పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి వర్ణకర్మ పరిపాకంబుల తెఱం గెఱింగించుట (సం. 13 అను 1-15-1525)
వ. అనిన విని యపర్ణాదేవి ‘వర్ణంబుల కర్మంబులు పాకంబుఁ బొందు ప్రకారంబు చెప్పు’ మని య ప్పరమేశ్వరు నడిగిన నతం డిట్లనియె. 080
చ. ‘తమ తమ కర్మముల్‌ తెరువు దప్పక చేసినవారు దేవలో
కమున సుఖంబు పొందుదురు; క్రమ్మఱి వచ్చియుఁ బూర్వజాతి జ
న్మమున మహర్థిఁ బొందుదురు; మానిని! యిమ్మెయిఁ దప్పి యెట్టి కృ
త్యములఁ జరించి రజ్జనుల కట్టి కులంబునఁ బుట్టు వాటిలున్‌.
081
క. ఎంతెంత మేలు చేసిన | నంతంతియ కులము నెక్కుడై సమకూరుం
గాంతా! విప్రుఁ డయిన న | త్యంతానంద మగులోక మతనికిఁ గలుగున్‌.’
082
వ. అని చెప్పి మఱియును. 083
ఉ. ‘ఆపదఁ దూలపోక సిరి నంది మదింపక శౌర్యవృత్తిమైఁ
బాపుల గెల్చి యార్జవము బంధుజనాలికి నార్యకోటికిన్‌
జూపుచు దీనులం గరుణఁ జూచి తగం గలమాత్రఁ బ్రోచుచున్‌
గోపము లేక మన్కి గలుగున్‌ దివిజాంశమునన్‌ జనించినన్‌.’
084
క. అనిన విని గౌరి ‘కొందఱు | మనుజులు సంపద సుఖించి మనఁ గొందఱు లే
మి నలంగి దుఃఖ పడుదురు; | విన వలతుం గారణంబు; వినిపింపు శివా!’
085
చ. అనుటయు శంభుఁ డిట్లను ‘దయన్‌ బలి భిక్షము పెట్టలేమిఁ గుం
దిన చెలిఁ జుట్టముం బిలిచి దీనత వాపి యపాపవృత్తిఁ జె
ల్లిన తొలుబాము గల్గునరు లెస్సగ మంచు విధాత; నిష్కృపా
త్ముని నతిలోభ దూషితుని దుర్గతి దుఃఖితుఁ జేయుఁ బార్వతీ!’
086
క. విను మలుకయుఁ గూర్మియు లే | వనవద్యా! యెజ్జనంబులందును విధికిన్‌
మును చేసిన కర్మము ఫల | మనుభవ గోచరము సేయు నంతియ తఱితోన్‌.’
087
వ. అని యెఱింగించి వెండియు. 088
ఆ. ‘ధనము గలిగియుండి ధవళాక్షి! కుడువక | కట్టకుండు పరమకష్టజనము
లొరువు లొత్తిచెప్పనుపకారులై తొలు | పుట్టునందు మనిన యట్టివారు.
089
ఆ. తమకు ధనము లేక తగు భోగముల కెవ్వ | రైన నడప మను సుఖాఢ్యజనులు
తొల్లి పేదవార లుల్ల మర్థుల కెప్డుఁ | బెట్టఁగోరుచుండి నట్టివారు.
090
సీ. ఆయాసపడకుండ నర్థంబు చేరెడు | వారు పాత్రజనంబుఁ దార పిలిచి
తొలుమేనఁ బెట్టిన యలఘు దయాఢ్యులు; | ధనసిద్ధి బహులయత్నమునఁ గలుగు
మనుజులు పూర్వజన్మమున నర్థులు దమ్ము | నడుగ దాఁపక యిచ్చినట్టి వార;
లాయాసమునను విత్తాగమం బెడలెడు | జనులు ముందరి పుట్టువునఁ గృపా వి
 
తే. హీనులై యాచకుల నలయించి పిదప | నిడని లోభులు; ముదిసి ధనేశుఁడగు న
రుండు ప్రాయంబునాఁ డీక గం డడంగి | తొంటి భవమున నీగికిఁ దొడఁగి నతఁడు.
091
తే. కలిగియుండియుఁ దెవుళుల కతన భోగ | ములు భుజింపఁగలేని మర్త్యులు, గిరీంద్ర
తనయ! తొలుమేన రోగముల్‌ దనికి చచ్చు | నపుడు దానంబుసేసిన యట్టివారు.
092
తే. అధిక సౌందర్యములు గలయట్టి జనులు | తొల్లి మాంసభోజనములఁ దొఱఁగియున్న
వారు రూపవిహీనులు దారు రూపు | గలిగి తొలుమేనఁ గొనటులఁ బలికినారు.
093
క. విను సౌభాగ్యసమేతుఁడు | మును నిజదారైకపరుఁడు; ముందటి జన్మం
బున భార్యకుఁ బ్రీతి యొన | ర్పని మనుజుఁడు సుభగతావిరహితతఁ బొందున్‌.
094
క. అమితజ్ఞానము విజ్ఞా | నముఁ గలిగియుఁ బేదయైన నరుఁడు చనిన జ
న్మమున వినికి గలిగియు దా | నము తెరువునఁ బోనివాఁడు నళినదళాక్షీ!
095
క. తగుబుద్ధిలేక సంపద | మిగులఁ గలుగు నరుఁడు తొంటిమేనఁ గరుణమై
విగతప్రజ్ఞుం డయ్యును | దగ దీనులఁ బ్రోచినతఁడు దళితాబ్జముఖీ !
096
సీ. మేధావియై విన్కి మిగిలి విద్యలఁ బొల్చు | నరుఁడు దొల్బామున గురున కధిక
భక్తుఁడై తనదైన పాండిత్య మొరులకుఁ | గావించు వేడుక గలుగు సుజనుఁ;
డభ్యసింపంగ విద్యాయుక్తి లేకుండు | నాతఁడు తొల్లి విద్యాధికత్వ
మున గర్వియై శిష్టజనులకు సభ భంగ | మొనరించి కుందఁజేసిన యతండు;
 
తే. భార్యయును బిడ్డలును దాను బహుధనముల | భోగులై రోగములు లేక పొల్చువార
లమలినాచార పాత్రదానములు సత్య | కరుణలును దొంటి భవమునఁ గలిగినారు.
097
ఆ. ఆలుబిడ్డ లొఱటులై లేమిఁ గుందుచుఁ | దెవులుచేతఁ బడుచు నవయు జనులు
మున్ను క్రోధలోభముల నాస్తికతఁ బర | పీడనంబు చేసి పేర్చినారు.
098
సీ. కాంత! జాత్యంధుండు గన్నులు చెడువాఁడు | తన యొప్పు మెఱయుచుఁ దగిలి యొరుని
వనితఁ దొల్మేనఁ జూచినవాఁడు, కర్ణరో | గార్తుండు కటుక వాక్యములఁ దొల్లి
శిష్టు నొప్పించిన కష్టుండు, కడుపునఁ | దెవులైనతఁడు పూర్వ భవమునందు
గరదుండు, గోశ మశ్మరిని శర్కరను బా | ధితుఁ డగు నరుఁ డన్యసతిని గన్య
 
ఆ. మహిషి గోవుఁ దురగి మదనాతురత మున్ను | గవిసినాఁడు, శోషి దివిరి యొరువు
లనుభవింపఁ దెచ్చుకొనిన మాంసము దొంటి | పుట్టువున హరించినట్టి నీచు.
099
ఆ. ఉలుముగొన్నవాఁడు తొలుమేన నాఘాత | బంధనముల నొరుల ప్రన్నఁదనము
చెఱచినాఁడు, పంగు వొఱవగఁ గాలుసే | విఱిచి సాధుజనులఁ బఱిచినాఁడు.
100
క. పిలకాదులఁ గంతులచే | నలమటఁ బడువారు బడియ నడిచియు ముష్టిం
జలమునఁ బొడిచియు సాధులఁ | దొలుబామున నొంచినట్టి దుష్టచరిత్రుల్‌.
101
ఆ. పాదరోగు లశుచి పదముల దేవాల | యములు మెట్టుటయును నసదువారిఁ
దప్పులేక క్రొవ్వి తన్నుటయును దొలు | పుట్టునందుఁ గలిగినట్టివారు.
102
చ. జ్వరమున గుల్మపీడ నతిసారములన్‌ బలుపుండులన్‌ మహో
దరమున వాతపిత్త కఫదారుణ రోగములన్‌ నిరంతరా
తురు లగువారు నిర్దయతఁ దొల్లి వినోదము గాఁగ జీవులం
దరమిడి చంపినారు గురుఁ దల్లడ పెట్టినవారు పార్వతీ!
103
తే. గూనివాఁడును బిచ్చుకకుంటు గుజ్జుఁ | గొలుచు లమ్ముచోఁ గ్రచ్చులు గలిపి సరకు
దూఁచిపెట్టెడు చోటులఁ దూన్కి దరపి | పూర్వ భవమున లాభంబుఁ బొందినారు.
104
సీ. వెఱ్ఱులు తొలుమేన వెడ్డున సాధుజ | నము మోసపుచ్చి ధనంబు గొన్న
జను లనపత్యులు విను తొల్లి పితృకార్య | దూరులు బాలఘాతులును జువ్వె;
పొలఁతి! నపుంసకుల్‌ పూర్వభవంబున | నెద్దుఁ బట్టిన వారు నేమి తప్పుఁ
బొరయకుండఁగఁ గోపమునఁ ద్రికచ్ఛేదంబు | గావించినారును, గామ సుఖము
 
తే. విఘ్నపఱిచిన తులువలు, విధవ తొంటి | జన్మమునయందు భర్తృవంచన మొనర్చి
ధనము గూర్చిన యదియు మదంబు పేర్మి | నోర్తుమగని హరించిన యుగ్మలియును.
105
తే. ప్రయతులై పుట్టి యేవంపుఁబనులఁ గడుపుఁ | బ్రోచికొనువా రహంకారమునను గర్వ
మాన మద దంభములఁ దొల్లి మాన్యజనులఁ | బరిభవించిన తుచ్ఛులు పద్మనయన!
106
సీ. దాసత్వ మొంది యదల్పులఁ దిట్టుల | నాటులఁ బడుచుండునట్టి నీచు
లప్పాటఁ దొలుమేన నతి గర్వులై ప్రల్ల | దమ్మునఁ బెక్కండ్రఁ దప్పులేక
తిట్టియు నడిచియుఁ దిరిగినవార లా | పొలువలపైఁ గృపగలిమి మేలు
ధనిక గృహద్వారమునఁ బ్రతిహారి ద | మ్మాఁగంగ నుండి దైన్యమున దుఃఖ
 
తే. పడు జనంబులు భోగైకపరతఁ దొలి || మాననీయుల కవసర మీని వారు
రాజదండితుఁ డకృతాపరాధుఁ గ్రూర | దండ దూషితుఁ జేసినతండు సూవె!
107
తే. విను నష్టసకలధను లగు | జనములు నిక్షేప మిడిన సరకులు దొలుబా
మున మగుడ నీక నెపమిడి | కొనినట్టి యసత్య లోభ కుత్సితు లతివా!
108
క. తమబంధులుఁ దారును నొ | క్కమరియ తెగటాఱువారు కరుణారహిత
త్వమునఁ దొలుమేన వెడపగ | నమేయ నరవధము సేసినట్టి దురాత్ముల్‌.’
109
వ. అని యెఱింగించి యీశ్వరుం డీశ్వరితో నిట్లనియె. 110
సీ. ‘ఇంతి! నా చెప్పిన యిప్పాపకర్ములం | దఱకును నరకంబు దప్ప; దందుఁ
బడుపాటు లెల్లను బడివచ్చి నరులైన | యప్పుడు వాటిల్లునట్టి తెఱఁగు
లివి; యట్లు గాకయు నెక్కుడుగాని పా | పంబుల మానుషభవము గలుగు
నిట్లైన నమ్మేన నే కర్మమున ఫల | మైనను మానవు లనుభవింప;
 
ఆ. రోపి మునులు దేవయోనులు నత్తను | వునన తపము ఫలము లనుభవింతు’
రనిన దేవి ‘యెఱుఁగ నయ్యె మీదయఁ బెక్కు | లర్థములు గృతార్థ నైతి’ ననియె.
111
వ. అని వెండియు న ద్దేవునితో ‘మనుజు లపరజన్మంబునంగాని కర్మఫలంబు లనుభవింప రంటిరి; తప్పు చేసిన నరుల నరపతు లిట్టి తప్పున కిట్టి దండంబను నిరూపణంబున దండించెద రని యక్కర్మంబు ఫలం బప్పుట్టువునన యనుభవించుట గాదె?’ యనిన గౌరికి గంగాధరుం డిట్లనియె. 112
సీ. ‘జనపతుల్‌ దమ రాజసంబున దండించి | నారుగా నొల్లక నరుల తప్పు
లకుఁ దగు దండంబు లన వారిఁ బఱతురు; | తక్కొరు లెవ్వరుఁ దప్పుసేయ
వెఱచుటకై యట్టి విధి మూఁడుటది పూర్వ | కర్మంబువలనన కాని, యపుడు
గలిగిన తప్పునఁ గా’ దన్న నాదేవి | ‘యవనీశ దండితుఁ డైన నరున
 
తే. కఘము వాయునొ? పాయదో?’ యనిన నీశ్వ | రుండు ‘నృపదండితుఁడు యమదండమునను
బడఁడు; లేని తప్పున నరుఁ బఱిచినతనిఁ | బఱుపకున్నాతనిని యమబాధ వొందు.’
113
వ. అని నిర్దేశించి వెండియు. 114
క. ‘విను తమ చేసిన కర్మం | బున ఫల మెవ్వరికిఁ ద్రోచి పుచ్చఁగ రా; దె
ట్లును గుడువక పో’ దది యన | విని పార్వతి యిట్టు లనియె విభునకుఁ గృష్ణా!
115
తే. ‘కర్మఫలములు గుడిచినఁ గాని పోవ | వంటి; వానిఁ బ్రాయశ్చిత్త మపహరించు
నందు; రశ్వమేధంబున నఖిల పాప | ములును జెడు ననఁగా విందు భూతనాథ!’
116
వ. అని పలికి ‘యిది యెట్లొకో?’ యనుటయు భవుండు. 117
ఆ. ‘అతివ! కామకృతములైన కర్మంబుల | ఫలము లనుభవింప వలయు; వినుమ
కామకృతము చెడుట గలుగుఁ బ్రాయశ్చిత్త | మాచరింప సంశయంబు వలదు.
118
క. కావునఁ గుడువక పొలియదు | దేవాసురమునులకైన దేవీ! కర్మో
ద్భావితఫల మీయర్థము | నీవలవఱపుము భవన్మనీషఁ దిరముగన్‌.
119
వ. అని చెప్పి య ప్పరమేశ్వరుండు వెండియు. 120
క. సుకృతముల నరుఁడు నాకము | నకుఁ జను; నవి గొంచెమైన నరుఁడ యగును; వా
నికి దివి కేఁగి డిగిన యత | నికి మానుష వైభవములు నెఱయం గల్గున్‌.’
121
తే. ‘నాతి! విను గ్రహచారంబు హేతువులుగ | నశుభములు శుభములు నరుఁ డాచరించు;
గ్రహము చేయించునే? తాన కాక చేఁత | కొడయుఁ డటుగాన ఫలములు గుడువ వలయు.’
123
వ. అనినఁ ‘జా వనునది యేమి?’ యని యుమ యడుగ నీశానుం డిట్లనియె. 124
తే. ‘నిత్యుఁ డాత్ముండు; దేహ మనిత్య; మతఁడు | ముదిమిఁ దెవులున వికృతమై యది వికలతఁ
బొందుటయు, దానిఁ దొఱఁగి తాఁ బోవునట్టి | దశకు మరణ మ న్పేరయ్యెఁ దనులతాంగి!
125
క. జీవుఁడు జీర్ణ శరీరముఁ | బోవిడిచి నవంబుఁ బొందఁ బుట్టను పేరం
దా వెలయుం దద్దశ జీ | వావలి వర్తించు నిటు గతాగతపరయై.’
126
వ. అనిన విని పార్వతి శర్వునితో ‘బాలురు చచ్చుటకును వృద్ధులు పెద్ద కాలంబు బ్రదుకుటకును గారణం బేమి?’ యనుడు నతండు. 127
తే. ‘మేను జీర్ణముగాఁ జేయుఁ గాని మరణ | మొందఁ జేయదు విను కాల మెందు నరుని
పూర్వకర్మంబు లాయువుఁ బొదలఁ జేయ | సన్నముగఁ జేయ బ్రదుకును జావుఁ గలుగు.’
128
వ. అని చెప్పిన ‘నాయు వేమిటం బెరుఁగు? నెద్దానం దఱుఁగు?’ ననిన విని యుమకు నుమాపతి యిట్లనియె. 129
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )