| పురాణేతిహాసములు | శ్రీమహాభారతము | ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము |
| సీ. |
‘అన్నంబుఁ దోయంబు నఖిలజంతువులకుఁ | బ్రాణముల్ గాన య ప్పరమవస్తు వులు మేలు దాతవ్యములలోన నెల్లను; | నతిథుల కవి యిచ్చు టమరలోక చిరమహాసౌఖ్యంబుఁ జేయుఁ; గాంచన మగ్ని | యగుటఁ దద్దాన మత్యంతపావ నము సర్వకామప్రదము; గోవు సద్వి ప్రు | నకు నీగి తద్రోమ నికరసంఖ్య |
|
| ఆ. |
వరుస నాకలోక వాసంబు గావించు; | నందుఁ గపిల నిచ్చునాతఁ డిరువ దొక్క తరము వారి నూర్ధ్వలోకమునకు | ననుపఁ జాలు వికచవనజవదన! |
191 |
| క. |
విను భూమిదాన కర్తకు | ననిమిషలోకమున నిలువనగు సౌఖ్యంబుల్ దనరుచు నుండఁగ నెఱ పెం | పున భూమి గలంత కాలమును గిరితనయా! |
192 |
| ఆ. |
భూమి నఖిల మగు విభూతి విశేషజా | తంబు గలుగుఁ గానఁ ద్రత్పదాన మెల్ల వస్తువులును నిచ్చిన యట్లగు | దానఁ బోని పాపతమము లేదు. |
193 |
| క. |
అతివా! కన్నియ నిచ్చినఁ | బితృపతి ముదమందు, సురలుఁ బ్రీతు లగుదు; రం చితగతి కర్తకు దొరకొను | నతి తేజ శ్శ్రీయశస్కమగు నబ్భవమున్. |
194 |
| తే. |
విద్య యిచ్చుట సత్పాత్ర విషయమైన | నవ్యయానందపదముఁ జేయంగఁ జాలుఁ; దగఁగ దక్షిణయిచ్చి పేదలకు విద్య | యీ నియోగించుటయుఁ దత్సమాన కృతియ. |
195 |
| సీ. |
తిలరాశి యిచ్చినఁ గలుగు నగ్నిష్టోమ | ఫలము; వాసోదాన ఫలము చిరత రాయువు; గొడు గీగి యఖిలపీడలఁ బాపు; | దాసదాసీజనదాన మహిమ కర్మ విమోక్షంబు గలిగించు; దీపదా | నము ఫల మాత్మాతివిమలభావ; మంబు ప్రవాహంబు నధిగమింపఁగఁ జేఁత | నిఖిల వ్యసనముల నిస్తరింపఁ |
|
| ఆ. |
జేయుఁ; దెరువు లెస్ససేయుట సంతాన | మిచ్చు; నౌషధంబు నిచ్చు టెల్ల తెవులుఁ బాపు; సాదు దెరువరి కునికి ప | ట్టొసఁగు టొసఁగు దనుసుఖోదయములు.’ |
196 |
| వ. | అనిన విని ‘యజ్ఞంబు తెఱం గెఱింగింపవే’ యని పార్వతి ప్రార్థించినం బరమేశ్వరుం డిట్లనియె. | 197 |
| సీ. |
‘విను మింతి! వైదికంబును లౌకికంబును | నన రెండు దెఱఁగులు యజ్ఞవిధులు; వర్ణయోగ్యార్జన వర్ధనాంచిత ధన | ధాన్యముల్ గొని దేవతలకుఁ దృప్తి యగునట్లుగా ఋత్వి గర్చన మొప్పఁగాఁ | గావించునది వైదికంబు; దేవ తలకు మహోత్సవంబులు సేయుటయు గీత | వాద్యనృత్యము లనవద్యములుగ |
|
| ఆ. |
సంఘటించుటయును సద్గంధమాల్య ధూ | ప ప్రదీప భోజ్యభక్ష్యములు స మాదరంబుతో నివేదించుటయు లౌకి | కంబు; రెండు నమరగణహితములు. |
198 |
| తే. |
ధర్మములు దానములును సద్వ్రతచయంబు | సదృశములు గావు వినుము యజ్ఞమున కరయ యజ్ఞకర్త లోకోత్తరుం డతని కిచ్చు | టతనిచేఁ గొను టధిక పుణ్యములు చెలువ! |
199 |
| ఉ. |
మానస కృత్యముల్ సురసమాజ మెఱుంగఁగఁ జాలుఁ గావునన్ మానస మెక్కడేనిఁ జన మంచిగఁ జేసిరయేని యజ్ఞమున్ దానము నాదియైన సుకృతంబులు లగ్గ ఫలింప నీదు త ద్ధ్యాన పరత్వ పూత సుకృతంబులకున్ ఫలమిచ్చు మెచ్చుచున్.’ |
200 |
| క. |
అని చెప్పిన హిమవద్గిరి | తనయ త్రిపురవైరితోడ ‘దైవికవిధు లే వినఁ గని సంతోషించితి; | వినిపింపుము పైతృకంబు విధము వృషాంకా!’ |
201 |
| సీ. |
అనిన నా సర్వజ్ఞుఁ డద్దేవి కిట్లను | ‘గయ కురుక్షేత్రంబు గంగయాది యగు పుణ్యదేశంబు లతిఫలదంబులు; | మాఘ భాద్రపదాఖ్య మాసములు బ హుళపక్ష మపరాహ్ణ ముగ్మలి! యమవస | ద్వాదశి నవములు పరఁగు దుష్టిఁ బితృ దేవతల కిచ్చుఁ; గుతప దౌహిత్ర తి | లలు నితాంత పవిత్రములు పితృక్రి. |
|
| తే. |
యలకు; శౌచ మక్రోధ మవ్యగ్రభావ | మర్హములు శుక్లపక్ష పూర్వాహ్ణ యుగ్మ దివస జన్మదినములు నిందితము లాజ్య | ముద్గ పాయసాపూపముల్ ముఖ్యకోటి. |
202 |
| క. |
శ్రోత్రియు లరోగు లవికల | గాత్రులు పాత్రములు పైతృకములకు సచ్చా రిత్రత్వము ముఖ్యంబు స | గోత్రు మృతకళత్రు నన్యకులుఁ గొన రతివా! |
203 |
| ఆ. |
గంధపుప్పమాలికా ధూపదీప వ | స్త్రముల నర్చ లిచ్చి తగఁగ భోజ నములు నిర్వహించి క్రమవృత్తిఁ బిండప్ర | దానవిధి యొనర్చు టేను మెత్తు.’ |
204 |
| వ. | అని యెఱింగించిన మేనకాత్మజ మృడునితో నిట్లనియె. | 205 |
| క. |
‘మృతిఁ బొంది పునర్జన్మము | నతర్క్యగుణ జంతుకోటి యప్పుడ పొందుం బితృపూజన మని యెవ్వరి | కితవుగఁ జేయుదురు దీని నెఱిఁగింపు శివా!’ |
206 |
| ఆ. |
అనుడు నచటనున్న మునిజను లెల్లను | నగతనూజ నాత్మఁ బొగడి యభవుఁ డిచ్చు నుత్తరంబు నేర్పడ విను వేడ్క | గదురనుండి రపుడు కంసదమన! |
207 |
| సీ. |
అంబిక కిట్లను హరుఁడు ‘సందేహింపఁ | దగునది యిది గుహ్యతమము వినుము దివిజు లట్టుల పితృదేవతలును; దేవ | బృంద ముత్తరదిశఁ బితృచయంబు దక్షిణ దిశ నుండుఁ; దత్పూజనంబులు | వరుసన హవ్యకవ్యంబు లండ్రు; చచ్చినవారికి శ్రాద్ధంబు సేయఁగా | నా పితృ సంఘంబు హర్ష మొంది |
|
| తే. |
యాయువును శ్రీయుఁ గీర్తియు నాదియైన | యైహికంబులు సుగతియు నాదరమునఁ గర్త కొసఁగు సురాసుర గరుడ యక్ష | తతులకును బూజనీయంబు పితృగణంబు.’ |
208 |
| వ. | అని నిర్దేశించి వెండియు. | 209 |
| క. |
‘తమ తమ సారములకుఁ దగఁ | గమలాక్షీ! చేయుదాన కల్పనల విశే షము లొక్క రూపయగుఁ ద | త్ప్రమాణ రూపణము చేసి పలికెదఁ దెలియన్. |
210 |
| క. |
విను మొక కుంచెడు ధాన్యము | తన కాయతి గల్గు నతఁడు దాని నొసఁగినన్ ధనకోటి గల్గువాఁ డ | ద్ధన మొసఁగిన నొక్కరూప తత్తత్ఫలముల్. |
211 |
| క. |
పరుషత్వము లే కంతః | కరణంబున శుద్ధి చాలఁ గలిగి ప్రియము పొం పిరివోవఁ జేఁత దానము | పరమోత్కృష్టంబు పద్మపత్రనిభాక్షీ!’ |
212 |
| క. |
అని చెప్పి ‘కొన్ని ధర్మము | లనఘా! యెఱిఁగింతు నీకు నవధానముతో విను’ మని పలికి శివుం డి | ట్లను విశదము గాఁగఁ గూర్చి యంబుజనాభా! |
213 |
| చ. |
‘తెవుళులు గొన్నవారి కవి దీఱుట కౌషధ మీగి, దుర్గతుల్ దవులు జనాలిఁ బ్రోపు, సుపథంబుగఁ దైర్థిక కోటిఁ దన్పు, బాం ధవ రహితత్వ దీనశవ దాహము, దుఃఖితులైన వారిఁ దే ర్ప వెరవు, నోర్పుఁ గల్మియును బ్రస్తుతి కెక్కిన మేటి ధర్మముల్.’ |
214 |
| వ. | అని పలికినఁ బార్వతీదేవి పరమప్రియంబు నొంది. | 215 |