| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము |
| ఆ. |
‘దంతియడుగు లోనఁ దక్కిన జంతుచ | యంబు నడుగు లెల్ల నడఁగి యుండు నట్ల ధర్మకోటు లన్నియు లోనగు | నిద్ధగుణ! యహింస కింత నిజము. |
283 |
| వ. | అదియును. | 284 |
| క. |
అరయఁగ నాలుగు విధములఁ | బరఁగుఁ జతుష్పాదవృత్తిఁ బరఁగిన గోవున్ దొరయుచు నం దొకఁ డెడలిన | నరవర! సద్ధర్మవర్తనము గుంటువడున్. |
285 |
| తే. |
మనసునను వాక్కునను గాయమునను హింస | నడపు మాంసంబు దినుటతో నాలుగయ్యెఁ దెఱఁగు లవి సువ్వె హింస వర్తింపఁ జేయుఁ | గాన కడుఁ గీడు మాంసభక్షణము దలఁప. |
286 |
| క. |
ఈ నాలుగు దెఱఁగుల దగ | మానుట యేఁ జెప్పినట్టి మహితాహింసా నూనచతుర్విధములు మాం | సానేకరుచి ప్రమగ్నుఁ డది యెట్లుడుగున్? |
287 |
| క. |
కావున మాంసముపైఁ దగు | లే విధమున నుడుగుటయ యహింసారూపం బై వఱలుఁ జుమీ భూవర!’ నావుడు నక్కురువిభుఁడు వినయమయుఁడగుచున్. |
288 |
| వ. | ‘మాంసంబు పితృదేవతలకుం బ్రియంబు శ్రాద్ధంబు మాంసముఖ్యంబుగా నడపవలయునని చెప్పుదురు. వధింపక మాంసలాభం బెట్లు గలుగు?’ ననుటయు ననిమిషనదీనందనుం డానరనాథున కిట్లనియె. | 289 |
| తే. |
‘వాజిమేధంబుకంటెను బూజనీయ | కర్మ మందురు మాంస భక్షణము విడుపు వినుము చంపుటయును జంపఁ బనుచుటయును | గల్మషంబుల కెల్ల నగ్గలము లధిప! |
290 |
| క. |
పితృకార్యయజ్ఞముఖముల | శ్రుతిచోదిత హింసఁ గీడు సొరనేరదు వి శ్రుతగుణ మాంసము చవిగో | రి తినం బ్రాణిఁ దెగటార్చు క్రియఁ బాపమగున్. |
291 |
| క. |
తను నమలిన వాని నమలు | నని మాంసము తెఱఁగు సెప్పు నాగమములు గా వునఁ దద్భక్షణ ముడిగిన | ననఘ! తపంబునకుఁ జాలు నది యొక్కండున్. |
292 |
| క. |
జనవర! మాంసముచవిఁ గడ | చిన చవు లరయంగ లేమిఁ జేసి చవి యెఱిం గినవాఁ డది యుడిగిన నా | తని దేవసమానుఁ డండ్రు ధర్మవిధిజ్ఞుల్. |
293 |
| ఉ. |
మ్రానను ఱాతనుం గలదె మాంసము ప్రాణుల మేనఁగాక? య మ్మేనుల నొంచునప్డు తమ మేనులు సోఁకినమాత్ర నెట్లగున్ దానిఁ దలంపఁగా వలదె? తానది మానిన హింసలన్నియున్ మానవె? యంచు నుత్తముఁడు మాంసము మాను దయార్ద్రచిత్తుఁడై. |
294 |
| ఆ. |
మాంస మానకునికి మనుజేశ! ప్రాణివ | ధాభిరతి దొఱంగు టగుటఁ జేసి యట్టివాని కభయ మఖిలభూతంబుల | వలన నెపుడు నెందుఁ గలిమి నిజము. |
295 |
| క. |
స్వాయంభువుఁ డను మనువును | నీ యర్థము సెప్పె లోకహితముగ మార్కం డేయాదులు మాంసముడుగు | టాయుశ్శ్రీ రూపకారి యగు నని రధిపా! |
296 |
| క. |
విను మాంసము గోరు నరుఁడు | దనుజుఁడ చూవె! మును దేవతలు మాంసంబుం దిను టుడిగి కాదె దానవ | జనితభయముఁ బోవఁ ద్రోవఁ జాలిరి వత్సా! |
297 |
| క. |
దానము ధర్మము దప మి | జ్యానిష్ఠ యనంగఁ గల్గు సత్క్రియ లెల్లన్ మానవనాథ! యహింసా | నూనాకృతు లండ్రు శ్రుతుల నూనిన పెద్దల్. |
298 |
| క. |
శతవర్షదుష్కరతపః | కృతి నంజుడు దినమి నగు సుకృత మివి రెండున్ మతిఁ దలఁప నొక్కరూ పని | శ్రుతివేదులు సెప్పుదురు కురుక్షితినాథా! |
299 |
| క. |
తపముల దానంబుల బ్ర | హ్మపురి నివాసంబు దప్పదనరాదు, జనా ధిప! మాంసము నమలని పు | ణ్యపురుషునకు సులభ మందు రా నెల వార్యుల్. |
300 |
| తే. |
అధిప! యాషాఢముఖ్యంబు లైన నెలలు | నాలుగింటను మాంసంబు నమల కుడుగు టాయురారోగ్య బలకీర్తు లను ఫలములు | నాలుగింటిని నిచ్చు నన్నరున కండ్రు. |
301 |
| ఆ. |
సగర నల దిలీప నృగ భగీరథ ముఖ్య |నృపులు వార్షికంపు నెలలు నాల్గు మాంసభక్షణంబు మానుట నుభయ లో | కంబులందుఁ బెంపుఁ గాంచి రండ్రు.’ |
302 |
| వ. | అనిన విని యజాతశత్రుండు శంతనుపుత్త్రుతో ‘నిమ్మెయి మహనీయంబయిన మాంసవర్జనంబు వాటించి తక్కిన యపూపాదులు ఫలప్రభృతులు నగు భక్ష్యంబు లాచరించి యేల వర్తింప రెల్ల జనంబులు?’ ననుటయు. | 303 |