| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘మానిని! త్రివిధముల్ మానస వాచిక | కాయికంబులఁ బాతకంబు; లందుఁ బరధనాపేక్షణ పాపానుమోద ధ | ర్మద్వేష ముఖములు మానసంబు; లనృత దారుణ భాషణాదులు వాచిక | ములు; వధంబును బంధమును నభక్ష్య భక్షణంబును నన్యభామారతము మద్య | పానంబు మొదలైన పాపకృతులు |
|
| తే. |
కాయికంబులు; విను మధికం బపేయ | పానమది దుష్కృతంబులలోన నెల్లఁ బానమున నిందతో వచ్చుఁ బ్రాణగొడ్డ | ములును జేటులు నరకాబ్ధి మునుఁగుటలును. |
174 |
| క. |
లోకము నిర్మర్యాద | త్వాకులమై చెడదె సజ్జనావలి మధుపా నాకాంక్ష దొఱఁగకున్న గు | ణా కల్పా! యేమిసేయ దక్కీడు నరున్? |
175 |
| క. |
కావున నే విధమున సుర | సేవింపక యుడుగుటొప్పుఁ జెలువ! సకల వ ర్ణావలికి దానఁ గీర్తి | శ్రీవైభవ పుణ్యగతులు సేర్చికొన నగున్. |
176 |
| క. |
అన విని యంబిక ‘సుకృతము | లనునవి యెట్టి?’ వని యడుగు నద్దేవికి ని ట్లనియెం జంద్రార్ధధరుం | డనుమోదోల్లాసి యగుచు నంబుజనాభా! |
177 |
| తే. |
‘ఔపరమికాభిధానంబు నంబుజాక్షి! | నిరుపకరణాఖ్యమును సోపకరణనామ కంబు నయి లోకమున సుకృతంబు పరఁగుఁ | ద్రివిధముల వానిఁ దగ వివరింతు వినుము. |
178 |
| సీ. |
ఔపరమిక మనునది పాపవర్జన; | మకట! కానఁగ నేర రజ్ఞజనులు; యత్నంబు వలదు; వ్యయం బేమియును లేదు | పరలోకభీతిఁ బాపములఁ దొఱఁగి నంతన సుగతి సౌఖ్యం బొడఁగూడెడు; | నదియు నాత్మాధీన; మట్టిదాని సుకరత్వ మెఱుఁగక చొత్తురు నరకంబు; | వెరవరుల్ శ్రుతమున వృద్ధయోగ |
|
| తే. |
మునను ధృతికల్మి నింద్రియ వినియమమున | నది దమకుఁ గలిగింతురు; యమ మనంగఁ బరఁగు నది దాన నాకంబుఁ బడయవచ్చు| ననినఁ జెప్పంగ నేల ధర్మాభియుక్తి. |
179 |
| ఆ. |
నిరుపకరణ మనఁగఁ బరఁగు శౌచంబు స | త్యంబు శాంతి దాంతి యార్జవంబు వ్రతనిరూఢి సముపవాసంబు బ్రహ్మ చ | ర్యంబు కల్మి నియమ మండ్రు దాని. |
180 |
| సీ. |
ఆభ్యంతరంబు బాహ్యము ననఁగా శౌచ | మిరు దెఱఁగై యుండు హృదయసుకృత మాభ్యంతరము విను మాహారశుద్ధియు | నంగశోధనము బాహ్యంబు సత్య మన్నది గన్నది విన్నది యున్న రూ | పున నుక్త మగుట యంభోజవదన! శాంతి బుద్ధీంద్రియ సన్నివారణ దాంతి | కర్మేంద్రియముల యోగ్యప్రవృత్తి; |
|
| తే. |
యార్జవము గుటిలుఁడు గామి యగు వ్రతంబు | మంచిపని పూని నడపుట యంచితోప వాస మశననిగ్రహ మనవద్యమైన | బ్రహ్మచర్యంబు గామునిబారిఁ బడమి. |
181 |
| ఆ. |
నాతి! తీర్థసేవనంబును నియమ వి | శేష మగుట దానిఁ జెప్పవలయు సకలనదులఁ దీర్థసంజ్ఞలు గల వబ్ధి | కరుగునట్టి విచ్చు నధికఫలము. |
182 |
| తే. |
వానియందును మునిపద మాననీయ | దేశములు నబ్ధిసంయోగ దేశములును దెలియు మన్యోన్యసంగమ దేశములును | బరమతీర్థంబు లగుఁ బద్మపత్రనయన! |
183 |
| క. |
వనధి మహాతీర్థం బం | దును సంయమివరులచేతఁ దొల్లి ప్రియమునం గొనియాడఁ బడిన చోటులు | విను ముత్తమ తీర్థములు వివేకాభరణా! |
184 |
| క. |
వెలి శుచియై మఱి తీర్థం | బులు సొచ్చుట మేలు నియమములు దీర్చి తగన్ వెలలిన యెడ దేవార్చన | ములు విప్రార్చన లవశ్యమును గృత్యంబుల్. |
185 |
| క. |
చేరువ తీర్థము కంటెను | దూరపుఁదీర్థంబు మేలు తోయజవదనా! శారీరాయాసము ద | త్కారణమై వేదవాక్యగతి యిట్లుండున్. |
186 |
| క. |
విను సోపకరణ మనునది | ధనధాన్యాదిక సమగ్రతను గృహమేధుల్ గొనియాడుతెఱఁగు దానం | బున వైదిక పైతృకాది పుణ్యక్రియలన్. |
187 |
| సీ. |
న్యాయార్జితంబైన యర్థంబు వేదవి | త్త్వము శాంతి మొదలగు వరగుణములు గల విప్రునకుఁ బుణ్య కాలపావన దేశ | కలితంబుగా భక్తి గలిగి యీగి మేలిదానము శక్తి మిగులుట శక్తికిఁ | దగుట దానికిఁ గడుఁ దగమి యుత్త మము మధ్యమము నధమము నగు దాన వి | ధానంబు విను మిట్లు దైవికంబుఁ |
|
| తే. |
బైతృకంబును లోనైన పనులఁ దాను | వేడ్కసేయు వస్తువుఁ గొను విప్రుకోర్కి కనుగుణంబగు నదియును నర్థి నిచ్చు | టధికతరమైన ఫల మిచ్చు నంబుజాక్షి! |
188 |
| తే. |
చేయు టెంతయు మేలైనఁ జేసి పిదప | వగచినట్టి దానము దనుఁ బొగడికొన్న దానవిధి నిష్ఫలంబులు గాన రెండు | నుడుగుదాత మహాఫల మొందఁ గాంచు.’ |
189 |
| వ. | అనుటయు దాక్షాయణి ‘దాతవ్యంబు లెయ్యవి చెప్పు’ మనిన భవుం డిట్లనియె. | 190 |