పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - చతుర్థాశ్వాసము
వ్యాసమైత్రేయ సంవాదము భీష్ముఁడు ధర్మరాజునకుఁ జెప్పుట (సం. 13-182-1(కుంభ))
సీ. ‘వ్యాసమునీంద్రుండు వారాణసీపురి | కరిగి మున్‌ మైత్రేయుఁ డచట నునికి
నాతని యున్నెడ కప్రకాశతఁ జన్న | నెఱిఁగి యమ్మహితాత్ముఁ డెఱఁగి భక్తిఁ
బూజించి యుత్కృష్టభోజనంబునఁ దృప్తి | సేసిన నధికవికాసరుచిర
ముఖుఁడైన యమ్మహామునిఁ జూచి ‘మోదమ | గ్గలమయి మీయందుఁ గానఁబడియెఁ
 
తే. గారణంబేమొకో?’ యని గారవమున | నాతఁ డడిగిన నతఁ డధికాదరమునఁ
‘దపము శ్రుత మాదిగాఁ గల ధర్మకోటి | లోన నెల్లను నధికంబు దాన’ మనియె.
348
వ. అని మఱియును. 349
క. ‘దానార్హవస్తువులలో | మానిత మన్నంబ యన్నమయము లసువులున్‌
మేనుఁ దదీయబలంబును | గాన బుధులు దానిఁ దద్ద గైకొండ్రు మదిన్‌.
350
క. తప ముల్లము కల్మషముల | నపగతములఁ జేయు విద్య కాస్పదమగు నా
తపసి మహితదానంబున | నుపచితమగు విద్య దపము నుత్కర్షించున్‌.
351
క. కాన తపంబును విద్యయు | దానౌదాత్త్య ప్రవర్ధితంబులు విద్యా
నూనత్వం బచ్యుతు గను | దానికి దీపంబు సద్వ్రతప్రవణులకున్‌.
352
ఉ. కావున నన్నదానమునఁ గా కెటలుండు మహాప్రమోద? మ
త్యావిలచిత్తుఁ డైనను మహత్తరదానమునన్‌ విశుద్ధ స
ద్భావత నొందు నిక్క’ మని పల్కె నరేంద్ర! తపంబు విద్యయున్‌
దైవత పూజనీయములు దానము వానికిఁ బోషకంబగున్‌.’
353
క. అని శాంతనవుఁడు సెప్పిన | విని కౌంతేయాగ్రజుండు ‘విమలమతీ! యం
గనల సమాచారంబులు | వినంగ నే వలతుఁ జెప్పవే తెలియంగన్‌?’
354
వ. అనిన నతండు ‘కైకేయీ శాండిలీ సంవాదంబున నిది దెల్లంబగుఁ జెప్పెద విను’ మని యిట్లనియె. 355
తే. సుమన యనియెడు కైకేయి యమరపురము | నందు శాండిలిఁ గని ‘భవ్యమైన దివ్య
పదవి యే వర్తనమునఁ జొప్పడియె నీకు? | నతివ! చెప్పుము నా కని యడిగె నధిప!
356
వ. అని యడిగిన యాయమ కయ్యంగన యిట్లనియె. 357
సీ. ‘మామకు నత్తకు మార్పల్క, దేవ పి | త్రతిథిపూజనములయందు సొలయ,
నిలువడిఁ దలవాకి లెప్పుడు నెఱుఁగక | పెలుచ నవ్వక శుద్ధి వెలయ విప్ర
భిక్ష యోపిక కల్గి పెట్టుచు వర్తింతు | వలయు కార్యములకు వెలఁది! మగుడఁ
బతివచ్చునప్పుడు భక్తియు వేడ్కయుఁ | బొదల నాసనపాద్యములను సుముఖ
 
ఆ. భావమునను సేవ వాటింతు, బిడ్డల | శిక్ష వదలఁ, దిట్టఁ జెట్టఁ గనియు,
నాకు వేఱ ప్రియ మనఁగ లేదు; పతిమెచ్చు | వంటకములు చవిగ వండి యిడుదు.
358
చ. వరుఁ డొక వెంట నెన్నఁడు ప్రవాసగతుం డగు నాఁటఁ గోలె న
ప్పురుషుఁడు వచ్చునంతకును బూవులు పూఁతలు మేలిచీర లా
భరణము లెక్కుడుం జవులపాకవిశేషము లాదరింప నె
ప్పరుసునఁ గొల్చుఁ గూడురువ బంధులకున్‌ దగ నెమ్మి సల్పుదున్‌.
359
క. గోవులు మొదలగు తిర్య | గ్జీవుల సుఖవృత్తు లరసి చెల్లింతు గృహ
శ్రీ వర్తనంబునకుఁ బతి | భావము సంకటపడంగఁ బలుక నొకటియున్‌.
360
తే. అగ్ని యోపి రక్షింతు రహస్యమైన | దాని వెలిపుచ్చ గర్భంబు దాల్చియున్న
యపుడు వాచవు లెల్లను నవులఁ బెట్టి | దాని కెయ్యవి పథ్యముల్‌ వానిఁ గొందు’.
361
క. అని చెప్పి యట్టి చందం | బున నడచిన సతికి లోకములు రెండును సౌ
ఖ్యనిరూఢి యొసఁగు; బొగ డొం | దు నరుంధతి వోలె నవ్వధూటి నరేంద్రా!
362
క. ‘నృప! యీ యాఖ్యానము ప | ర్వపు దినమున భక్తిఁ జదువువారలు విను పు
ణ్య పురుషులును నాయుశ్శ్రీ | లపరిమితము లొంది యమరు లగుదురు పిదపన్‌
363
వ. అనిన విని ధర్మనందనుండు ‘సర్వశాస్త్రసారంబై శ్రేష్ఠంబగు ననుష్ఠేయం బెయ్యది? పితామహా! యనుగ్రహింపు’మని యభ్యర్థించిన నాపగేయుండు కృపావిధేయుండై ‘నారదపుండరీక సంవాదం బాకర్ణింపుము దాన నీయడిగిన యర్థంబు తెలియును దీర్థపరుండును జపతత్పరుండును బుండరీకాభి ధానుండును నైన మహాద్విజుం డొక్కయెడ నారదమహామునిం గని భక్తింబ్రణతుండై యిత్తెఱంగునన యడుగ నతం డతని కిట్లనియె. 364
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )