పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి ధర్మవిశేషంబుల తెఱం గెఱింగించుట (సం. 13. ఆను 1-16-3630)
సీ. ‘ధర్మంబు నానావిధంబులఁ బరఁగు నం; | డ్రవి యెఱిఁగింపవే’ యనుడు హరుఁడు
‘వితతంబులగు శ్రుతి స్మృతులచేఁ జెప్పఁగాఁ | బడిన తెఱంగులు పడఁతి! వినుము
జాతి ధర్మములు, దేశజ ధర్మములుఁ, గుల | ధర్మంబులును, గణ ధర్మములును,
గాయంబు వికృతులఁ గాలపర్యయముల | వచ్చు నాపద్ధర్మ వర్తనములు
 
ఆ. గాఁగ నిట్లు ధర్మగతు లైదు గల వని | చెప్పుటయును గౌరి శివునితోడఁ
‘బుణ్యలోక కలిత భోగంబు లెట్లుండు?’ | ననిన నిట్టు లనియె హరుఁడు గృష్ణ!
216
సీ. ‘ఎల్లపుష్పంబులు నెక్కాలమును దద్ద | విలసిల్లుఁ; గల్పక వృక్షజనిత
మనులేప; మాహార మమృత; మంబరములు | నిత్యామలినములు; నిరుపమాన
భంగి దీప్తంబు లాభరణముల్‌; వాన ర | మించుచు నన్యోన్యమిత్రభావ
మొప్పంగ మేనుల యొప్పును మనముల | మార్దవంబును గుణమాన్యతలును
 
తే. గలిగి పురుషులుఁ గాంతలుఁ గామహర్ష | లీల లెసఁగఁ గ్రోధాదులు లేక రుజయు
జరయు నెఱుఁగక నలిఁ జరింతురు దివంబు | నందు సంతత నిర్భరానంద మొంద.’
217
వ. అనిన విని హైమవతి ‘సుగతి దుర్గతులకుఁ జనం గలవారిం జూచి వీ రిట్టివారని నిశ్చయింపవచ్చుట రామి యెఱింగింపు’ మనవుడు మృడుండు విను మని యిట్లనియె. 218
చ. ‘జనులకుఁ గీడు రోయక యజస్రము ధర్మరతిం జరించి స
జ్జన గురు పూజనంబులును సత్యహితోక్తులు దీనపోషణం
బును నతిథిప్రియత్వమును భూరిదయార్ద్రతయుం గలట్టి వా
రనిమిషలోకగాములని యాత్మ నెఱుంగుము మేనకాత్మజా!
219
చ. పరుసని పల్కు బొంకులగు పల్కులు నన్యధనాభిలాషముం
బరవనితా విలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దు
శ్చరితులతోడిమైత్రియును సంతత ధర్మరతాభ్యసూయయుం
గరినిభయాన! ఘోరనరకంబున కేఁగెడి వారి చిహ్నముల్‌.’
220
క. అని చెప్పిన విని హిమగిరి | తనయ వృషధ్వజుని తోడ ‘ధర్మంబులు పె
క్కనుపమమూర్తీ! పరమం | బనఁ జాలెడు ధర్మ మెద్ది యన్నిటిలోనన్‌.
221
వ. చెప్పు మనిన న ప్పరమేశ్వరుం డిట్లనియె. 222
క. ‘రమణీ! వర్గత్రయ ధ | ర్మము లిచ్చు సుఖములు దుఃఖమయము లచిరముల్‌
గమనాగమకరములు ని | త్యమహాసౌఖ్యంబు మోక్షధర్మం బిచ్చున్‌.
223
సీ. కావున విను త్రివర్గంబుకంటెను మేలు | దలపోయ మోక్షంబు; దానిఁ బడయు
తెఱఁ గెఱింగించెదఁ దెఱవ! గృహస్థ ధ | ర్మంబున నిల్చి ఋణంబు లెల్లఁ
బాచి వనమునకుఁ బరమశాంతత నేఁగి | సద్గురుముఖమున సాంఖ్యయోగ
విదుఁ డగునది; పంచవింశతి జ్ఞానంబు | సాంఖ్యంబు, ధర్మనిశ్చలత యోగ;
 
తే. మాసమాచారయుగళ మేకాధి కరణ | మస్ఖలితముగ మది నది యలవరించి
ధ్యానపరుఁ డయి శీతోష్ణ హర్ష శోక | ముఖములగు వివిధ ద్వంద్వములఁ దొఱంగి.
224
ఉ. శౌచము బ్రహ్మచర్యమును శాంతియు లఘ్వశనంబునై యిళం
జూచుచు నంతరాత్ము నెడసొచ్చిన విఘ్నవిశేషమున్‌ ధృతిం
ద్రోచుచు భక్తియుక్తికి గురుండు ప్రమోదమయుండు గాఁగఁ ద
ద్గోచరతం జరింపఁగ నకుంఠిత మోక్షసుఖంబు చొప్పడున్‌.
225
తే. అది సదాభ్యాసకలన నత్యంతనిర్మ | లంబు నవ్యయమును నచలంబు ఘనము
నై జరావ్యాధి మరణ జన్మాది దుఃఖ | బహుళ సంసార చక్రంబుఁ బాపనేర్చు.’
226
వ. అని యుపదేశించి వెండియు. 227
క. ‘విను సంసారమునకు విసు | వని మర్త్యుఁడు శోకమోహ వశగతుఁడై మో
క్షనిరూఢిఁ బడయ నేరఁడు | మనము విరక్తముగ విసివి మఱి ముక్తి గనున్‌.
228
వ. అట్టిదశ చింతా వివర్జనంబునను, భూతాస్థిరత్వ జ్ఞానంబునను, దృష్ణారాహిత్యంబునను గాని కలుగదు గావున వాని భంగులు ప్రకటించెద. 229
సీ. ధనములు చెడిన బాంధవులు సచ్చినఁ దదీ | యములగు గుణముల యందు మనసు
వెట్టక యున్నది యెట్టన్న వగచినఁ | దాపంబు వొందుట దక్క నొండు
గలుగునే సుఖము దుఃఖంబును దోడివ | యవి మార్చి వచ్చుచు నరుగుచుండుఁ
గేవల సుఖము లే దా వాసవునకైనఁ | జేటు దృశ్యములకు సిద్ధ మగుట
 
తే. మున్న కనియున్న వగ చిత్తమున జనింప | దరయఁ గీడు పరిగ్రహ మది సమగ్ర
మైనతఁడు పొత్తినూలి ప్రువ్వట్ల తాన | తనకు బంధంబు గావించికొను లతాంగి!
230
ఆ. విను ధనార్జనంబు ధనరక్షణంబు ధ | నవ్యయంబు ధనవినాశనముఁ బ్ర
గాఢ దుఃఖదములు గావున దుఃఖభా | జనము ధనము గాల్చు మనఁగ వలయు.
231
క. రమణీ! తృష్ణాసమ దుః | ఖమును బరిత్యాగ సమ సుఖముఁ గలవే? కా
యము ముదిసిన ముదియదు ప్రా | ణము గొని పోఁజాలు తెవులనం జనుఁ దృష్ణన్‌.
232
క. కామములు భోగములఁ దెగు | నే? మెలఁతుక! నేత నాఱునే చిచ్చు ధృతిం
గామములఁ దొఱఁగు సౌఖ్యము | నేమెయి సౌఖ్యములుఁ బోలునే యరయంగన్‌.
233
క. విచ్చలవిడి నింద్రియముల | నెచ్చటికైనను జనంగనిచ్చిన నరకం
బచ్చువఱుచుఁ; గుదియించినఁ | దెచ్చు సుగతి నరున కది సతీమౌళిమణీ!
234
తే. కామరసమున నతితృష్ణుఁడై మనుష్యుఁ | డర్థతృష్ణా పరీతాంతరంగుఁ డైన
గొఱియ నడవిలో నెత్తెడు కోలుపులియుఁ | బోలె మృత్యు వాతనిఁ గొనిపోవు దేవి!’
235
వ. అని పలికి ‘జరామృత్యువులఁ ద్రోవం జాలు మేలెయ్యది యంటేనిఁ జెప్పెద నాకర్ణింపు’ మనుపలుకు పలికి యిట్లనియె. 236
తే. ‘ధనములును దానములుఁ దపోధనము వాజి | పేయ రాజసూయంబులు వేయు నోపి
చేయుటలు గావు మోక్షదర్శిత్వ మొకఁడ | మందు జరకు మృత్యువునకు నిందువదన!
237
తే. జాములును దివసములు మాసములు నేండ్లు | నైన కాల మాయువుగొని యరుగుచుండు;
నెల్లి చేయుపనులు నేఁడ యింతి! మా పొ | నర్చుపని రేప చేయుట నామతంబు.
238
తే. మేలు గడువేగ చేయరు కాలపాశ | బద్ధులై యేమఱుటఁజేసి పడఁతి! మనుజు
లింత యెఱుఁగుట సంసార మెడలఁద్రోచు | నట్టి విసువుటఁ బుట్టించునది హితంబు.
239
వ. ఇవ్విధంబున. 240
క. ఈ తెరువు లాదరింపఁగఁ | జేతోగతికిని విమర్శసిద్ధి యొదవుఁ ద
జ్జాత విరక్తియు ముక్తికి | నా తెరువ సమీపవర్తి యచలేంద్రసుతా!
241
క. వైరాగ్యంబు ప్రశాంతికిఁ | గారణము; ప్రశాంతి ముక్తిఁ గను; మోక్షానం
దారాము జరామృత్యువు | లేరూపునఁ జేర నేర విద్ధచరిత్రా!.’
242
క. అని చెప్పి మఱియు శివుఁ డి | ట్లను హిమగిరిసుతకు ‘సాంఖ్య మమలినహృదయా!
విను వివరించెద; సంసృతి | యను రోగంబునకు వైద్య మది యరయంగన్‌.
243
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )