పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
శివుండు పార్వతికి నాత్మసాయుజ్య ప్రాప్తిసాధనంబులు దెలుపుట (సం. 13- అను. 1-4336)
క. ‘విను మవిచింత్యుఁడ సురలకు | మునులకు నేనియును యోగమును సాంఖ్యము నా
యొనరించినయవి యీశుఁడ | సనాతనుఁడ నవ్యయుండ సత్యాత్ముండన్‌.
265
క. ఏను బ్రసన్నుఁడనైనం | గానిది లే దర్చకులకుఁ గావున మంత్ర
ధ్యానస్తుతి వందన ముఖ | నానాభజనముల వలయు నైష్ఠికత శివా!
266
ఆ. నాలుగాశ్రమముల నలువురు విప్రుల | కతివ! పాశుపతమహావ్రతంబు
తెఱఁగు లేను దొల్లి దెలిపితి; శిష్య ప్ర | శిష్య సరణి నది ప్రసిద్ధ మయ్యె.
267
క. మంగళ రక్షా శుచితా | లింగార్చన యోగ్యతలు ఫలించుటకై భూ
తిం గావించితిఁ; దల్లి | ప్తాంగులును గపాలధరులునై శాంతిమెయిన్‌.
268
తే. బ్రహ్మచర్య భిక్షాశన పరత గలిగి | జటిత యొండె ముండిత యొండె సంభరించి
మనసు నాయంద తిరముగా నునిచి యొండు | వస్తువుల దెస నొల్లమి వర్తిలంగ.
269
క. చరియించు భక్తజనులకుఁ | బరమానందైకతానుభవ మొసఁగుదు; న
వ్వెరవున మత్సాయుజ్యము | దొరకును వారలకు వికచతోయజవదనా!
270
వ. ఇది సాయుజ్యావాప్తి ప్రకారం’ బని చెప్పి వెండియు. 271
క. శివలింగ స్థాపనముఁ ద్రి | భువనములం బరమహితము పొంటెం గరుణన్‌
ధవళాక్షి! చేసితిం ద | త్ప్ర విమల లింగమున నన్ను భావించు టుఱున్‌.
272
చ. కలమెయిఁ బాల నేత నుదకంబులనేని వరాభిషేక మం
గళము నొనర్చి భక్తి రతి గంధము మాల్యము ధూప దీప సం
కలనములన్‌ నివేద్యమును గాఢ సమర్పణ మొందఁ జేసి లిం
గలసితమూర్తియందు ననుఁ గాంచి భజించిన ముక్తి చేకుఱున్‌.’
273
క. అని పలికి ‘నీవు దేవాం | గన లాదిగఁ గల త్రిలోక కాంతలకును మ్రొ
క్కునకుం బాత్రం బగు పద | వనజంబులు గల్గి యొప్పు వరసతి వతివా!.
274
క. చతురవు వివేక విభవో | న్నత చిత్తవు వ్రతవిధాన నైష్ఠికతా సం
యుత మతివి లౌకిక జ్ఞా | నితా మహిమ సహజమతి వనిందిత వరయన్‌.
275
క. కావునఁ గాంతా ధర్మము | నీ వలనం దెలియువేడ్క నెమ్మనమున నా
కావిర్భవించెఁ; జెప్పం | గా వలయును దాని వికచకమలదళాక్షీ!.’
276
ఆ. అనిన సిగ్గుతోడి యలఁతి న వ్వొలసిన | చెన్ను మొగము వింత చెలువుఁ దాల్ప
వాంచి యెత్తి గౌరి వరునితో నిట్లను | ‘నేను మీకుఁ దెల్ప నెంతదాన?.
277
క. ఐనను మీరడిగిన మ | న్మానస బోధంబు కొలఁది మగువల తెఱఁగుల్‌
పూని వినిపింప కుండుట | దాన తగదు గాన చెప్పెదను సర్వజ్ఞా!’
278
క. అని పలికి మఱియు నిట్లను | ‘నను నెప్పుడుఁ బాయకుండు నదు లెల్లను; న
వ్వనితలతోడ సమాలో | చన మొనరించి మఱి చెప్పఁ జను నిత్తెఱఁగున్‌.’
279
వ. అని విన్నవించి గంగ యమున గోదావరి కౌశికి కావేరి కృష్ణవేణి పెన్న నర్మద బాహుద రేవ తమస మొదలైన నదులు మున్న తనతోడన వచ్చి యున్న నన్నాతుల గుఱించి ‘యీశానుం డిట్లడిగెడు నెట్లు చెప్పుద?’ మనిన గంగాదేవి ‘నీకంటె నే మెఱుంగుదుమే? నీ వెఱింగిన తెఱంగున నంగనాధర్మం బెఱింగించి పతిం బ్రీతునిం జేయు; మేము భవదీయ వాగమృతంబు వీనుల నినిచెద’ మనుటయుఁ బార్వతి ప్రసన్నచిత్తయై వల్లభు వదనంబునం జూడ్కి నిలిపి. 280
క. ‘దేవా! నీదు ప్రసాద | శ్రీ వచ్చిన యెఱుక సుందరీవిధము భవ
ద్భావంబునకుఁ బ్రియంబుగ | సేవాధర్మంబుఁ దెలియఁ జెప్పెద’ ననియెన్‌.
281
తే. అనిన విని సురమునులు ప్రియంబుఁ బొంది | రమర గంధర్వ సిద్ధ సాధ్యాంగనా జ
నంబు వినువేడ్క వచ్చి య న్నలినవదన | వెనుక దెసనుండె దేవకీతనయ! యపుడు.
282
వ. అని చెప్పి య ప్పురుషోత్తము వీనులు వికసిల్లుచుండ నారదుం డిట్లనియె. 283
క. వనితలుఁ బురుషులుఁ బ్రియమున | దను వినుతింపంగ శైలతనయ సమాక
ర్ణనకౌతుకి యగు నీశా | నునితో మృదురీతి నిట్లనుం గమలేశా!
284
సీ. ‘ఋతుమతి గాక శుద్ధతయుఁ గల్గినయింతి | కన్య తత్పరిణయ కరణమునకు
నొడయులు విను తల్లియును దండ్రియును దండ్రి | తోఁ బుట్టినతఁడు మాతులుఁడు సోద
రుండును యోగ్యవరునిఁ జూచి వారిలో | నెవ్వరైనను బ్రీతి నిచ్చువారు;
పతి యంతనుండియుఁ బ్రభువు దానికి; నట్లు | గావున నాతండ దైవ మనుచు
 
తే. నతని మత మూఁది దేవతా పితృ సమర్చ | నములు నతిథి పూజనము సన్మతి సమాచ
రించుచును బతిహితము వాటించి నడపు | సతి పతివ్రత యిహపరసౌఖ్యమహిత.
285
వ. ఏతద్విషయం బయిన యొక్క నిదర్శనం బవధరింపుము. 286
సీ. బ్రాహ్మణుఁ డొకనికి భార్య లిద్దఱు గల; | రందొక భామిని యతని హితము
నడపెడు నవధాన మెడలి యాతఁడు పంప | కయుఁ దాన సురపితృకార్యపరత
నడచుఁ; దక్కటియింతి నాథుఁ బాటించుచుఁ | దన్మతంబునఁ జేయు ధర్మవిధులు;
వారు మువ్వురు విధివశమున నొక్కట | మృతిఁ బొంది; రా పతివ్రత వరుండు
 
తే. చనిన సుగతికిఁ జనెఁ; బెఱవనిత జముఁడు | ‘నీకుఁ బోలదు మరలుము నీశరీర
మునక’ యని యాఁగె; నది శోకమున సబాష్ప | యైనఁ గన్గొని యతఁడు దయా ర్ద్రుఁ డగుచు.
287
క. ‘పతిమతము గొనక ధర్మము | నతివ నడపు టొప్ప; దింకనైనను బతికిన్‌
హితము లగువానిఁ జేసిన | నతనిఁ గలయు’ దనినఁ జనియె నదియును మరలన్‌.
288
వ. కావునం బతికి ననువ్రత యగుట గృహిణికి ధర్మం’ బని పలికి వెండియు. 289
క. ‘లలన యిలువాడి నాథుఁడు | వలచిన చవి వంటకములు వండి యిడి తనుం
గలయఁ దలంచిన మెయికొని | యెలమిం గైసేసి హృదయ మీ వలయు శివా!
290
తే. పనుల యెడ మాఱుపలుకక యనవధానుఁ | డైన పతిఁ దలఁపించి ధర్మార్థ కలిత
కృతులు నడపుచు, సవతి గల్గినను బోరి | తంబు లే కొక్కటై యున్కి తగవు సతికి.
291
క. సవతాలికిఁ బతి వలచిన | నవుఁగాకని యతని యిచ్చ కనురూపముగాఁ
దివిరి నడచు సతి దైవము; | శివ! యది తగు నెల్ల జనముచే మ్రొక్కుగొనన్‌.
292
క. తన చేతికి నిచ్చిన వ | స్తునికాయము నిల్లురువున చొప్పున మగుడం
గొనివచ్చి భార్య పతి దె | మ్మని నప్పుడ యిచ్చుటొప్పు నకపటవృత్తిన్‌.
293
క. పతి తనకు నేమి యిచ్చిన | నతిముదమునఁ బొందవలయు; నాత్మజుఁ డైనన్‌
మతిఁ గొంకక యేకాంత | స్థితి నేకాసనత నున్కి సెట్ట ప్రమదకున్‌.
294
క. ధని యధనుఁడు రూపసి యొ | ప్పనివాఁడు వివేకి మూఢభావుఁ డరోగుం
డనుగత రోగుఁ డనక యం | గన పతిఁ బాటింపవలయుఁ గామధ్వంసీ!
295
క. బలిభిక్షము గడప కిడ | న్వలయును దేవపితృ పూజనంబుల కాలం
బులఁ బతి శుభమందుటఁ ద | త్ఫలంబుగాఁ గోరు టొప్పిదము సతికి శివా!
296
క. గతి పతియ చువ్వె భార్యకు; | నతనిఁ గడచినట్టి సత్పరాయణము కృపా
యుత! కలదే? కావునఁ దా | నతనికి భక్తయగు టిచ్చు నఖిల శుభంబుల్‌.’
297
వ. అని చెప్పి య ప్పరమేశ్వరునకుం బార్వతి భార్యల యధర్మంబులు వివరించునదియై యిట్లనియె. 298
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )