు నాతఁ డమ్మనుజవల్లభుతోడ | ‘వినుము తీర్థము లెల్లవియును మేల;
సత్యాభిధానమై శౌచాతిశయముఁజే | యఁగఁ జాలు మానసంబైన తీర్థ
మది ధృతి యనుమహాహ్రదమున శోభిల్లుఁ | దమము రజస్సును దఱియఁ ద్రోచి
కొనుచు సత్యము నూఁతగొని చొచ్చి యాచరి | తస్నానుఁడై శుచిత్వమున వెలుఁగు
 
ఆ. నరుఁడు వీతరాగ పరిహృతేంద్రియ దృఢ | వ్రతలసద్వివేకు లతిశయిల్లు
విమలతీర్థములు సవినయత వారలఁ | జెందుటయును దీర్థసిద్ధి యధిప!
241
క. దమమును దపము నహింసయు | శమమును దీర్థముల వాన శౌచాతిశయం
బమలగుణ! కలుగు రిత్తజ | లములం దోఁగిన శుచిత్వలాభము గలదే?’
242
వ. అని వెండియు. 243
క. ‘దొరకొననివానిఁ గోరక | దొరకొనినందును మమత్వతుష్టహృదయతం
బొరయక విగతస్పృహులగు | పురుషులు శుచు లేల తీర్థములు వారలకున్‌?’
244
క. అనినఁ బ్రియమంది తాతకు | మనుమఁడు ప్రణమిల్లి ‘బోధమహితా! యేవ
ర్తనమున నుత్తమపదముం | గను నం; డ్రది యెఱుఁగఁ జెప్పు కరుణ దలిర్పన్‌.
245
వ. మృతుండు మేను విడిచి యెయ్యది సహాయంబుగాఁ జను నదియును వినవలతు’ నని యడిగిన నమ్మహానుభావుం డా భూవల్లభున కిట్లనియె. 246
క. ‘నీ యడిగిన గూఢములగు | నీ యర్థము లెఱుఁగఁ జెప్ప నింద్రగురుఁడు గా
కేయెడల నొరుఁడు గలఁడే. యాయన యిట వచ్చు నిపుడ యడుగుము ప్రీతిన్‌.’
247
క. అను సమయంబున నయ్యెడ | కనిమిష గురుఁ డరుగుదెంచె నతనికిఁ గుంతీ
తనయాగ్రజుండుఁ దమ్ములు | జనపతులును గేశవుండు సద్భక్తిమెయిన్‌.
248
వ. ఎదుర్కొని ప్రణామపూర్వకంబుగా సముచితోపచారంబులం బ్రీతాత్ముంజేసి యాసీనుండై యున్నెడం గురుపతి యగ్గురునిం గురుపితామహు నడిగినయట్ల యడిగిన నతం డతని కిట్లనియె. 249
ఆ. ‘తనకుఁ దాన కలఁడు జననంబు నప్పుడు | మరణమునను సుగతి నరకములను
దల్లి దండ్రి దక్కు నెల్లబంధులు శరీ | రంబు ననుగమించి క్రమ్మఱుదురు.
250
క. ఉత్తమపథంబు ధర్మా | యత్తము, ధర్మంబు మృతుల కధిప! సహాయం
బెత్తెఱఁగున ధర్మక్రియఁ | జిత్తంబునఁ జేర్పవలయు జీవించుతఱిన్‌.
251
క. అది లేనివాఁడు నరకా | స్పదుఁ డగు నటుగాన ధర్మపరుఁ డగుటయ యొ
ప్పిదము మనుజునకు నేఁ జె | ప్పెద మఱియును వలయువానిఁ బ్రీతి నడుగుమీ’.
252
వ. అనిన నజ్జనపతి ‘శరీరంబు విడిచి చనియెడు జీవుని ధర్మం బె ట్లనుగమించు?’ ననుటయు నయ్యాం గిరసుండు. 253
తే. ‘భూత పంచక శక్తులు బుద్ధియును స | ధర్మకంబుగ జీవుతోఁ దగిలి యరుగు’
ననుడు ‘రేతఃప్రకార మె?’ ట్లనియె నృపతి; | యతని కిట్లని చెప్పె నయ్యమరమంత్రి.
254
తే. దేహగత భూప్రభృతి పంచదేవతలును | మనసు నన్నసంతృప్తిఁ బొందిన నృపాల!
కల్గు రేతస్సు పురుషుండుఁ గామినియును | బొందఁగా నది గర్భత్వ మొందుఁ జువ్వె.
255
వ. అని చెప్పి మఱియును. 256
తే. ‘పుణ్యపాపానుగుణభంగిఁ బుట్టి సౌఖ్య | దుఃఖమయ సంసరణమునఁ దొడరు నరుఁడు
వినుము కేవల ధర్మవర్తనసుఖైక | భాజనత నొందు ధర్మైకపరత మేలు.
257
క. జనవర! కృమిగర్దభముఖ | జననంబులఁ బొంది నరకసంవాసముఁ జెం
దు నధికపాపాత్ముండగు | మనుజుఁడు కర్మ సవిశేషమహిమఁ దెలిపెదన్‌.
258
క. జననీజనక గురులయెడ | నొనరించిన మేలుఁ గీడు నొదవించు సుఖం
బునకును దుఃఖమునకు నిం | తని కొలఁది యిడన్‌ వశంబె యజునకు నైనన్‌?
259
క. మాతృపితృగురులు దక్కఁగ | నే తెరువునః బాప మొలసె నేనియు దానిం
బాతురు ప్రాయశ్చిత్త | స్ఫీతులు దద్విషయమైనఁ జెడ దల్పములన్‌.
260
క. కొలు చపహరించు నన్నరుఁ | డెలుకయుఁ బందియును నైన యీ దుర్జననం
బులఁ బొందు నంతఁ బాపము | వొలియక యాతనికిఁ గుక్కపుట్టువుఁ గల్గున్‌.
261
క. పరదారగమన దోషము | వరుసన వృకకంక గృధ్ర వలిముఖ శవభు
క్తిరతంబులైన భవములఁ | బొరయించుం గృమియుఁగాఁగఁ బుట్టించుఁ దుదిన్‌.
262
సీ. తనయ నొక్కని కిచ్చి మనసు మరలఁబడి | యన్యున కిచ్చిన యట్టివాఁడు
కృమియగు; దేవకార్యము సేసి మఱి పైతృ | కంబు సేయక భోజనంబు సేయు
నతఁడు కాకం బగు; నన్నఁ దిట్టినఁ గ్రౌంచ | మై పుట్టు; బ్రహ్మకులాభిజాతఁ
గవసి శూద్రుఁడు నరకపుగుంట పుర్వగు | నంతకు కింకరు లంటఁ బట్టి
 
తే. కట్టికొనిపోయి కోసియుఁ గాల్చియును గృ| తఘ్ను నుగ్రకంటక సముదయము మీఁదఁ
క్రంద నదిమియు మఱియు దుఃఖములఁ బెట్టు | తెఱఁగు లెన్ని యన్నింటను బఱతు రధిప!
263
క. ధనవాంఛ నిరాయుధుఁ జం | పిన గాడిద మొదలు గాఁగఁ బెక్కులు తిర్య
గ్జననంబులఁ బొందును శ | స్త్ర నిహతిఁ దోడ్తోడ మరణదశ వాటిల్లున్‌.
264
ఆ. ఆఁడుదానిఁ జంపినతఁ డేక వింశతి | దూష్య నరకవాసదుఃఖ మొందు
నన్నదధిపయోఘృతాపూపహరణముల్‌ | మక్షికాదికీటమయత సేర్చు.
265
ఆ. ఫలము నినుము వెండిఁ బసిఁడి మ్రుచ్చిలికొన్నఁ | గ్రోఁతి వాయసంబు గ్రువ్వ నీచ
కృమియు నగు సదంబరము హరించిన శశ | జనన మొందు నరుఁడు మనుజనాథ!
266
తే. నమ్మి యిల్లడవెట్టిన సొమ్ముఁ గొనిన | మీను లోనగు నీచపు యోనులందుఁ
బుట్టు; గంధవస్తువులు గొన్నట్టివాఁడు | వినుము మఱు పుట్టువునఁ జుంచుతనము నొందు.
267
తే. వనిత లీపాపములు సేసి వానివాని | పత్నులై జనియింతురు; పాపభీతిఁ
దెరువు తప్పక నడచిన నరులు సౌఖ్య | మందుదురు రెండు లోకంబు లందు నధిప!’
268
వ. అని చెప్పి యిట్లనియె; ‘నేనుం గొన్ని తెఱఁగు లెఱింగించితి మఱియు ననేక పదార్థాపహరణంబులకు బహు విధంబులగు ఫలంబులు వాటిల్లు వాని నెల్లను శాస్త్రాంతరశ్రవణంబున నెఱింగెదు గాక’ యనిన విని యక్కురు పతి బృహస్పతితోఁ ‘బాపంబులం బాపికొనుతెఱం గెఱింగింపవే’ యనుటయు నతం డతని కిట్లనియె. 269
క. విను దానంబులఁ బాపము | లనఘా! చెడు దానములకు నన్నిటికిని స
జ్జన సేవ్య! యన్నదానము | మును లధికం బండ్రు పాపములఁ బాపునెడన్‌.
270
క. న్యాయార్జిత మగు నన్నము | వేయింటికిఁ బెట్టవలయు విప్రజనము హ
ర్షాయత్తంబుగ దానం | బాయని పాపములు గలవె? పౌరవముఖ్యా!
271
తే. తిరిసి యేనియు నన్నంబు దెచ్చి శిథిలు | లైన విప్రుల యాఁకలి నపహరించు
పురుషుఁ డూర్థ్వలోకంబుల పురుషవరుల | కర్చనీయుఁడై వెలుఁగుచు నంద యుండు.
272
క. వేదాధ్యయనార్థ ప్రతి | పాదనమున విప్రవరుఁడు బ్రహ్మ విషయ స
ద్భూదానంబుల నరపతి | యే దురితము లైనఁ గౌరవేశ్వర! పాచున్‌.
273
తే. నేర్చి యలజడిఁ బడిన వాణిజ్య విధులఁ బడసి వైశ్యుఁ డన్నంబిడి పడయు సుగతి
చచ్చునంతలు వడి సిరి దెచ్చికొని చ | తుర్థులన్నంబు వెట్టి కాంతురు దివంబు.
274
తే. దివము వంధ్యంబు గాకుండఁ దివిరి యన్న | పానదానంబు లొదవిన భంగిఁ జేసి
మఱి భుజించుటఁ బోలెడు మహితధర్మ | కార్య మొండొకఁ డెందును గలదె యరయ.’
275
తే. అన్నదానంబు ధర్మంబు లన్నిటికిని | ముఖ్య మింత యెఱుఁగు కురుముఖ్య!’ యనుడు
ననిమిషాధిప మంత్రికి నమ్మహీశుఁ | డిట్లనియె భక్తి వినయంబు లెసక మెసఁగ.
276
క. ‘ధ్యానం బింద్రియవృత్తుల | మానించు టహింస గురుసమర్చన విధి ని
త్యానుష్ఠానము దప మను | వీనఁ బరమసేవ్య మెద్ది వినఁగా వలతున్‌.
277
వ. వినిపింపు’ మనిన నమ్మహాత్ముండు. 278
క. ఈ యాఱును మంచి తెరువు | లై యుండు నహింస యున్నయైదిటికిఁ బవి
త్రాయతన మట్లు గాకయు | నేయుత్తమధర్మములను నిది వెలిఁగించున్‌.’
279
వ. అని పలికి యామంత్రణంబు సేసి వాసవమంత్రి యమరనగరంబునకుం జనియెఁ; దదనంతరంబ. 280
ఆ. ధర్మనందనుఁడు పితామహుతో ‘సర్వ | దేవతలును భూమి దేవతలును
మునివరులు నహింస గొని యాడుదురు దాని | తెఱఁగు సెప్పు నాకుఁ దేటపడఁగ.’
281
వ. అనుటయు నమ్మహనీయుం డమ్మనుజపతిం బరమాదరంబున నాలోకించి. 282
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )