పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
మాంసభక్షణ మందలి రుచివిశేషంబు మానుట దుష్కరంబని చెప్పుట (సం. 13-178-7 (కుంభ))
సీ. అతనికి నతఁ డిట్టులను మాంసముల చవి | మరగినవానికి మాన వశమె?
యట్లు గాకయు సురతాసక్తునకు బల | మొలయు నధ్వశ్రాంతుఁ డుల్లసిల్లు
క్షతము శీఘ్రమున లోపితమగుఁ గృశునకుఁ | బుష్టి వేగమ వచ్చు భూపవర్య!
విను మాంసభక్షణంబున నపూప ఫలాదు | లం దవ్విశేషంబు లరయఁగలవె?
 
తే. మాంస మానిన దోషంబు మహిత దాన | విధులఁ బాయు దివిజపితృవిధివిశిష్ట
మైన యెఱచి గీడొలయదు యజ్ఞములకుఁ | బశువిధానంబు వేదంబు పనుపు గాన.
304
వ. ఇట్లు గాన నంజుడు నమలుటయు నధికదోషంబులు గాని యెడలునుం గలిగియుండు; నగస్త్యుండు రాజులకు వేఁట విధించెం గావునం గుతూహలంబుఁ గోపంబు ననియెడు భావంబులం బొరయక లోకరక్షణార్థంబుగాఁ గ్రూరమృగ వధంబును స్వహస్తవిక్రమార్జిత మాంసంబున దేవపితృప్రీణనం బొనర్చుటకుం గాఁ బక్షి మృగమారణంబును జేయు భూనాయకుండు దురితంబులం బొరయకుండు విశేషంబు వినుము. 305
ఆ. అన్యమాంసమున నిజాంగమాంసంబుఁ బో | షింతు ననుటకంటెఁ జెట్టలేదు
మాంసభక్షణంబు మానుటకంటెను | మేలు లేదు కర్మజాలకమున.
306
తే. మాంసభక్షణ దోషంబు మాను దాన | మహిమ ననుటయు మాంసంబు మఱి భుజింప
కున్నఁ జూవె; ధర్మము లెవ్వియును దలంప | దయకు సదృశంబులే? కురుధరణినాథ!
307
తే. ఆత్మ సదృశత ప్రాణభయంబునందుఁ | బ్రాణులకు నెల్లఁ గని మాంసభక్షణంబు
మాను దయ నార్ధ్రమానసుండైన పురుషుఁ | డాతనికి బ్రహ్మలోకాదు లాటపట్టు.
308
క. భూతముల కలుగు నతనికి | భూతము లఖిలములు నలుగు భూతహితార్థీ!
భూతముల కభయ మిచ్చిన | పూతాత్మున కభయ మిచ్చు భూతావలియున్‌.
309
ఆ. దానమును దపంబు ధర్మంబు యజ్ఞంబు | శౌచ మంత్రతంత్ర సత్యములును
బుధు లహింస రూపములు గాఁగఁ జెప్పుట | నెల్లకల్మి సుమ్మహింస కలిమి.
310
క. నరనాథ! యహింసా గుణ | పరిగణనము గొంత మాత్రఁ బలికితి ధర్మో
త్తర యగు నహింస మేలిమి | యరయం గడుఁ బెద్ద దాని నలవఱుపు మదిన్‌.’
311
ఆ. అనిన సంతసిల్లి యమ్మహీపతి తాత | కధికభక్తి మ్రొక్కి ‘యస్మదీయ
సంగరంబునందుఁ జచ్చినవారల | కేది గతియొ నాకు నెఱుఁగఁ జెప్పు.
312
క. బ్రదుకును జావును సుఖదుః | ఖదములుగా జంతుకోటి కరుణామూర్తీ!
మదిఁ దలఁచుఁ బ్రాణలాభము | వదలు టరిదిగాన నట్టివారి నడిగితిన్‌.’
313
క. అనుటయు ‘లెస్సగఁ దలఁచితి | విను మొక కీటంబునకును వేదవ్యాసం
బున లోకహితమొనర్చిన | మునికి నయిన సత్కథనము మునినుతచరితా!
314
వ. దాన నీ యడిగిన యర్థంబు తెల్లం బగు’ నని పలికి భీష్ముం డిట్లనియె. 315
క. శకటపథంబునఁ గీటం | బొకటి వెసం బాఱఁ గాంచె యోగీంద్రుఁడు జం
తుకలాప మానసదశా | ప్రకార సంవేది బాదరాయణుఁ డధిపా!
316
వ. కాంచి నిరూపించి యాకృష్ణద్వైపాయనుం డక్కీటకంబుతో ‘నీవు భయంబున రయం బెసఁగం బాఱెదవు కారణం బేమి?’ యని యడిగిన నది యమ్మునీంద్రున కిట్లనియె. 317
తే. ‘తెప్పతెరలంగ బండు లేతెంచుచున్న | యవి మహాత్మ! తన్నేమిజాతారవములుఁ
గడఁక నెడ్లను దఱిమి రొప్పెడు నరాలి | యులివు విని యుల్లమునఁ గడునులుకు పుట్టి.
318
వ. బ్రదుకును జావును బరమసుఖంబును నత్యంత దుఃఖంబునుం గాదె? కావున. 319
వ. క్రందున మేను సిదియు నను | కొందల పాటొంది ప్రాణగొడ్డమగుటఁ ద
ప్పం దొలఁగఁ బాఱెదను ముని | బృందారక! యసదె ప్రాణభీతి దలంపన్‌?’
320
చ. అన విని దాని కిట్టులను నమ్మహితాత్మకుఁ డెంతలెస్స? నీ
మనికి దలంప నింద్రియసమాజసుఖంబులఁ బొందఁ గీటము
ల్గను టదిలేదు దుఃఖబహుళం బిది యీ యొడ లేల? చావు నీ
కనయము సౌఖ్యకారియగు నత్తెఱఁ గీవు దలంచి చూడుమా!’
321
వ. అనుటయు నక్కీటంబు. 322
తే. ‘అనఘ! కీటంబులకు విషయజములైన | సౌఖ్యములఁ బొంద లే దను చదువు గలదె?
వినుము తమతమ తెరువుల ననుభవింపఁ | గలదు చావును భీతికిఁ గారణంబు.
323
వ. నీవు నా మనం బరసి; తింతియ కాక యింత యెఱుంగవే? యది యట్లుండె నా తెఱం గవధరింపు; మేను దొలుమేన నొక్క శూద్రుండ ధనవంతుండ. 324
సీ. ఆచారహీనత యతిలోభ మన్యధ | నాపేక్ష క్రూరత యవినయంబు
మొదలైన దుర్గుణంబులకు నెల్లను నెల | వైయుండి మాతకు నధికభక్తిఁ
బ్రీతి యెప్పుడు నొనరింతు; బ్రాహ్మణమాత్రుఁ | డతిథి యొక్కరుఁ డొక యప్పు డరుగు
దెంచిన నతనిఁ బూజించితి నది కార | ణముగ జాతిస్మరణంబు గలిగె
 
తే. మంచికర్మము సుఖము నొందించు టిపుడు | గాన వచ్చె మునీశ్వర! కరుణ నాకు
నత్తెఱం గెఱింగింపవే!’ యతివిశదము | గాఁగ ననవుడు నాతండు గారవమున.
325
వ. ఆ జంతువుం గనుంగొని ‘నీవు సెప్పనేల? దుష్కర్మకోటివలనం గీటంబ వగు టెఱింగితి భవదాచరితంబు లైన సత్కర్మంబులుం గాంచితి నమ్మేలునకు సంతోషించి కాదె నీతో సంభాషించితి! మదీయ తపోవిశేషంబున నీదయిన కీటత్వం బపనయించెద విషాదం బపనయింపుము; తపోబలంబును గడచినబలంబులుం గలవే? మనుష్యజన్మంబు నొంది మేలొనర్చెద ననుకోర్కి నీకుం బుట్టుట మేలు; మానవులకుం గర్మభూమికృతంబులైన సదసత్కర్మంబులం జూవె దేవతలును గీటంబులు నగుట వాటిల్లెడు’ నని పలికి వెండియు. 326
క. సుకృతము లమ్మెయిఁ గల్గుట | నకట! జనిస్మృతియుఁ గల్గె నస్మత్సంద
ర్శకతయు నీకు నొదవె నో | డకు మున్నతపదము నిచ్చుటకు మెయికొంటిన్‌.
327
వ. అత్తెఱం గాకర్ణింపుము. 328
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )