పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
వేదవ్యాసుఁడు గీటంబునకు నుత్తమజన్మంబులు గలుగ ననుగ్రహించుట (సం. 13-180-1(కుంభ))
ఆ. నీచ శూద్రవైశ్య నృపజన్మములఁ గ్రమ | వృత్తి నొందు మెపుడుఁ జిత్తమునకుఁ
బు ట్టెఱుంగునట్టి పోఁడిమి నొసఁగితి | ధర్మపరుఁడు వగుదు దానఁ జేసి.’
329
క. అని సాత్యవతేయుఁడు గృప | నెనసి సుధాధారఁ బోలు నీక్షణముం ద
త్తనువున నిగిడించిన న | మ్మునిపతిఁ గీర్తించె భూతములు ప్రీతములై.
330
క. అక్కీటంబును భక్తిన్‌ | మ్రొక్కి శిరం బతని పాదముల మోపి మనం
బెక్కుడు ప్రమోదమునఁ గడుఁ | జొక్కఁగఁ దదనంతరమ యసువులం దొఱఁగెన్‌.
331
వ. కారుణికత్వధుర్యుం డగు నప్పారాశర్యుం డట్లవలీల మేలొనర్చి కీటంబుం గృతార్థంబుంజేసి నిజేచ్ఛం జనియె నదియు నమ్మహానుభావు నిర్దేశించిన తెఱంగున జనియించుచు ననేకపుణ్యంబు లాచరించుచు నృపజన్మంబునం బూజ్యంబైన రాజ్యంబు నొంది. 332
సీ. ఏనుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ | రాఁ దురంగంబుల రమణ యొప్ప
గొడుగులుం బడగలు ముడివడ గాయక | వందిపాఠకుల రవంబు లెసఁగ
భూషణంబుల రత్నపుంజంబు దీప్తులు | దిక్కుల నెల్లను దీఁటుకొనఁగ
సామంతకవిజన సీమంతినీముఖ | పరివారవైభవస్ఫురణ మలర
 
తే. దేవపతి వోలె సాత్యవతేయు నాశ్ర | మమున కేతెంచి తత్పాదకమల మాత్మ
ముకుట సంగతముగఁ జాఁగి మ్రొక్క గరుణ | నాతఁ డెత్తి తన్మస్తక మక్కుసేర్చె.
333
వ. ఇ ట్లత్యాదరంబున సంభావించి శిష్యజనంబు నియోగించి. 334
క. రాజన్య సముచితంబగు | పూజావిధి యాచరించి పురుషోత్తమ! నీ
వీజన్మంబున సన్ముని | రాజికి వెఱఁ గగు తపశ్చరణ మొందవనా!
335
క. గోవులకై యొండెను వి | ప్రావలికై యొండె నిర్భరాహవకేలీ
ప్రావీణ్యము మెఱసి విడువు | నీ వసువులు దాన నధిక నిర్మలత యగున్‌.
336
వ. ఇట్లు నిష్యల్మషత్వంబు సిద్ధించిన. 337
క. ధరణీసురజనన మహిమ | దొరకొను నీ ‘కని విధించి దుర్దాంతరిపు
స్ఫురణహరణపరిణతు న | న్నరపతి వీడ్కొల్పె మునిజనంబులు వొగడన్‌.
338
తే. అతఁడు నానంద సంభరితాంతరంగుఁ | డగుచు దండప్రణామంబు లాచరించి
యరిగి యమ్ముని చెప్పిన యట్ల చేసి | భూమిసురజన్మలాభంబుఁ బొందె నధిప!
339
వ. ఇవ్విధంబున సద్ద్విజుండై. 340
క. పుణ్య స్థలముల నెల్ల న | గణ్యము లగు యూపములు ప్రకాశములుగఁ గ
ర్మణ్యతయు వివిధ రత్న హి | రణ్యాదిక దానములును బ్రస్తుతి కెక్కన్‌.
341
తే. అధ్వరంబు లనేకంబు లాచరించి | యతఁడు మఱియును బాదరాయణునిఁ గాంచె
సదయచిత్తత నప్పరాశరసుతుండు | వీడుకొలుపంగఁ జని యశోవిభవ మెసఁగ.
342
క. వ్రతశీలతఁ బరఁగి తుదిన్‌ | శతమఖునకు నగ్గలంపు సఖుఁడై యమరా
ర్చిత సంస్తుతభవ్యపద | స్థితి నవ్యయ పరమసౌఖ్య సిద్ధిం దనరెన్‌.
343
వ. అని చెప్పి భీష్ముండు. 344
క. మనుజేంద్ర! కురుక్షేత్రం | బున నద్భుతఘోరసమరమున నమ్మాడ్కిం
దనువులు దొఱఁగిన నృపులకు | ననంత సుఖగతులు గల్గు టనుమానంబే?
345
వ. భవదీయబంధు లందఱు నూర్ధ్వలోక ప్రాప్తుల; నీ వేమియు ననుమానింపకు’ మని పలికినం బాండవాగ్రజుండు పరమసంతోషభరితాంతఃకరణుండై సురసరిత్సూనుతో ‘విద్యా తపోదానంబులలో నెయ్యది విశేషం బెఱింగింపవే!’ యనుటయు నమ్మహీపతి నమ్మహామతి గౌరవంబునం గనుంగొని. 346
తే. ‘వ్యాసమైత్రేయ పుణ్యసంవాద మనఘ! వినిన నీ ప్రశ్నమున కది విశదమైన
యుత్తరంబగు నేకాగ్రచిత్తవృత్తి | వగుమ! నీ ‘వని పల్కి యిట్లనియె నధిప!
347
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )