పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుఁడు పార్వతికి సాంఖ్యప్రకారంబు దెలుపుట. (సం. 13- అను. 1-15-4096)
ఆ. జ్ఞానమున విముక్తి సాంఖ్యులు పడయుదు | రరసిచూడఁగా నిరర్థకంబు
ఘోరతరము నండ్రు శారీరమైన త | పంబుఁ బంచ వింశ భజన మూఁది.
244
సీ. ప్రకృతి కవ్యక్తనామకమును గల; దందు | మహదహంకార తన్మాత్రలును మ
నము నింద్రియములు భూతములు జన్యములుగా | నోలిన యిరువది నాలు గయ్యెఁ;
బంచవింశక తత్వభావితక్షేత్ర మా | తత్వ సంతానంబు సత్త్వమును ర
జస్సుఁ దమస్సు నాఁ జను నిజగుణములఁ | బ్రకృతిదాఁ గరణ రూపములు గాఁగఁ
 
ఆ. గొని సృజించు లోకకోటి నయ్యవ్యక్త | మణువు నిత్య మేక మక్రియం బ
హైతుకంబు చక్షురాదుల కగ్రాహ్య | మది ప్రధాన మనఁగ నతిశయిల్లు.
245
తే. సౌఖ్యతుష్టిప్రకాశముల్‌ సాత్త్వికములు | మోద ఖేదాదిక ద్వంద్వములు లతాంగి!
రాజసము లప్రకాశ సంత్రాస మోహ | ములును దంద్రయుఁ దామసములుగ నెఱుఁగు.
246
క. ధృతి విజ్ఞాన శ్రద్ధలు | నతివ! యసమ్మోహమును దయయు హర్షము నం
చిత సత్త్వ వృద్ధిఁ బరి వ | ర్ధితంబులగు సత్త్వ మరుగఁ దెరలుం దారున్‌.
247
క. క్రోధ లోభ కామానృత ద్రోహచింత | తాపములకు రజోభివర్ధనము వృద్ధిఁ
జేయు వానికి నెల్ల సంక్షీణ భావ | మావహిల్లు రజఃక్షయ మావహిల్ల.
248
తే. సంశయంబు విషాదంబు జడత నిద్ర | విను తమస్సు వర్ధింపఁగాఁ బెనుపు నొందు
నది విహీనతఁ బొందిన నవియు హీన | భావ మొందు వికస్వర పద్మనయన!
249
సీ. ఒక్కఁ డొక్కనిచేత నెక్కుచుఁ దఱుగుచుఁ | ద్రిగుణంబులును బ్రవర్తించు; వీన
జనితంబులగు ప్రీతి సంతాప మోహాదు | లొదవినఁ దత్తద్గుణోదయములఁ
గని యుపేక్షించుచు మనము నూనఁగ నీమి | కార్యంబు ధర్మార్థకామములకు
నమర మనుష్య తిర్యగ్జననములకు | మూలముల్‌ సత్త్వాదు లోలి నెఱుఁగు
 
తే. బుద్ధి యనఁగ మహత్తత్వమునకు నామ; | మది వివేక విజ్ఞాన చిహ్నంబు; భూత
జని యహంకారమునకు లక్షణ; మహంక | రణము దొఱఁగుట మోక్షకారణము దేవి!
250
ఆ. అన్నియింద్రియముల నడరింప మగుడఁ జే | యంగ మనసు చాలు; నవియు నదియు
భూత తద్వికారములును దేహము తద | న్యుండు దానఁ బరఁగి యుండు దేహి.
251
క. విను దేహియు దేహము వే | ఱను నిశ్చయదృష్టి గల్గునాతఁడు చాలున్‌
మనసు మగిడింప నది ని | ర్మనస్కతఁ బొనర్చి మోక్షమార్గముఁ జూపున్‌.
252
వ. అప్పుడు ప్రకృతిం దొఱంగి పంచవింశకుండు వెలుంగు; నాతత్త్వంబు పరమ హంసుండనం బరఁగుఁ దద్విజ్ఞానంబు శాంతిసాధ్యంబును బరమశాంతి ప్రదంబునై యుండు. 253
మ. రసగంధాది గుణాలి లేమి నవికారత్వంబునన్‌ సర్వ సం
వసనవ్యాప్తి నణుత్వభంగిని మహత్త్వస్ఫూర్తిఁ జక్షుః ప్రభృ
త్యసమాలంబితఁ దేజరిల్లు పరమాత్మాఖ్యంబు షడ్వింశకం
బు సమత్వంబునఁ జూచు శాంతుఁ డతివా! పొందున్‌ విమోక్షస్థితిన్‌.
254
వ. ఇది కపిలాది పరమర్షిసేవితంబైన సాంఖ్యధర్మంబు; యోగ ప్రకారంబు వివరించెద. 255
సీ. విను మింద్రియంబులు మనసును బుద్ధియు | నాత్ముండు నొక్కటి యగుటఁ గాన్పు
యోగ పరిజ్ఞాన ముగ్మలి యగ్ని స | మా రాధనంబును నధిక వాగ్వి
వర్జనంబును సత్త్వవత్వంబు దానాధ్య | యనములు శౌచ సత్యములుఁ బాప
ములఁ బాపుఁ బాపనిర్ముక్తుఁడై మఱియోగ | మాచరింపఁగ యోగ్యుఁ డగు నరుండు
 
తే. మనసు పట్టుట ముఖ్యపుటనువు దాని | కామిషము గాలగాని కెట్లట్ల శుచియు
నజనమును నగుచోట మృద్వాసనమునఁ | గాయమున కార్జవము భంగి గలుగనుండి.
256
క. మనమున నైదింద్రియములు | నునిచి మనం బాత్మ నల్ల నొదిఁగింపఁగ నె
క్కొని ప్రాణంబు నపానం | బును వశ్యత నిలుచు యోగమున సిద్ధికినై.
257
తే. అవహితుం డయి తద్దశ యనుభవింపఁ | గా నపానమిశ్ర ప్రాణ గతికి మూర్ధ
మతివ! యమ్మెయి నెలవగు; నతఁడ చూవె | జీవుఁ డనఁ బరమాత్ముండు నా వెలుంగు.’
258
వ. అని వెండియు. 259
ఉ. ప్రాణు నపానునందును నపానునిఁ బ్రాణునియందు నిల్పి ని
ర్వాణముఁ గోరి చిత్తము తిరంబుగఁ బట్టఁగఁ బ్రాణసంయమా
క్షీణత దేహమధ్యశిఖిఁ జిమ్మఁగఁ దత్త్రయ మొంది మూర్ధపా
రీణతఁ గోర్కి సల్పు నపరిచ్యుతిఁ దద్గతుఁడైన యోగికిన్‌.
260
వ. అని చెప్పి వెండియు. 261
చ. అలసతయున్‌ విచిత్తతయు నత్యశనాదరణంబు రోగముం
గలయును లోభమున్‌ భయముఁ గామముఁ గ్రోధము లౌల్యమున్‌ విరో
ధులు విను యోగసేవకు; నదుష్టతఁ బేర్చిన యోగ మిచ్చు సి
ద్ధు లెనిమిదింట నప్రతిహతుం డయి యోగి చరించు నెల్లెడన్‌.
262
ఆ. నిద్రపెంపు నిద్ర నిగ్రహించుటయును | గొలఁది మీఱు కుడుపుఁ గుడువమియును
యోగి కొప్ప; వతఁడు యుక్త వర్తనుఁడైన | నువిద! దుఃఖహారి యోగ మొందు.
263
వ. ఇట్టిది యోగధర్మం’ బనిన నంబిక ‘సాంఖ్యయోగ శ్రవణంబునఁ బరిజ్ఞాత పరమార్థ నైతి; భవదీయ సాయుజ్యంబుభక్తు లెట్టి పరిచర్యం బడయుదు? రెఱింగింపవే’ యని యడిగిన మృడుండు మృడాని కిట్లనియె. 264
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )