పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు విష్ణుమంత్ర ధ్యానం బవశ్యానుష్ఠేయం బని చెప్పుట (సం. 13-135-4)
సీ. ‘అఖిలజగత్ప్రభు వగు దేవదేవు న | నంతునిఁ బురుషోత్తమాభిధాను
నంచితనామ సహస్రకంబున సంస్తు | తించుచు సంతతోత్థిత మనస్కుఁ
డై యజమానుఁ డవ్యయుఁడైన యాతని | నర్చించుచును దృఢ ధ్యాన నిరతుఁ
డగుచు నమస్కృతి యాచరించుచు ననా | ద్యంతు న వ్విష్ణు నధ్యక్షు నెల్ల
 
తే. లోకములకు బ్రహ్మణ్యుఁ ద్రిలోక కీర్తి | వర్ధనుని సర్వధర్మజ్ఞు వరదు లోక
నాథు భూతభవోద్భవు నమ్మి భక్తిఁ | గొలిచి సర్వదుఃఖంబులఁ దొలఁగఁ ద్రోచు.
320
తే. ప్రస్తుతులఁ బుండరీకాక్షుఁ బరమభక్తిఁ | దగిలి యర్చించుటయ నామతంబు; సర్వ
ధర్మములకును సమధికతమము నైన | ధర్మ మింత యెఱుంగుము ధర్మతనయ!
321
సీ. పరమతేజంబును బరమ పదంబును | బరమైన బ్రహ్మంబుఁ బరపరాయ
ణముఁ బవిత్రంబులు నాఁ దగువానికి | నెల్లఁ బవిత్రంబు, నెల్ల మంగ
ళంబులకును మంగళంబును, నెల్ల దే | వతలకుఁ బరమదైవతము, భూత
సమితికి నవ్యయజనకుండు నగునట్టి | వాఁ డెవ్వఁ; డెవ్వాని వలనఁ దోఁచు
 
తే. నాదియుగము నాగమమున; నంత్యవేళ | నడఁగు నెవ్వానియందుఁ జరాచరములు,
విశ్వలోక ప్రధానుఁ డవ్విష్ణు వేయు | భవ్యనామంబులును బాపభయహరములు.
322
తే. భూరిగుణయోగ విఖ్యాతములును ఋషి స | మాజ పరిగీతములును నై మహిమఁ దనరు
నమ్మహాత్ముని నామంబు లధికతర వి | భూతికై చెప్పెదను విను భూపవర్య!’
323
వ. అని పలికి ‘విశ్వంబు విష్ణుండు వషట్కారుండు భూతభవ్యభవత్ప్రభు’ వను నివి మొదలైన ‘రథాంగపాణి యక్షోభ్యుండు సర్వప్రహరణాయుధుం’ డనియెడునివి తుదిగాఁ గల సహస్ర నామంబు లుపన్యసించి. 324
ఆ. కీర్తనీయుఁడైన కేశవు దివ్యనా | మంబు లివి భవద్ధితంబుఁ గోరి
తరతరంబ కీర్తితంబు లయ్యె నశేష | భంగి వేయుఁ గురునృపాలవర్య!
325
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )