పురాణేతిహాసములు శ్రీమహాభారతము ఆనుశాసనికపర్వము - పంచమాశ్వాసము
పవన కార్తవీర్యార్జున సంవాదంబు భీష్ముండు ధర్మరాజునకుం జెప్పుట (సం. 13-137-2)
సీ. ‘అధిప! సహస్రబాహార్జునుఁ డేడుదీ | వులు నేలి యద్భుతబలపరాక్ర
మములఁ దనర్చి ‘మత్సము లెవ్వరును నెందు | లే’రని యత్యవలేపయుక్తి
నాడిన నొకభూత మాకాశముననుండి | ‘యెఱుఁగక పలికెద; వెల్లవారి
కధికులుగారె ధరామరు’ లనవుడు | నతఁడు ‘వారలు రాజు నాశ్రయించి
 
తే. నడపి కొందురు మనుగడ; పుడమిఱేని | కంటె నె ట్లెక్కుడై? రట్లుఁ గాక యేను
మనుతుఁ గూర్చినఁ, జెఱుతు నల్గిన సమస్త | భూతముల’ నన్న వెఱచి యా భూత మరిగె.
338
వ. అట్టియెడం బవనుండు గగనంబున నుండి త న్నెఱింగించికొని యన్నరపతి తోడ. 339
సీ. ‘భూదేవశక్తిన కాదె రాజులు ప్రజా | రక్ష యొనర్చుట; బ్రాహ్మణులకు
నధికులు గలరె? యహల్యకై యింద్రుండు | గౌతముఁ డలిగిన గాసిఁ బడఁడె?
కుంభసంభవుచేత నంభోధి యడఁగదె? | యనలుండు భృగుశాపహతుఁడు గాఁడె?’
యన విని మఱుమాట యాడక యున్న య | ర్జునునకుఁ బవనుఁ డిట్లనియె మఱియు
 
తే. ‘నాంగిరసవంశ సంభవుం డగు నుచథ్యుఁ | గోరి నిజపుత్రి సోముఁడు గారవమున
నిచ్చె; నా దంపతులు దమయిచ్చ వనము | నందు వసియించి ముని హృదయంబు లలర.
340
వ. వర్తించునెడ నొక్కనాఁ డమ్ముని యమునానదీస్నానంబునకుం జనుటయు మున్న యవ్వనితం గామించి వేచి తిరుగు వరుణుండు. 341
క. ఎత్తి కొనిపోయి తనపురి | నత్తామరసాక్షి నునిచె; నమ్ముని కడకున్‌
మెత్తన చని నారదముని | యత్తెఱఁ గెఱిఁగింప నాతఁ డాతనితోడన్‌.
342
తే. ‘తాన దిక్పతి; దన కిట్లు దగునె యొరుని | భార్యఁ గొని పోవ? నీ వేఁగి పలుకు మిట్ల’
యనినఁ జని నారదుండు సెప్పినను విడువఁ | డయ్యెఁ గామాంధుఁడై సతి నబ్ధివిభుఁడు.
343
వ. విడువకున్న నమ్ముని యుచథ్యుకడకు మగిడి వచ్చి. 344
సీ. ‘ఇంతిఁ దా విడువనియంతియ కాదు, నన్‌ | బెడతల వట్టి త్రోపించె వరుణుఁ’
డని చెప్పుటయు నల్గి యతఁడు సర్వజలంబు | ద్రావిన వరుణపురంబు ధూళి
మయమైన భయమంది మానినిఁ గొనివచ్చి | యొప్పించి ప్రణమిల్లి తప్పు వాపి
కొని మునికృపఁ గాంచి చనియె నాదిక్పతి; | ధరణీశ! రాజులొ ధరణిసురులొ
 
ఆ. యెక్కు?’ డనిన వినియు నక్కిళ్ళు వడియున్న | యతనితోడ ననిలుఁ డమరు లసుర
సమితికోడి వచ్చి శరణుసొచ్చిన నగ | స్త్యుండు విజయలక్ష్మి నొసఁగుటయును.
345
వ. గంగా తీరంబునం గ్రతువు లొనరించు గీర్వాణులం బూర్వగీర్వాణులు గాసి చేసిన, వసిష్ఠుని కడకు వారలు వలియం బాఱుదేరం గోపించిన యత్తాపసోత్తముని రోషానల జ్వాలలు సాకారంబులయి యాదైత్యలోకంబు నేర్చుటయుం జెప్పి, యక్కుంభసంభవుండును వసిష్ఠుండును శ్రేష్ఠులగుట రాజుల కొడఁబాటు గాదోకదే యని ననుం బలుక కున్న యన్నరపతితోడం బవమానుండు మఱియు నిట్లనియె. 346
AndhraBharati AMdhra bhArati - AndhramahAbhAratamu - #00# parvamu - kavitraya bhAratamu - kavitrayamu - nannaya - tikkana - eRRana - nannyya tikkanna eRRana - andhramahabharatamu aandhramahaabhaaratamu ( telugu literature andhra literature )