పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
భీష్ముఁడు ధర్మజునకు విష్ణునామ ప్రభావంబుఁ దెలుపుట (సం. 13-135-121)
సీ. విష్ణునామంబులు వేయును నిత్యంబు | వినినఁ బఠించిన మనుజుఁ డిహము
నందుఁ బరమ్మున నశుభంబు నొందక | యత్యంత శుభముల ననుభవించు;
విప్రుండు వేదాంతవిదుఁ డగు, రాజు వి | జయ మొందు, వైశ్యుఁ డక్షయ ధనంబుఁ
బడయు, శూద్రుఁడు సుఖభాగిత వెలయు, ధ | ర్మార్థకామ ప్రజాభ్యర్థి జనులు
 
తే. గాంతు రయ్యై తెఱంగు; లేకాంత భక్తి | శౌచియై విని కీర్తించి సారయశము
నచల లక్ష్మియు వంశ వర్యతయు మేలి | పెంపుసొంపును గలిగి శోభిల్లు నరుఁడు.
326
సీ. పురుషోత్తముని నామములు వేయుఁ గీర్తించు | నాతఁ డొక్కెడను భయంబుఁ బొందఁ,
డమిత వీర్యమునఁ దేజమునఁ గాంతిని బల | రూపగుణంబుల రూఢికెక్కు ,
రోగబంధాపదార్తులకుఁ బఠనమాత్ర | నయ్యయి దురితము లడఁగు, వాసు
దేవాశ్రయుఁడు వాసుదేవ పరాయణుఁ | డును నగుమర్త్యుఁ డవ్వినుతనామ
 
ఆ. కము లుపన్యసించి కల్మషంబుల నెల్ల | దొఱఁగి దుర్గతులకుఁ దొలఁగి జన్మ
మరణములకు రోగ జరలకు నందని | పరమమైన బ్రహ్మపదము నొందు.
327
క. స్మృతి సౌఖ్య క్షాంతి శ్రీ | ధృతి కీర్తులు గలుగు దుర్మతియుఁ గ్రోధము లు
బ్ధతయును మాత్సర్యము లే | వతి పుణ్యత విష్ణుభక్తులైన జనులకున్‌.
328
సీ. చంద్రార్క నక్షత్ర సహిత మైన నభంబు, | సచరాచరోర్వియు, జలనిధులును,
సురదైత్య గంధర్వ గరుడ యక్షోరగ | వ్రజములు హరివశవర్తనములు;
బుద్ధియు నింద్రియములును మనంబు స | త్త్వంబును బలము దేజంబు ధృతియు
క్షేత్రంబుఁ దద్గత క్షేత్రజ వస్తువు | లరయఁగా వాసుదేవాత్మకంబు;
 
తే. లాగమోదితాచారమయంబు ధర్మ; | మచ్యుతుండు తత్ప్రభువు; సాంఖ్యమును యోగ
తంత్రమును శిల్పవేదశాస్త్రములుఁ గర్మ | ములు జనార్దనువలన సముద్భవించె.
329
ఆ. విష్ణుఁ డొక్కరుండ విను మహాభూతంబు; | దక్కు భూత తతులు పెక్కు గలవు;
సరిఁ ద్రిలోకములను బరఁగి విశ్వంబు భూ | తాత్ముఁ డమ్మహాత్ముఁ డనుభవించు.
330
ఆ. వ్యాస సంప్రణీతమైన యీ విష్ణు స్త | వంబు సకలశోభనంబులును సు
ఖములుఁ గోరు పురుషుఁ డమలినబుద్ధిఁ బ | ఠింపవలయు భక్తి పెంపుతోడ.
331
క. అజు విశ్వాధీశ్వరు స | ర్వజగత్ప్రభవావ్యయ ప్రవర్తనకరు నం
బుజలోచను నెవ్వారలు | భజింతురు పరాభవమునఁ బడ రప్పుణ్యుల్‌.
332
క. కావున విష్ణుని పేళ్ళగు | నీ వేయుఁ బఠింపు నీకు నెప్పుడు నాయు
శ్శ్రీవిభవారోగ్యంబులు | భూవర! సిద్ధించుఁ బరమబోధముఁ గలుగున్‌.’
333
క. అని యిట్లుపదేశించిన | విని మోదము నెమ్మనమున వెల్లిగొనఁగ బాం
డుని యగ్రసుతుఁడు గాంగే | యున కభివందన మొనర్చి యుచితవినయుఁ డై.
334
వ. ‘పూజానమస్కారంబులకు నెవ్వరు భాజనంబు? లెవ్వరికిఁ జెట్ట సేసినం జేటు వాటిల్లు? నెవ్వారలు సంతోషించిన శుభంబులు చొప్పడుం? జెప్పవే’ యనిన నతం డతని కిట్లనియె. 335
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )