పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకుఁ బరప్రాప్తి హేతుభూతం బగు జప విశేషంబు దెలుపుట (సం. 13 అను. 17-5)
సీ. అతనికిఁ బ్రణమిల్లి ‘యనఘ! పరప్రాప్తి | యెద్దాన సమకూరు? నెఱుఁగఁ జెప్పు’
మనిన నతండు ‘నారాయణధ్యాన పూ | జాస్తుతి తత్కథా శ్రవణనిరతి
యమ్మేలు గావించు; నధిప! విద్వజ్జన | సంరక్షణము కల్మషములఁ బాపు;
వేశ్య యొక్కత తొల్లి విద్వాంసు నొకరిని | మ్రుచ్చని తలవరుల్‌ మోఁదఁ జూచి
 
తే. ‘యితఁడు మావాఁడు మీ రిది యేటి కాగ | డంబు చేసెద?’ రని మోక్షణంబు చేసి
యాసుకృతమున బ్రాహ్మణియై జనించెఁ; | దగఁగ నర్చింపు మీవు విద్వజ్జనముల.’
312
వ. అనిన విని యుధిష్ఠిరుండు ‘దారిద్ర్య వ్యాధి శోకంబులకు శాంతి సంపాదింపంజాలు జపం బెయ్యది? చెప్పవే’ యనుటయు ననిమిషనదీ నందనుండు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, వినాయక, విశాఖ, వహ్ని, వాయు, చంద్రాదిత్యులను, శక్ర, వరుణ, యమ, కుబేరులను, సురభిని, సముద్రంబులను, గంగాది మహానదులను, మరు దశ్వివసురుద్రాది దేవతలను, బితృదేవతలను, వాలఖిల్యాది సిద్ధులను, వేదవ్యాస వాల్మీకి నారదాగస్త్య గౌతమ కశ్యపాత్రికణ్వాది మహామునులను, రంభాద్యప్సరః స్త్రీలను, ధర్మతపస్సత్యములను, నహో రాత్రంబులను, దారాగ్రహంబులను, నశ్విన్యాది తారకంబులను, మాసర్తు వత్సరంబులను, వైనతేయ కాద్రవేయులను, గాశీక్షేత్ర కురుక్షేత్రాది పుణ్య క్షేత్రంబులను, నైమిశారణ్య దండకారణ్యాది పుణ్యారణ్యంబులను, మేరు హిమవత్కైలాసాది ప్రభూత శైలంబులను, దిఙఙఙ్నభోభూములను, బుణ్యభూరుహంబులను, భూసురులను, జక్రవర్తులను, రాజులను, బరమభక్తిం దలంచి, కీర్తించి, నమస్కరించి ‘యీ సమూహం బంతయు నన్ను రక్షించి నాకు నాయురారోగ్యైశ్వర్యాభివృద్ధి పరమానందంబు లభినందనపూర్వకంబుగా నిచ్చుఁ గావుత మని యిచ్చఁ గోరి ‘యో న్నమో భగవతే వాసుదేవాయ, నమః పురుషోత్తమాయ, నమస్సర్వలోక గురవే, నమస్సర్వలోక పిత్రే, నమ స్సర్వలోక పితామహాయ, నమస్సర్వలోక ప్రపితామహాయ, నమ స్సర్వలోక ప్రధానాయ, నమ స్సర్వలోకేశ్వరాయ, నమ స్సర్వలోక విశిష్టాయ, నమ స్సర్వలోక సుఖప్రదాయ, నమ స్సర్వలోకకర్త్రే, నమ స్సర్వలోకభర్త్రే, నమ స్సర్వలోకహర్త్రే, నమ స్సర్వలోక నిధయే, నమ స్సర్వలోక నిధానాయ, నమ స్సర్వలోకోద్భవకరాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే’ యని పఠించుట మహాజపంబు. 313
క. పాపంబులును భయంబులు | నాపదలుం బాయు నిమ్మహాజపమున ధా
త్రీపాలోత్తమ! శుభములు | ప్రాపించును ధర్మతత్పరత సిద్ధించున్‌.’
314
వ. అని యిట్లు గంగాపుత్త్రుం డజాతశత్రునకు సర్వసిద్ధికరం బయిన యిమ్మహాజపం బుపదేశించెనని చెప్పి తదనంతర సత్కథ లాకర్ణింపు మని పలికి జనమేజయునకు వైశంపాయనుం డిట్లనియె. 315
తే. ‘మనుజనాథ! యశేషధర్మములు సర్వ | పావనములు శాంతనవుఁడు బహువిధములఁ
జెప్ప నిమ్మెయి విని యుధిష్ఠిరుఁడు భక్తి | న మ్మహాత్ముని నిట్లని యడిగె మఱియు.
316
చ. ‘అతఁ డొకరుండ లోకముల కన్నిటికిన్‌ మహనీయమైన దై
వతముఁ బరాయణంబు నను వైభవ మెవ్వని కొప్పు? నర్చన
స్తుతి రతి నెవ్వనిం గొలిచి శోభన మొందు జనంబు? మేలు నా
నతిశయ మొంది నీకు మతమై చను నెయ్యది ధర్మకోటిలోన్‌?
317
తే. జపములం దెల్ల నుత్తమ జపము నాఁగ | నంచితంబయి తన్ను జపించు జంతు
వునకు జన్మసంసార బంధనము లోపి | పాపు నెయ్యది? యెఱిఁగింపు పరమబోధ!’
318
వ. అని యడిగిన నాభూపతికి భీష్ముం డిట్లనియె. 319
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )