పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
పార్వతి శివునకుఁ బతివ్రత కనర్హంబులగు ధర్మంబులఁ దెలుపుట (సం. 13. అను. 1.15-4609)
సీ. ‘పరమేశ! యాసురి పైశాచి రాక్షసి | యను పేళ్ళు గల వధర్మాంగనలకు;
వ్యభిచారతత్పరత్వంబు వారికి నెల్లఁ | గల; దసురాంశజ క్రౌర్యనిరత,
తనయిచ్చఁ బొలియించు ధనధాన్యములు, చల | హృదయ, భోగపరాత్మ, యీర్ష్యగలదు;
పైశాచి క్రోధన, భర్తృపుత్రులయందు | నిఃస్నేహ, గృహకార్యనిపుణ గాదు,
 
తే. కలహశీల; రాక్షసి సయికంబు లేదు, | బొంకువల్కు , నెప్పుడు నిద్రవోవు, వీత
లజ్జ; యిందఱు నాథుకులంబువారి | దురిత మొందించి పోదురు నరకమునకు.
299
ఆ. ఎఱుక గలిగి పిదప నేనియుఁ బతిభక్తి | గలిగి ధర్మ మోపి సలిపి శాంతి
గలిగియున్న మున్ను గల పాపములు వాసి | పురుషుతోడ దివికిఁ బోవఁ గండ్రు.
300
ఆ. అట్లుగాక పతుల యంతిమ సమయంబు | నందుఁ జింతఁ దక్కి యనుమరణము
చేసిరేని సుగతి సిద్ధించుఁ బతి సమే | తంబుగాఁగ నన్నితంబినులకు.
301
క. ద్విజభామినికి నధర్మము | ప్రజఁ గాంచిన పిదప నయ్యపత్యము శోకో
ద్విజితయుఁ బతిభక్తయునై | త్యజించి యనుమరణ నియత యగుట మహేశా!’
302
క. అని చెప్పి గౌరి పతి కి | ట్లను ‘నాదగు చాపలమున నఖిలేశ్వర! నిన్‌
వినిపించితి నేఁ గొన్నివ | చనముల; నీతప్పు నాకు సైఁపుము కరుణన్‌.’
303
క. అని సిగ్గున చెన్నగు నా | నన మించుక వాంచి యెత్తు నగతనయ శివుం
డును మునులును మునిపత్నులు | వినుతించిరి మధురవాక్య విభవం బెసఁగన్‌.
304
క. సురగంధర్వఖచర కి | న్నర కింపురు షోరగాది నారీజనముల్‌
పరమప్రీతిని బొగడిరి | పరమేశ్వరి నెలుఁగు లడరఁ బంకజనాభా!’
305
క. అని చెప్పి నారదుం డి | ట్లను న గ్గోవిందుతోడ నప్పుడు ప్రియ మా
ననమునఁ బొదలఁగఁ బార్వతిఁ | గనుఁగొని సర్వేశ్వరుండు గారవ మొప్పన్‌.
306
క. ‘నానీ సంవాదము శుచి | యై నైష్ఠికజనుల కెవ్వఁ డాదర మెసఁగం
గా నలినాక్షీ! చెప్పును | వానికి నిత్యామరత్వ వైభవ మొదవున్‌.
307
క. మన సంవాదం బెవ్వరు | వినిరి నియతి నజ్జనులకు విభవముఁ దేజం
బును గీర్తియు నాయువు శ్రీ | యును నారోగ్యంబుఁ గల్గు నుత్పలనయనా!’
308
క. ‘అని నిర్దేశించి శివుఁడు | చనియె; శివయుఁ గొలువుతోన చనె; నిద్దెసకుం
జని రన వశమే? యద్భుత | మనిరూప్యం బప్రతర్క్య మది శ్రీ రమణా!
309
క. అని పలికి నారదుఁడు ‘నా | వినిన కనిన యద్భుతంబు వినిపించితి నీ’
కనియెం గృష్ణుని సభ్యుల | మనంబు లానంద పూర మగ్నము లయ్యెన్‌.
310
వ. అని యిట్లు భీష్ముం డుమామహేశ్వర సంవాదం బనుపుణ్యకథ చెప్పిన ధర్మతనయుండు సోదర సహితంబుగాఁ బ్రమోదరసభరితుండై. 311
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )