పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి స్వప్నాదుల తెఱం గెఱింగించుట (సం. 13- అను -15-2457)
వ. అని తెలిపిన గౌరి ‘కల యనునది యేమి? యెఱింగింపవే’ యనుటయును నతండు. 152
ఆ. ‘స్వప్న మనఁగ సుప్తజనము మనశ్చేష్ట | యదియుఁ గాంచు నొగి ననాగతములఁ
గానఁ గలలు సూచకము లగు భావి శు | భాశుభోదయముల కనుచుఁ జెప్పె.
153
వ. చెప్పిన విని భవాని భవునితోడ. 154
సీ. ‘దైవంబొ? కర్మవర్తనము జనంబు ను | త్సాహంబొ?’ యనిన ‘ నతండు దైవ
మోపి కర్మంబు సేయుట లేదు దైవసం | కలన ఫలం బిచ్చుఁ గాని వినుము
దేవి! పూర్వకృతంబు దైవనామకమునఁ | బరఁగు; నప్పటి చేఁత పౌరుషంబు
కృషివోలె నుండుఁ; బౌరుష గతి వర్ష స | ద్వాయువులట్ల దైవ ప్రకార
 
తే. మెఱుఁగు ఖనన మథనముల నెట్లు జలముఁ | జిచ్చుఁ బుట్టు నమ్మెయి నరుచేష్ట దైవ
యోగమున సిద్ధిఁ బొందు నుద్యోగ రహితుఁ | డెత్తెఱంగున దైవ సమృద్ధిఁ బడయు.
155
క. కావున నుద్యోగంబును | దైవంబును గారణములు దామరసాక్షీ!
యే విధమునఁ గర్మముల ఫ | లావాప్తికి దీన సంశయము వలదు సుమీ!’
156
తే. అనిన నంబిక ‘గర్భంబు నాత్ముఁ డెట్లు | చొచ్చు?’ ననవుడు నభవుఁడు ‘సురత బీజ
రక్త దైవముల్‌ సూవె కారణము లాత్మ | గర్భ సంవేశనమునకుఁ గమలనయన!
157
క. మాయారహితుఁ డహంకా | రాయత్తతఁ జూవె పుట్టువను చెఱఁబడి నా
నాయాసంబులఁ బడు నా | జ్ఞాయుతుఁడై యాత్ముఁ డింత చర్చింపు మదిన్‌.’
158
సీ. అని చెప్పి ‘దైవరహస్యంబు వినిపింతు | విను’ మని పలికి యిట్లనియె శివుఁడు
‘తొల్లి మనుష్యులు తొలుమేని కర్మంబు | లెఱుఁగఁగాఁ జాలుట నెల్లవారు
మేలుసేయఁగ ననిమిషలోకమున నధి | కంబగు సందడి గాఁగ మనుజు
లమరులై పేర్చిన’ నజుఁడు వేల్పుల సంక | టము వాయుటకు నుపాయము దలంచి
 
తే. మానవుల కయ్యెఱుకకల్మి మాన్చి కామ | రోషముల నొలయించిన దోషకృతుల
వారు నరకాది సమ్మర్దకారు లగుడు, | నదియుఁ గాదని చింతించి యనువు గాంచి.
159
క. సరిగా నా రెండెడలకు | నరులు సనుట గోరి మనమునం గానమియుం
బరలోక విధము శాస్త్రము | వెరవునఁ గనుటయు నొనర్చె విధి వారలకున్‌.’
160
వ. అనినం బార్వతి ‘పునర్జన్మంబు గలదు లేదను సంశయంబుతోన పొట్టు పొరలగుదురు నరులు; దాని తెఱంగు నిశ్చయింపవే’ యనుటయు నంధకారాతి యిట్లనియె. 161
క. ‘కలదో లేదో యనియెడు | తలపోతయ కాని నిశ్చితము గాదు సురా
దులకుఁ; బునర్జన్మంబుల | కలిమియు లేమియును నరులు గానమి దప్పే.?
162
క. కల; దది యూరక కానఁగ | నలవియె? శ్రుతివాక్యసమితి యర్థంబులపై
నిలిచిన శ్రద్ధం గ్రమమున | దెలివొందినఁ గాక యెట్టి ధీమంతులకున్‌.’
163
వ. అనిన విని గౌరి గంగాధరున కిట్లనియె. 164
క. ‘మృతులైనవారలు నిరా | కృతులై యుండుదురు; వారిఁ గీనాశ భట
ప్రతతి కొని చనుట, యా పితృ | పతి శాసించు టవి యెట్టి భంగులు దేవా!’
165
వ. అని యడిగిన న ద్దేవుం డిట్లనియె. 166
సీ. ‘తఱియైన మనుజులఁ దనువులు విడిపించి | మాయాశరీర సమన్వితులుగ
నొనరించి దూతలు గొనిపోదు; రందును | ధర్మవర్తుల సుగంధంబు మృదువు
నైన మార్గమున, మధ్యపువారి నిర్బాధ | సరణిఁ, బాపాత్ముల బరుసఁదనము
ముఱికియుఁ గల పథంబున నడపింతు, రి | ప్పరుసునఁ జని పితృపతికిఁ జూప
 
ఆ. నతఁడు పుణ్యలోక గతియును మానవ | త్వంబు ఘోరనరక వాసమును వి
ధించి పుచ్చు వారిఁ దెలచి మన్నించి భ | ర్జించి వరుసతోడఁ జిగురుఁబోఁడి!’
167
వ. అని చెప్పిన నగేంద్రతనయ చంద్రశేఖరుని తోడ. 168
క. ‘నరకం బెట్టిది? కల్మష | కరులన్‌ జముఁ డెట్టి భంగిఁ గాఱియఁ బెట్టున్‌?
వరదా! చెప్పు మనుడు న | ప్పురహరుఁ డిట్లనియె వృష్ణిపుంగవ! ప్రీతిన్‌.
169
సీ. ‘రౌరవం బనఁగ ధరాస్థలిక్రింద మ | హారౌరవం బన నవుల దాని
కావల విను కంటకావనంబన నుండుఁ | గ్రమవృత్తిఁ బేర్చు దుఃఖములు గలిగి
యగ్నికుండంబునా నటఁ బంచకష్టంబు | నాఁగల విట్లున్న నరకతలము
లై దందుఁ బాపక్రియా తారతమ్యంబు | లూహించి యంతకుం డునుపఁ బనుచుఁ
 
తే. దగిన యెడలఁ బాపాత్ములఁ దధ్భటాలి | దహన కర్తన బంధన తాడనములఁ
బఱుప వారలఁ గుక్కలు గఱచుఁ’ గ్రిములు | దొలుచు’ గ్రద్దలు నొప్పించుఁ దుండనిహతి.
170
వ. మఱియును యమదూత వ్రాతంబు నానావిధ వేదనలం బెట్టి దండించుచుండు. 171
ఉ. అమ్మెయిఁ బాపముల్‌ వొలియునంతకు దుఃఖము లంది కీటజ
న్మమ్ములఁ బక్షియోనులఁ గ్రమంబునఁ బొంది మృగత్వ మానుష
త్వమ్ముల నోలిఁ బొందుదురు వా రిను మెంతయుఁ గ్రాఁగి కల్మష
త్వమ్ము దొఱంగుమాడ్కి నవతామరస ప్రతిమాన లోచనా!’
172
వ. అనిన విని పార్వతి ‘పాపంబు లనునవి యెట్టివి? యెఱింగింపవే’ యనుటయు నీశానుం డిట్లనియె. 173
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )